టెకీలకు ఆ ఐటీ కంపెనీ 1500 ఉద్యోగాలు
సాక్షి, పుణే : ఓ వైపు ఆటోమేషన్, మరోవైపు విదేశీ మార్కెట్లలో రక్షణాత్మక విధానాలు దేశీయ టెకీలకు చుక్కలు చూపిస్తున్న క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సైనెక్రోన్ అనే మధ్య స్థాయి ఐటీ కంపెనీ వచ్చే 12 నెలల్లో 1,500 మందిని కొత్తగా తమ సంస్థలో నియమించుకోనున్నట్టు తెలిపింది. అదేవిధంగా తన రెవెన్యూలను కూడా 2020కి రెండింతలు చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం తమ ఐటీ కంపెనీలో 7500 మంది ఉద్యోగులున్నారని, వచ్చే 12 నెలల కాలంలో 1000-1500 మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫైసల్ హుస్సేన్ చెప్పారు. ఈ నియామకాలతో బెంగళూరు, హైదరాబాద్, పుణే ప్రాంతాల్లో, కంపెనీ తన ఉద్యోగులను 5000 మందికి పైగా పెంచుకోనున్నట్టు పేర్కొన్నారు. 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలు 390 మిలియన్ డాలర్లుగా ఉండబోతున్నాయని, ఇవి 2018కి వచ్చేసరికి 480 మిలియన్ డాలర్లకు పెంచుకుంటామని హుస్సేన్ చెప్పారు.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలలో అందిస్తున్న సేవలతో 25 శాతం కంటే ఎక్కువగా తమ రెవెన్యూ వృద్ధిని నమోదుచేయగలమని హుస్సేన్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాబోతున్న టెక్నాలజీలు డిజిటల్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, బ్లాక్-చైన్ టెక్నాలజీస్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో సైనెక్రోన్ వీటి నుంచి లబ్ది పొందనున్నట్టు కూడా పేర్కొన్నారు. నియమించుకోబోతున్న ఉద్యోగుల్లో 1000 మంది పుణేకి కేటాయించబోతున్నారు. పుణేలో ఈ కంపెనీకి అతిపెద్ద సింగిల్ డెవలప్మెంట్ సెంటర్ కలిగి ఉంది. చాలా నియామకాలు కూడా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల నుంచే ఉంబోతున్నాయని, కానీ ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమకు తగ్గట్టు ఉండాలని కోరారు. స్టార్టప్ మాదిరిగా ఇద్దరు స్నేహితులతో కలిసి, హుస్సేన్ ఈ సంస్థను 16ఏళ్ల క్రితం ప్రారంభించారు.