తెలంగాణలో బీజేపీ మరో రథయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో రథయాత్ర నిర్వహించాలని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ పునర్నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలను ఈ యాత్రలో ప్రస్తావించాలని తీర్మానించింది. దీపావళి తర్వాత యాత్రకు శ్రీకారం చుడతారు. ఉద్యమ కమిటీ ఛైర్మన్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు అశోక్‌కుమార్, ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, టి.ఆచారీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గతంలో చేపట్టిన రథయాత్రకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఆయనతోనే మళ్లీ యాత్రను చేయించాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి తమ పార్టీ కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలని కమిటీ నిర్ణయించింది. పొత్తుల విషయంలో తమకు స్వేచ్ఛ నివ్వాలని, ఇరు ప్రాంతాలకు త్వరలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేయాలని కోరనుంది.