Tali constituency
-
మెగా ఫ్యాన్స్ మద్దతు హరికి లేదు
హొసూరు : తళి నియోజకవర్గంలో మెగా ఫ్యాన్స్ పేరుతో స్వతంత్ర అభ్యరి హరికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొనడాన్ని తళి నియోజక వర్గ మెగా ఫ్యాన్స్ ఖండించారు. ఈ సందర్భంగా భైరమంగలం మెగాఫ్యాన్స్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని అయిన తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్‌కు మెగా ఫ్యాన్స్ మద్దతు తెలిపి (సీపీఐ) ఆయనకు ఓటువేసి గెలిపించాలని మెగా అభిమానులు శేఖర్, రఘు, శ్రీనివాస్, మురళి, వినయ్, ఎస్.హరీష్, హరిబాబు, నవీన్, వెంకటరాజు, రమేష్, సి.ఆశ్వత్, జి.మునిరాజ్, సుబ్బారావు, రవి, ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
డెంకణీకోట : తళి నియోజక వర్గంలో ఆదివారం వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తింది. తళి నియోజకవర్గంలోని కెలమంగలంలో ఆదివారం వారపుసంత జరిగింది. ఈ సంతలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వ్యాపారులు, రైతులు రావడంతో రాజకీయ పార్టీల కెలమంగలంలో ప్రచారం హోరెత్తించారు. డీఎంకే ఆధ్వర్యంలో... డీఎంకే అభ్యర్థి వై. ప్రకాష్ ఆదివారం ఉదయం బైరమంగలం పంచాయతీ అగ్గొండపల్లి, ఎం.అగ్రహారం, బైరమంగలం, కుందుమారనపల్లి పంచాయతీలలో ప్రచారాన్ని ప్రారంభించారు. కెలమంగలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకుడు రామప్ప ఉన్నారు. కరుణానిధి చేపట్టిన పథకాలు, డీఎంకే ఎన్నికల ప్రణాళికను వివరిస్తూ ప్రచారం చేశారు. క్రిష్ణగిరి, ధర్మపురి, హొసూరు ప్రాంతాల నుండి ఆర్టీసి డ్రైవర్, కండెక్టర్ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వై.ప్రకాష్‌కు అగ్గొండపల్లిలో డీఎంకే నాయకుడు ఆనందయ్య ఘన స్వాగతం పలికారు. సీపీఐ ప్రచార హోరు.. ప్రజాసంక్షేమ కూటమి తళి సీపీఐ అభ్యర్థి టి. రామచంద్రన్ కెలమంగలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున డీఎండీకే, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుత పార్టీల నాయకులు వెంటరాగా రామచంద్రన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కెలమంగలం పంచాయతీ మాజీ అధ్యక్షుడు చన్న బసప్ప, సీపీఐ నాయకులు లెనిన్, కెలమంగలం పంచాయతీ చైర్ పర్సన్ సనాజ్ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. పీఎంకే అభ్యర్థి ప్రచారం తళి పీఎంకే పార్టీ అభ్యర్థి కెలమంగలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరుణ్‌రాజ్ పీఎంకే కార్యకర్తలతో కెలమంగలంలో ఊరేగింపుగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వందలాది మంది ఊరేగింపులో పాల్గొని ప్రచారం చేశారు. -
రేపు తళి నియోజక వర్గంలో వెంకయ్యనాయుడు ప్రచారం
డెంకణీకోట : తళి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్‌ను బలపరుస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డెంకణీకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తళి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన హెలిక్యాప్టర్‌లో వచ్చి డెంకణీకోటలో దిగి 30వ తేదీ ఉదయం డెంకణీకోటలో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారని తెలిపారు. తళి నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉన్నందు వల్ల వారి ఓటర్లను ఆకట్టుకోవటానికి బీజేపీ చేపట్టిన ప్రయత్నంలో భాగంగా వెంకయ్యనాయుడు ప్రచారం ఉంటుందన్నారు. -
తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే,సీపీఐ అభ్యర్థుల నామినేషన్లు
తరలి వచ్చిన వేలాది మంది డెంకణీకోట : తళి నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి సీపీఐ, విడుదల చిరుత, డీఎండీకే, తమిళమానిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రామచంద్రన్ అభిమానులు వేలాది మంది స్వచ్చందంగా తరలిరాగా తళి నియోజకవర్గ తళి నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి, తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్ డెంకణీకోట తాలూకాఫీసులో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టి. రామచంద్రన్ డీఎండీకే జిల్లా కార్యదర్శి చంద్రన్, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు వెంటరాగా రామచంద్రన్ చేత నామినేషన్లు రెండు సెట్లు దాఖలు చేయించారు. డెంకణీకోటలో ఎక్కడ చూసినా జనం ఇసుక వేస్తే నేలపై రాలనంత జనం. వీధులన్నీ ఎక్కడికక్కడే కదలని పరిస్థితి. ట్రాఫిక్‌జామ్‌తో సతమతమయ్యారు. డీఎండీకే, వీసీకె, తమిళమానిల కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టి పట్టణ వీధుల్లో ఊరేగింపు జరిపారు. డెంకణీకోట డీఎస్పీ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా నాగేష్ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. డెంకణీకోట తాలూకా కార్యాలయంలో అన్నాడీఎంకే నాయకులు సంపంగిరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.వి.మురళీధరన్‌లు వెంటరాగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు రైతు బజారు నుండి ఊరేగింపుగా వచ్చారు. రెండు ప్రధాన పార్టీ పార్టీలు ఒకే రోజు నామినేషన్లు వేయడంతో డెంకణీకోట పట్టణంలో ఎక్కడ చూసినా జనం కనపించారు. మండుటెండల్లో కార్యకర్తలు సేద తీరుర్చుకొనేందుకు నానా అవస్థలు పడ్డారు. -
తారస్థాయికి బీజేపీలో అసమమ్మతి
► మూడు రోజులుగా మూతపడిన కెలమంగలం బీజేపీ కార్యాలయం ► గుర్తింపు లేని వ్యక్తికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి డెంకణీకోట : తళి నియోజకవర్గంలో బీజేపీ అసమ్మతి కార్యకలాపాలు తారస్థాయికి చేరుకొన్నాయి. కెలమంగలంలోని సమితి బీజేపీ కార్యాలయం మూడు రోజులుగా మూతపడి ఉంది. తళి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఎక్కువ మంది అశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం హొసూరు, తళి, క్రిష్ణగిరిలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తళి నియోజకవర్గంలో టికెట్ కోసం కే,సి. మునిరాజు, ఎన్. గోపాలరెడ్డి వంటి పలుకుబడి, ఆర్థిక స్థోమత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి టికెట్ లభించలేదు. సామాన్య కార్యకర్తగా గుర్తింపు పొందిన బీ రామచంద్రన్‌కు టికెట్ లభించంతో తీవ్ర అసంతృప్తి బయలుదేరింది. ఆయన సరైన అభ్యర్థి కాదని పార్టీలో మరో వర్గం వాదిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకుడొకరు ఉద్దేశపూర్వకంగా తళి నియోజకవర్గంలో అసమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేశారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయానికి అద్దె చెల్లింపు ఖర్చులకు కూడా డబ్బులేదని గత మూడు రోజులుగా కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయాన్ని మూసివేశారు. కెలమంగలం సమితిలో భారతీయ జనతాపార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకోవడంతో జిల్లాలో పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మునిరాజు పరిస్థితిని చక్కదిద్దకపోతే బీజేపీ తళి నియోజవర్గంలో గడ్డుపరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందంటున్నారు.