రోడ్డెక్కనున్న బస్సులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మరికొన్ని రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల మీద రవాణాశాఖ వర్గాలు దృష్టి పెట్టాయి. 50 శాతం బస్సులు మాత్రమే నడిపే దిశగా కార్యచరణ సిద్ధమవుతోంది. మార్చి 24వ తేదీన లాక్డౌన్ అమల్లోకి రావడంతో అన్ని రకాల రవాణా సేవలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ జనం స్వస్థలాలకు చేరుకోలేక నిలిచి పోవాల్సిన పరిస్థితి. బంధువుల ఇళ్లలోనో, లేదా తమకు తెలిసిన వాళ్లు, మిత్రుల నివాసాల్లో తలదాచుకుని ఉన్న వాళ్లు ఎందరో. తాజాగా ఉత్తరాది వాసుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు తగ్గ కార్యచరణ సిద్ధమైంది. దశల వారీగా వీరిని వారి ప్రాంతాలకు రైళ్లల్లో తరలించనున్నారు.
లాక్డౌన్ ఆంక్షలు, నిబంధనల సడళింపుతో అనేక దుకాణాలు, చిన్న పరిశ్రమలు తెరచుకుని ఉన్నాయి. రవాణా వ్యవస్థ లేని కారణంగా ఎక్కడెక్కడో చిక్కుని ఉన్న వాళ్లు తమ ప్రాంతాలకు వెళ్ల లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో లాక్ కారణంగా చిక్కుకుని ఉన్న వాళ్లు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల్ని నడిపేందుకు తగ్గ కసరత్తుల మీదదృష్టి పెట్టారు.ఆయా విభాగాల మేనేజర్లకు రవాణాశాఖ కార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్ని రోడ్డెక్కించేందుకు సిద్ధంగా ఉండాలన్నట్టుగా ఆ ఆదేశాలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న రాష్ట్రంలోని పలు జిల్లాల వాసులకు ఊరట కల్గించినట్టు అయ్యింది. ఈనెల 17వ తేదీ తదుపరి 50 శాతం బస్సుల్ని రోడ్డెక్కించడం ఖాయం అని రవాణాశాఖ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.