టాటా-బోయింగ్ 100వ అపాచీ ఫ్యూజ్‌లేజ్ డెలవరీ వేడుక కార్యక్రమంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రక్షణ, వైమానిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాలతో పాటు ఆవిష్కరణలకు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రక్షణ, వైమానిక రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) హైదరాబాద్‌లోని తమ తయారీ యూనిట్‌లో తయారు చేసిన 100వ ‘ఏహెచ్ 64 అపాచీ యుద్ధ హెలికాప్టర్’ ఫ్యూజిలేజ్(మెయిన్ బాడీ)ను తయారు చేసింది.
ఈ ఫ్యూజిలేజ్‌ను బోయింగ్‌కు సరఫరా చేసిన సందర్భంగా నిర్వ హించిన టీబీఏఎల్ విజయోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని, బెంగళూరు కంటే ఇక్కడే మెరుగైన మౌలిక వసతులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఐదేళ్లలో ఎంతో పురోగతి..:
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అనువైన వాతావరణం కోసం ఆదిభట్ల, ఎలిమినేడులో డిఫెన్స్ కారిడార్లతో పాటు ఏడు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. టాటా బోయింగ్, టీ–హబ్ ఆవిష్కరణల రంగంలో కలసి పనిచేయడాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా 9 స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఐదేళ్లలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఎఫ్‌డీఐ ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్–2020లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించిందని చెప్పారు.
ఏరోస్పేస్ రంగంలో అపూర్వమైన వృద్ధి సాధించినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ.. 2018, 2020లో బెస్ట్ స్టేట్ అవార్డు రాష్ట్రానికి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో ఉన్న ప్రపంచస్థాయి మౌలిక వసతుల వల్లే తాము ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించినట్లు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అన్నారు. కార్యక్రమంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ సుకరన్ సింగ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment