పన్నులు సకాలంలో చెల్లించాలి
తమ్మరబండపాలెం(కోదాడరూరల్):వాహనదారులు తమ వాహనాల పన్నులను సకాలంలో చెల్లించి ఆర్టీఓ అధికారులకు సహకరించాలని జిల్లా ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం కోదాడ మం డలంలోని తమ్మరబండపాలెం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను, అధికారుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ఆర్టీఓ కార్యాలయ పరిధిలోని ఏడు మండలాలలోని పన్ను మినహాయింపు పోగ మిగి లిన వాహనదారులు తమ పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. లేకుంటే 200 శాతం అధిక పన్ను విధించాల్సి వస్తుందన్నారు.
జిల్లాలోనే మూడు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయని తెలి పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ నెల చివరి వరకు జిల్లాలో రూ.44.2కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పన్నుల ద్వారా రూ.16.42 కోట్లు, జీవితకాలం పన్నుల ద్వారా 18.40 కోట్లు, ఫీజుల ద్వారా 4.6కోట్లు, సర్వీస్ ట్యాక్స్ ద్వారా 1.42 లక్షలు, తనిఖీల ద్వారా 3.5 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీఓ ద్వారా జిల్లాకు కోట్లరూపాయాల ఆదాయం ఉండి సూర్యాపేటకు మాత్రమే సొంత భవనం ఉందన్నారు. మిగిలిన కార్యాలయాలకు కూడా నూతన భవనాల నిర్మాణాలకు, సొంతస్థలం కొరకు రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యాలయనికి వచ్చిన వాహనాదారులకు సమాచారాన్ని, సల హాలు ఇచ్చేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడను యూనిట్ ఆఫీసుగా మార్చేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు.
డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలోని వాహనదారులకు, డ్రైవర్లకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివి ధ శాఖల అధికారుల సమన్వయంతో కలెక్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల బస్సుల డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. విద్యార్ధులను పరిమిత సంఖ్యలో ఎక్కించుకోవాలని ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చెక్‌పోస్టుల పరిశీలన
కార్యాలయ పరిశీలన అనంతరం మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులోని అంతరాష్ట్ర ట్రాన్స్‌పోర్టులను పరిశీలించారు. జిల్లాలోని చెక్‌పోస్టులను మరింత పటిష్టంగా మారుస్తామని, కంప్యూటరైజ్డ్ బిల్లులుకు, అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రవాహనాలతో పాటు జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయినా వాహనాలకు చెక్‌పోస్టులలో తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు. ఆయన వెంట కోదాడ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి, చెక్‌పోస్టు ఎంవీఐలు షౌకత్అలీఖాన్, సాదుల శ్రీనివాస్ తదితరులున్నారు.