Talent test
-
క్యాండిల్... ఓ ఎనర్జీ
మాధురీ దీక్షిత్లోని నటికి, డ్యాన్సర్‌కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు మాధురి. గాయనిగా తన ప్రతిభను చూపించబోతున్నారు. ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడారు మాధురి. ఈ పాటను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఓ చిన్న బహుమానం ఇది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఓ చిన్న ఆశలాగా, పాజిటివ్ ఎనర్జీలాగా ఈ పాట ఉంటుంది. మనందరం ఈ కష్టాన్ని (కరోనా) కలసి దాటేద్దాం’’ అని ట్వీట్ చేశారు మాధురీ దీక్షిత్. -
అనుమతి లేకుండా టాలెంట్ టెస్ట్
సాక్షి, విజయనగరం క్రైమ్: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్జీ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. పరీక్ష రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలను ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. ఐదో నుంచి పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖకు చెందిన ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం, బాలల హక్కులను తుంగలో తొక్కి పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘ ప్రతినిధులు సత్తి అచ్చిరెడ్డి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అక్కడ నుంచి జిల్లా విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడగా...పరీక్షల నిర్వహణకు ఎటువంటి అనుమతుల్లేవని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక తోటపాలెంలో ఉన్న పరీక్ష కేంద్రమైన ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హాల్‌టికెట్ చూపిస్తున్న విద్యార్థి పరీక్ష నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్, స్వేచ్ఛను హరించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే ఎంట్రన్స్, మోడల్ టెస్ట్‌లు వంటివి నిర్వహించుకోవాలే తప్ప అధిక రుసుం వసూలు చేయకూడదన్నారు. విద్యాశాఖ, పోలీస్, ఎస్ఎఫ్ఐ సహకారంతో పరీక్షను నిలిపివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మీలో ఎవరు విజేత?
హన్వాడ : మండల కేంద్రంలో మంగళవారం ‘మీలో ఎవరు విజేత’ కార్యక్రమం జరిగింది. దీనిని హన్వాడ జెడ్పీహెచ్ఎస్లోఉపాధ్యాయులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఐదోతరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలస్థాయిలో 18పాఠశాలల నుంచి 52మంది పాల్గొన్నారు. వీరందరికీ ప్రతిభా పరీక్ష నిర్వహించి పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో చివరకు కృష్ణవేణి, స్వాతి, భవాని, శ్రావణి, కవిత, బాలస్వామి రూ.వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు పురస్కారాలను గెలుచుకున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ జ్యోతి, ఎంఈఓ వెంకట్రాములు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మదన్, ఉపాధ్యాయులు విశ్వనాథం, రవీందర్ హాజరయ్యారు. -
సైన్స్‌పై అవగాహన పెంచేందుకు జేవీవీ కృషి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సైన్స్‌పై మరింత అవగాహన పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో డైట్లో పట్టణ స్థాయి చెకుముకి టాలెంట్టెస్ట్ జరిగింది. దాదాపు 47 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీషు మీడియంలో సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్, తెలుగు మీడియంలో నిర్మల విద్యామందిర్ పాఠశాలల విద్యార్థులు మొదటిస్థానం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్ధులనుద్ధేశించి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. సైన్స్‌ను నిత్యజీవితానికి అన్వయించడంలో లోపం జరుగుతుందని, దీనివల్లనే సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సైన్స్ ఫలాలు సామాన్యులకు అర్థం అయినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎస్కే. మస్తాన్, సమత జిల్లా కన్వీనర్ అమరావతి, పట్టణ అధ్యక్షుడు వర్ధెల్లి లింగయ్య పాల్గొన్నారు.