Syed Modi Grand Prix Gold
-
విజేత శ్రీకాంత్
సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ లక్నో: గత రెండేళ్లుగా రన్నరప్‌గా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-13, 14-21, 21-14తో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా)పై గెలుపొందాడు. 2014, 2015లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ ఈసారి విజేత హోదాలో 9 వేల డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్లో ఇది ఐదో టైటిల్. ఇంతకుముందు శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్ (2013), చైనా ఓపెన్ (2014), స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ (2015) టైటిల్స్‌ను సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ప్రణవ్-అక్షయ్ 21-14, 22-24, 8-21తో వీ షెమ్ గో-వీ కియోంగ్ తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. రెండో గేమ్‌లో ప్రణవ్-అక్షయ్ జోడీ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
విమర్శకులకు సమాధానమిదే!
న్యూఢిల్లీ: తన పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలాంటి విజయం చాలా అవసరమని భారత టాప్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెలవడం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. ‘సీజన్‌ను ఆరంభించడానికి ఇంతకంటే మంచిది లేదు. మలేసియా, సయ్యద్ మోడి ఈవెంట్లలో బాగా ఆడాలని నవంబర్లోనే అనుకున్నా. అయితే మలేసియాలో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాను. లక్కీగా ఇక్కడ మాత్రం టైటిల్‌ను నెగ్గా. ఈ టోర్నీలో రాణించాననే అనుకుంటున్నా. గతేడాది శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఆడాడు. ఒక్కసారిగా నాలుగో ర్యాంక్‌లోకి దూసుకురావడంతో ఇక అందరూ నా పని అయిపోయిందని విమర్శలు మొదలుపెట్టారు. ఈ టోర్నీని మొదలుపెట్టినప్పుడు చాలా మంది నేను ఫామ్‌లో లేనని భావించారు. నిరుడు బాగా ఆడలేదు. కాబట్టి ఈసారి కూడా కష్టమేనని వ్యాఖ్యానాలు చేశారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నా కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా. మూడు టోర్నీల్లో రెండింటిలో క్వార్టర్ ఫైనల్స్, ఒకదాంట్లో సెమీస్‌కు చేరా. కాకపోతే శ్రీకాంత్‌కు అన్నీ కలిసొచ్చి అద్భుతంగా ఆడాడు. దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ దశలో నాకు ఈ విజయం చాలా ముఖ్యం’ అని కశ్యప్ పేర్కొన్నాడు. ఆందోళన కలిగిస్తోంది... టైటిల్ గెలవడం ఆనందాన్ని కలిగించినా... మ్యాచ్ మధ్యలో పొత్తి కడుపు కండరం చిరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని కశ్యప్ వెల్లడించాడు. ‘నా పొత్తి కడుపు కండరంలో చిన్న చీలిక వచ్చింది. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. హైదరాబాద్‌లో మంచి ఫిజియోలు లేరు. ముంబై వెళ్లి పరీక్షించుకోవాలి. గాయంపై కాస్త ఆందోళనతో ఉన్నా. అయితే నేను తర్వాత ఆడబోయే టోర్నీ ఆల్ ఇంగ్లండ్ కాబట్టి చికిత్స తీసుకోవడానికి అవసరమైన సమయం ఉంది. టోర్నీ సమయానికి కోలుకుంటా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. శ్రీకాంత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ... ‘మంచి ఫామ్‌లో ఉన్నాడు. పోటీ బాగా ఇచ్చాడు. ఫలితం ఇలాగే ఉంటుందని ముందే ఊహించా. గురుసాయిదత్, ఇతర ఆటగాళ్లతో పోటీపడ్డాను. కానీ ఏడాది కాలంగా శ్రీకాంత్‌తో తలపడలేదు. మళ్లీ చైనా, హాంకాంగ్ టోర్నీల్లో ఎదురవొచ్చు. ఇది ఒలింపిక్స్ అర్హత ఏడాది కావడంతో షట్లర్లందరికీ చాలా ముఖ్యమైంది. ర్యాంకింగ్‌పై కాకుండా టోర్నీలు గెలవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టా’ అని కశ్యప్ వివరించాడు.