గాల్లోకి ఎగిరి.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ 19 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడేళ్ల కెరీర్ ఉంది. అయితే టెస్టు ఫార్మాట్లో ఇంతకుముందు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేకపోయాడు. షార్జాలో వెస్టిండీస్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆమిర్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఆమిర్ అందుకున్నది తొలి క్యాచే అయినా అద్భుతం చేశాడు.
పాక్ బౌలర్ జుల్ఫికర్ బాబర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో షాట్ ఆడబోయాడు. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న ఆమిర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆమిర్ బంతి పట్టుకున్న సమయంలో పూర్తిగా గాల్లో ఉన్నాడు. అతని శరీరం ఎక్కడా గ్రౌండ్‌కు టచ్ కాలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ పట్టిన క్రికెటర్ ఆమిరే. షార్జా టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయగా, వెస్టిండీస్ 337 పరుగులు చేసింది.
2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆమిర్‌తో పాటు పాక్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐదేళ్లు నిషేధం విధించారు. ఈ ఏడాది జనవరిలో ఆమిర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు.