అసద్కే మా మద్దతు
టెహ్రాన్: పారిస్ ఉగ్రదాడి అనంతరం అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద రాజ్యాలనే తేడా లేకుండా ప్రపంచమంతా ఒక్కటై ఐఎస్ఐఎస్తో పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే ఉగ్ర సంబంధాలు గల దేశాలతో అనుబంధాలు తెంచుకుంటామని ప్రతినబూనాయి. అయితే సోమవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య జరిగిన సమావేశం గత తీర్మానాలను ప్రశ్నార్థకంగా మార్చింది.
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో శాంతి స్థాపన జరిగేలా ఎన్నికలు నిర్వహించాలన్న అంతర్జాతీయ సంస్థల నిర్ణయాన్ని ఆయతుల్లా కొట్టిపారేశారు. సదరు వ్యవహారమంతటినీ ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. శాంతి ముసుగులో అమెరికా తన సైన్యాన్ని సిరియాలోకి దించాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఇక్కడి భూభాగానికి పరోక్ష పాలకుడు కావాలనుకుంటున్నదని ఆరోపించారు. అమెరికా కుట్రలపై అన్నిదేశాలు అప్రమత్తంగా ఉండాలన్న ఇరాన్ సుప్రీం.. ప్రధానంగా ఇరాన్, రష్యాలకు ఆ అవసరం మరింత ఉందని పేర్కొన్నారు.
పుతిన్ తో జరిగిన సమావేశంలో ఆయతుల్లా ఇలా మాట్లాడారని, రష్యా అధ్యక్షుడు కూడా ఇరాన్ సుప్రీం అభిప్రాయంతో ఏకీభవించారని స్థానిక మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ లో పర్యటిస్తున్న పుతిన్.. ఆయతుల్లా రెండు గంటలు ఏకాంత చర్చలు జరిపారు.
ప్రస్తుత సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు తమ మద్దతు కొనసాగించాలని నిర్ణయించిన ఇరాన్, రష్యాలు.. మధ్యప్రాశ్చంలో పాశ్చాత్యుల పెత్తనాన్ని అంగీకరించేదిలేదని తేల్చిచెప్పాయి. దీంతో సిరియాలో ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గత జులైలో రష్యా- ఇరాన్ ల మధ్య కుదిరిన అణుఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అంతేకాక మిస్సైళ్లను ధ్వంసం చేయగల అత్యాధునిక ఎస్- 300 రాకెట్లను ఇరాన్ కు సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు రాకెట్ల ఎగుమతి ప్రక్రియను ప్రారంభించినట్లు మాస్కోలోని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మద్దతు తెలుపుతున్న అమెరికా.. ఆ మేరకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమెరికా నుంచి దిగుమతైన ఆయుధ సంపత్తిలో చాలావరకు ఐఎస్ఐఎస్ చేతిలోకీ వెళుతుండటం గమనార్హం. సున్నీ తెగకు చెందిన అసద్‌ను ఎలాగైనా సరే గద్దె దించాలని షియా వర్గీయులు తిరుగుబావుటా ఎగరేయటం, ఐఎస్ఐఎస్ కూడా షియాల నాయకత్వంలో నడుస్తుండటంతో ఈ రెండు పక్షాల మధ్య లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, ఏకైక అధికారిక సున్నీ దేశంగా కొనసాగుతున్న ఇరాన్.. తన వర్గానికే చెందిన అసద్‌కు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇటీవలే రష్యా కూడా అసద్‌కు మద్దతుపలికి తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు జరుపుతోంది.