tata boeing aerospace
-
బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసిన తొలి ’వర్టికల్ ఫిన్’ భాగాన్ని అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రానికి పంపించినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏ) వెల్లడించింది. దీన్ని అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న బోయింగ్ ప్లాంటుకు డెలివరీ చేస్తారు. అక్కడ బోయింగ్ 737 విమానానికి అమరుస్తారు. నిట్టనిలువుగా ఉండే వర్టికల్ ఫిన్ భాగాన్ని విమానానికి స్థిరత్వాన్నిచ్చేలా ఎయిర్‌క్రాఫ్ట్ తోకపై ఏర్పాటు చేస్తారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బోయింగ్ కలిసి టీబీఏను జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన వర్టి కల్ ఫిన్ భాగాల తయారీ కోసం టీబీఏ గతేడాదే కొత్త లైన్‌ను ప్రారంభించింది. 14,000 చ.మీ. విస్తీర్ణంలోని టీబీఏ ప్లాంటులో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్టర్లకు కావాల్సిన ఏరో–స్ట్రక్చర్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. (ఇదీ చదవండి: డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...) -
రక్షణ, వైమానిక రంగాల్లో విస్తృత అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రక్షణ, వైమానిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాలతో పాటు ఆవిష్కరణలకు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రక్షణ, వైమానిక రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) హైదరాబాద్‌లోని తమ తయారీ యూనిట్లో తయారు చేసిన 100వ ‘ఏహెచ్ 64 అపాచీ యుద్ధ హెలికాప్టర్’ ఫ్యూజిలేజ్(మెయిన్ బాడీ)ను తయారు చేసింది. ఈ ఫ్యూజిలేజ్‌ను బోయింగ్‌కు సరఫరా చేసిన సందర్భంగా నిర్వ హించిన టీబీఏఎల్ విజయోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని, బెంగళూరు కంటే ఇక్కడే మెరుగైన మౌలిక వసతులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఎంతో పురోగతి..: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అనువైన వాతావరణం కోసం ఆదిభట్ల, ఎలిమినేడులో డిఫెన్స్ కారిడార్లతో పాటు ఏడు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. టాటా బోయింగ్, టీ–హబ్ ఆవిష్కరణల రంగంలో కలసి పనిచేయడాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా 9 స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఐదేళ్లలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఎఫ్‌డీఐ ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్–2020లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించిందని చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో అపూర్వమైన వృద్ధి సాధించినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ.. 2018, 2020లో బెస్ట్ స్టేట్ అవార్డు రాష్ట్రానికి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో ఉన్న ప్రపంచస్థాయి మౌలిక వసతుల వల్లే తాము ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించినట్లు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అన్నారు. కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ సుకరన్ సింగ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టాటా బోయింగ్ కేంద్రంలో కొత్త ప్రొడక్షన్ లైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ తయారీలో ఉన్న టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానం వెనుక భాగంలో ఉండే కీలక విడిభాగమైన వెర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం కొత్త ప్రొడక్షన్ లైన్‌ను జోడించింది. ఇక్కడ బోయింగ్ 737 రకానికి చెందిన విమానాల ఫిన్ స్ట్రక్చర్స్‌ను రూపొందిస్తారు. ఈ విస్తరణతో అదనపు ఉపాధి అవకాశాలతోపాటు నైపుణ్య అభివృద్ధికి వీలు కలుగుతుంది. బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా టాటా బోయింగ్ ఏరోస్పేస్ను హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద స్థాపించాయి. తాజా విస్తరణ మైలురాయిగా నిలుస్తుందని ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి జేవీకి ఉన్న నిబద్ధతకు కొత్త ప్రొడక్షన్ లైన్ మరొక నిదర్శనమని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో సుకరన్ సింగ్ తెలిపారు. నూతన లైన్‌ను చేర్చడం భారత అంతరిక్ష, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వృద్ధిలో గుర్తించదగ్గ ముందడుగు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ ఒక స్థాపిత కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున నిపుణులైన, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు ఇక్కడ కొలువుదీరారని తెలిపారు. కాగా, 14,000 పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ అత్యాధునిక ఫెసిలిటీలో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్లర్ల ప్రధాన భాగాలను సైతం తయారు చేస్తున్నారు. -
టాటాబోయింగ్ ఏరోస్పెస్ లిమిటెడ్ ఫ్లాంట్ ప్రారంభం
-
టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్‌కు శంకుస్థాపన
హైదరాబాద్: టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆదిభట్లలో శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు దేశ వైమానికరంగానికి తలమానికంగా మారనుందన్నారు. అపాచీ, హెలికాఫ్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ యూనిట్‌ను 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.