టాస్క్‌ఫోర్స్ వలలో ఆయిల్ మాఫియా
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో మాఫియా వెలుగు చూసింది. పకడ్బందీగా తమ కార్యకలాపాలు సాగిస్తోంది. ఏకంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నుంచే ఆయిల్‌ను మాయం చేస్తోంది. పోలీసులకు దొరకకుండా ఇన్నాళ్లూ సాగించిన వారి దందాకు టాస్క్‌ఫోర్స్ నిఘాతో గట్టి దెబ్బతగిలింది. పోలీసులు వలపన్ని మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తితోపాటు అతని అనుచరులను పట్టుకున్నారు.
నగర కమిషనర్ అమిత్‌గార్గ్ శుక్రవారం వారిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం 20 మందికిపైగా ముఠాతో ఆయిల్ దొంగతనాలకు పాల్పడేవాడు. తర్వాత అనుచరుల్లో మనస్పర్ధలు రావడంతో వారంతా ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతో కొంతకాలం అతని కార్యకలాపాలు తగ్గాయి. మళ్లీ వారిని చేరదీసి ముఠాగా ఏర్పరచి, పోర్టు, రైళ్లు, లారీల నుంచి ఆయిల్ దొంగిలించడం ప్రారంభించారు.
ఈ నేపధ్యంలోనే హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్, ట్యాంకర్ల నుంచి ఆయిల్ దొంగిలిస్తుండగా బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని మల్కాపురం పోలీసులకు అప్పగించారు. రెండు రోజులపాటు నిందితుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులకు... హెచ్‌పీసీఎల్ సంస్థలోని కొందరు సిబ్బందితోపాటు పోలీసు శాఖలో కొందరి నుంచి నిందితులకు సహకారం లభించినట్లు ఆధారాలు లభించినట్టు సమాచారం.