ప్రపంచ మార్కెట్ల ప్రోద్బలంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్, ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీ టాటా కన్జూమర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...
లారస్ లేబ్స్
యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి రెండు ఏఎన్‌డీఏలకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్ కౌంటర్ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3.5 శాతం పెరిగి రూ. 441 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457ను అధిగమించింది. హెచ్‌ఐవీ చికిత్సకు వినియోగించే టీఎల్‌ఈ-400, టీఎల్‌ఈ-600 ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు లారస్ లేబ్స్ తెలియజేసింది. అధ్యక్ష అత్యవసర పథకం(పెఫార్)లో భాగంగా వీటిని తక్కువ, మధ్యాదాయ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొంది. ఈ ట్యాబ్లెట్లను 300-400-600 ఎంజీ డోసేజీలలో రూపొందించనున్నట్లు వెల్లడించింది.కంపెనీలో ప్రమోటర్లకు 32.04% వాటా ఉంది.
టాటా కన్జూమర్
భాగస్వామ్య సంస్థ నౌరిష్‌కో బెవరేజెస్‌లో విదేశీ దిగ్గజం పెప్సీకోకు గల వాటాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడికావడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం పుంజుకుని రూ. 360 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 363కు ఎగసింది. హిమాలయన్ మినరల్ వాటర్, టాటా గ్లూకో ప్లస్ తదితర బ్రాండ్ల నౌరిష్ కంపెనీలో పెప్సీకో, టాటా కన్జూమర్‌కు 50:50 వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు ద్వారా పానీయాల విభాగంలో టాటా కన్జూమర్ మరింత పట్టుసాధించే వీలుంటుందని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment