విజేత శ్రీకాంత్
సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
లక్నో: గత రెండేళ్లుగా రన్నరప్‌గా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-13, 14-21, 21-14తో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా)పై గెలుపొందాడు. 2014, 2015లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ ఈసారి విజేత హోదాలో 9 వేల డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.
ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఐదో టైటిల్. ఇంతకుముందు శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్ (2013), చైనా ఓపెన్ (2014), స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ (2015) టైటిల్స్‌ను సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ప్రణవ్-అక్షయ్ 21-14, 22-24, 8-21తో వీ షెమ్ గో-వీ కియోంగ్ తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. రెండో గేమ్‌లో ప్రణవ్-అక్షయ్ జోడీ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం.