Tata Global Beverages
-
లారస్ లేబ్స్- టాటా కన్జూమర్ ఖుషీ
ప్రపంచ మార్కెట్ల ప్రోద్బలంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీ టాటా కన్జూమర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం... లారస్ లేబ్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి రెండు ఏఎన్‌డీఏలకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.5 శాతం పెరిగి రూ. 441 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457ను అధిగమించింది. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే టీఎల్ఈ-400, టీఎల్ఈ-600 ఔషధ విక్రయాలకు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు లారస్ లేబ్స్ తెలియజేసింది. అధ్యక్ష అత్యవసర పథకం(పెఫార్)లో భాగంగా వీటిని తక్కువ, మధ్యాదాయ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొంది. ఈ ట్యాబ్లెట్లను 300-400-600 ఎంజీ డోసేజీలలో రూపొందించనున్నట్లు వెల్లడించింది.కంపెనీలో ప్రమోటర్లకు 32.04% వాటా ఉంది. టాటా కన్జూమర్ భాగస్వామ్య సంస్థ నౌరిష్కో బెవరేజెస్‌లో విదేశీ దిగ్గజం పెప్సీకోకు గల వాటాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడికావడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 3.5 శాతం పుంజుకుని రూ. 360 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 363కు ఎగసింది. హిమాలయన్ మినరల్ వాటర్, టాటా గ్లూకో ప్లస్ తదితర బ్రాండ్ల నౌరిష్ కంపెనీలో పెప్సీకో, టాటా కన్జూమర్‌కు 50:50 వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు ద్వారా పానీయాల విభాగంలో టాటా కన్జూమర్ మరింత పట్టుసాధించే వీలుంటుందని నిపుణులు పేర్కొన్నారు. -
టాటా ఉప్పు’... కంపెనీ మారింది!
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్ బేవరేజెస్లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్ లిమిటెడ్ (టీసీఎల్) తెలిపింది. ప్రతీ టాటా కెమికల్ షేరుకు 1.14 టాటా గ్లోబల్ బేవరేజెస్ షేర్లు కేటాయిస్తారు. టాటా కెమికల్స్‌కు చెందిన ఉప్పు, మసాలాలు, పప్పులు తదితర ఆహారోత్పత్తులను టాటా గ్లోబల్ బేవరేజెస్ (టీజీబీఎల్) పరం అవుతాయి. ఆ తర్వాత టీజీబీఎల్ పేరును టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌గా మారుస్తారు. దీంతో రూ.9,099 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవతరిస్తుంది. ఈ మేరకు టాటా కెమికల్స్, టీజీబీఎల్ కంపెనీల బోర్డులు బుధవారం సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. టాటా కెమికల్స్ నుంచి కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేరు చేసి, టీజీబీఎల్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపాయి. వాటాదారులు, స్టాక్ ఎక్సేంజ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం ఈ వ్యాపార విలీనం జరుగుతుంది. నవ్యత కావాలి... తన ప్రధాన ఉత్పత్తుల విషయంలో టీజీబీఎల్‌కు నవ్యత అవసరమని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మరింత వృద్ధి అవకాశాల కోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరపు టీజీబీఎల్ కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అవకాశాలను సొంతం చేసుకునే విధంగా భవిష్యత్తు విధానాలు ఉండాలని, అందుకు తగిన విధంగా సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఆకాంక్షలను చేరుకునేందుకు శక్తిమంతమైన టాటా బ్రాండ్ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. వృద్ధికి మరింత అవకాశం ఇరు కంపెనీల వినియోగదారుల ఆధారిత వ్యాపారాన్ని ఏకం చేయడం వల్ల ఆహారం, పానీయాల మార్కెట్లో వాటా పెంచుకోవచ్చని, దీనివల్ల రెండు కంపెనీల వాటాదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. టీజీబీఎల్ టాటా టీ, టెట్లే పేరుతో టీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఎయిట్ ఓ క్లాక్ బ్రాండ్ కింద కాఫీని, ఇంకా బాటిల్డ్ వాటర్, గ్లూకోవిటా తదితర ఉత్పత్తులను సైతం మార్కెట్ చేస్తోంది. టాటా కాఫీ కూడా టీజీబీఎల్ అనుబంధ సంస్థే. ఇక టాటా కెమికల్స్ ప్రపంచంలో మూడో అతిపెద్ద సోడా యాష్ తయారీదారు. కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని డీమెర్జ్ చేసిన తర్వాత టాటా కెమికల్స్ పూర్తిగా బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీగా కొనసాగుతుంది. ‘‘ఎఫ్ఎంసీజీ విభాగంలో ఫుడ్, బేవరేజెస్ పరంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్థానం బలపడుతుంది. దేశీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకునేందుకు ఈ విలీనం ద్వారా బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాం’’ అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
టాటా గ్లోబల్ బెవరేజెస్ బోర్డులోకి మాజీ బ్యాంకర్
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు మాజీ సీఎండీ శిఖాశర్మ టాటా గ్లోబల్ బెవరేజెస్ బోర్డులో స్వత్రంత్ర, అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న శిఖా శర్మతోపాటు పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎండీ భరత్ పూరినీ కూడా బోర్డులోకి తీసుకున్నట్టు సంస్థ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. వీరి నియామకం మే 7, 2019 నుంచి అమల్లోకి వచ్చిందని, అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని టాటా గ్లోబల్ బేవరేజెస్ ప్రకటించింది. దీనికి రానున్న సాధారణ వార్షిక సమావేశంలో వాటా దారుల అనుమతి తీసుకోవాల్సింది అని తెలిపింది. కాగా శిఖా శర్మ 2004, జూన్ నుంచి డిసెంబరు 2018 వరకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరించారు. 1980లో ఐసీఐసీఐ బ్యాంకులో కరీయర్‌ను ప్రారంభించిన శర్మకు ఆర్థిక రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1982లో ఏసియన్ పెయింట్స్‌తో కరియర్‌ను ప్రారంభించిన భారత్ పూరి 2009 లో పిడిలైట్ ఇండస్ట్రీస్‌లో అదనపు డైరెక్టర్‌గా చేరారు. అనంతరం ఏప్రిల్, 2015 లో మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. -
వాటాలు పెంచుకుంటున్న టాటా సన్స్
► గ్రూపు కంపెనీల్లో తాజా కొనుగోళ్లు ► టాటా మోటార్స్‌లో 1.7 శాతం.. ► టాటా గ్లోబల్ బేవరేజెస్లో 4.31% న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల్లో మాతృ సంస్థ టాటా సన్స్ వాటాలను పెంచుకునే పనిలో పడింది. మంగళవారం ఒక్కరోజే టాటా మోటార్స్, టాటా గ్లోబల్ బేవరేజెస్లో వాటాలను కొనుగోలు చేసింది. టాటా మోటార్స్‌లో 1.7%కి సమానమైన షేర్లను బ్లాక్ డీల్‌లో టాటా స్టీల్ నుంచి కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.421.56 చొప్పున చెల్లిం చింది. సోమవారం నాటి క్లోజింగ్ ధర కంటే ఇది 4% అధికం. ఇందుకు గాను రూ.2,000 కోట్లు వ్యయం చేసింది. ఈ వార్తతో టాటా మోటార్స్ షేరు ధర ఏకంగా 4.6% పెరిగి రూ.423.65 వద్ద క్లోజయింది. టాటా సన్స్ గతేడాది డిసెంబర్‌లోనూ టాటా మోటార్స్‌లో 1.7% వాటాను పెంచుకుంది. అప్పుడు ఒక్కో షేరుకు రూ.486 చొప్పున చెల్లించింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడానికి ఏర్పాటు చేసిన వాటాదారుల భేటీకి ముందు ఈ లావాదేవీ జరిగింది. కాగా, గ్రూపు కంపెనీలను ఇతర సంస్థలు కొనుగోలు చేసే ముప్పు నుంచి రక్షించుకునేందుకు గాను వాటిల్లో తన వాటాలను పెంచుకోవాలనే లక్ష్యంతో టాటా సన్స్ ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక, టాటా గ్లోబల్ బెవరేజెస్‌లో 4.31%కి సమానమైన 4,31,75,140 ఈక్విటీ షేర్లను టాటా సన్స్ మరో గ్రూపు సంస్థ టాటా కెమికల్స్ నుంచి సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.213.35 చొప్పున చెల్లించగా, ఈ డీల్ విలువ రూ.921 కోట్లు. -
టాటా గ్లోబల్ బెవరేజస్ చైర్మన్‌గా ఆయనే!
న్యూఢిల్లీ : టాటా సన్స్ అధినేత ఎన్ చంద్రశేఖరన్‌నే టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈయన నియామకం అమల్లోకి రానున్నట్టు బోర్డు పేర్కొంది. నేడు బోర్డు మీటింగ్ నిర్వహించిన సమావేశంలో టాటా గ్లోబల్ బెవరేజస్ లిమిటెడ్ చంద్రశేఖరన్‌ను అదనపు డైరెక్టర్‌గా, చైర్మన్‌గా నియమిస్తున్నట్టు నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్‌గా ఉన్న హరీష్ భట్ రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంద్రశేఖరన్ ఈ పదవిలోకి వచ్చారని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాక నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సిరాజ్ అజ్మాత్ చౌదరిని బోర్డు నియమించింది. గతేడాది టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని గ్రూప్ కంపెనీలో ఒకటైన టాటా గ్లోబల్ బెవరేజస్ కూడా తన కంపెనీ చైర్మన్‌గా తొలగించింది. దీంతో సైరస్ మిస్త్రీ స్థానంలో భట్ ఆ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తుండటంతో టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్‌నే ఇక ఈ కంపెనీకీ చైర్మన్‌గా సారథ్యం వహించనున్నారు. -
టాటా మరో వికెట్ డౌన్
ముంబై: టాటా గ్రూపు నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఆయన సన్నిహితులపై టాటా గ్రూపు వేటు వేసింది. దీంతోపాటు మిస్త్రీ అనుయాయులు కొంతమంది రాజీనామా చేశారు. అయితే తాజాగా టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్ బెవరేజెస్ సంస్థ బోర్డుకు మరో డైరెక్టర్ గుడ్ బై చెప్పారు. టాటా బేవరేజెస్ స్వతంత్ర డైరెక్టర్, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీ ఛైర్మన్ అనల్జిత్ సింగ్ మంగళవారం రాజీనామా చేశారు. నవంబరు 15న జరిగి టాటా గ్లోబల్ బోర్డు సమావేశంలో మిస్త్రీకి ఉద్వాసనకు వ్యతిరేకంగా వాదించిన డైరెక్టర్లలో అనల్జిత్ కూడా ఒకరు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా చేశారని టాటా గ్లోబల్ ప్రకటించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా టాటా గ్రూపు నుంచి ఛైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీని టాటా గ్లోబల్ ఇటీవల తొలగించింది. పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపు నేపథ్యంలోనే టాటా గ్లోబల్ కూడా మిస్త్రీని ఛైర్మన్ గా తొలగించిని సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో స్టార్‌బక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కాఫీ ఆస్వాదించేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని టాటా స్టార్‌బక్స్ అంటోంది. ఇక్కడి వారు చవక టీ తాగేవాళ్లు అన్న అభిప్రాయం చాలా కంపెనీలకు ఉంది. ఇదంతా తప్పని తమ అనుభవమే నిరూపిస్తోందని కంపెనీ సీఈవో అవని దావ్దా తెలిపారు. రెండేళ్లలోనే భారత్‌లో స్టార్‌బక్స్ 58 ఔట్లెట్లను ఏర్పాటు చే యడాన్నిబట్టి చూస్తే ప్రీమియం కాఫీకి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. విభిన్న కాఫీ రుచులతోపాటు అంతర్జాతీయ అనుభూతిని కస్టమర్లు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో స్టోర్ డిజైన్ దేనికదే ప్రత్యేకమని ఆమె వివరించారు. స్టార్‌బక్స్ స్టోర్‌ను మంగళవారమిక్కడి జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ల సంయుక్త కంపెనీయే స్టార్‌బక్స్. ఈ స్టోర్లలో కాఫీతోపాటు ఇతర ఆహారోత్పత్తులు విక్రయిస్తారు. 12-15 శాతం వృద్ధి.. భారతీయ కాఫీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అవని చెప్పారు. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 12-15 శాతం వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ‘50 నగరాలు మా రాడార్‌లో ఉన్నాయి. ఒక్కో నగరానికి ఎటువంటి రుచులను ఆఫర్ చేయాలి అన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నాం’ అని అన్నారు. అగ్రస్థానానికి రావాలని అన్ని కంపెనీలకూ ఆశయం ఉంటుందని, ఇందులో స్టార్‌బక్స్ కూడా ఒకటని తెలిపారు. స్టోర్లలో కస్టమర్లకు ఉచిత వైఫై సౌకర్యమూ ఉంటుంది. హైదరాబాద్ ఫోరమ్ మాల్లోనూ స్టోర్ ఏర్పాటైంది. ముంబై, ఢిల్లీ, పునే, బెంగళూరు, చెన్నైలో స్టోర్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విస్తరించింది.