tavera
-
ట్రా‘వెల్’ బిజినెస్!
* ప్రచారంలో రోజుకు వేల సంఖ్యలో అద్దె వాహనాలు * గత వారం రోజులుగా భారీగా పెరిగిన వినియోగం సాక్షి, సిటీబ్యూరో: ఇంటిల్లిపాదీ కలసి ఇన్నోవా, టవేరా వంటి వాహనాలను అద్దెకు తీసుకొని తిరుమలేశుని దర్శనానికో... బంధువుల ఇళ్లకో వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అవును... ప్రస్తుతం నగరంలోని అద్దె వాహనాలన్నీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు సమకూర్చడంలో ట్రావెల్స్ కంపెనీలు బిజీబిజీగా ఉన్నాయి. గత వారం రోజులుగా నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార రథాలు, అభ్యర్థుల పర్యటనలకు వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఇండికా వంటి చిన్నవి మొదలుకొని.. క్వాలిస్, స్విఫ్ట్‌డిజైర్, ఫార్చునర్, ఎర్టిగా, గ్జైలో తదితర వాహనాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ట్రావె ల్స్ కంపెనీల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో ట్రావెల్స్ కంపెనీలు సైతం బాగానే డిమాండ్ చేస్తున్నాయి. వాహనం సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 100కు పైగా ట్రావెల్స్ కంపెనీలకు ఎన్నికల కాలం బాగా కలసి వస్తోంది. నగరంలో ప్రస్తుతం 1,333 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు నిత్యం 10 వేల వరకు వాహనాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలను బస్తీలకు, కాలనీలకు తరలించడంలోనూ, ముఖ్యమైన నాయకుల రోడ్‌షోలకు వాహనాల వినియోగం తప్పనిసరి కావడంతో చాలా మంది అభ్యర్థులు సగటున 5 నుంచి 10 వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. నగరంలోని ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండడంతో వరంగల్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచీ వాహనాలను తీసుకొస్తున్నారు. ఆటోలకూ గిరాకీ... చిన్న చిన్న బస్తీలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఆటోలను వినియోగిస్తున్నా రు. దీంతో వీటికీ డిమాండ్ పెరిగింది. పార్టీ బ్యానర్లు, అభ్యర్థుల నిలువెత్తు చిత్రాలు, ప్రచార సామగ్రి, మైక్సెట్లతో హోరెత్తించే ఆటోరిక్షాలు నగరంలో విరివిగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదారు వేలకు పైగా ఆటోలు ప్రచార రథాల అవతారమెత్తాయి. వీటికి ఏ రోజుకు ఆ రోజు వారు తిరిగిన దూరం మేరకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు. ‘అధికార’ ఒత్తిడి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల కోసం తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అతి కష్టంగా వాహనాలను సమకూర్చినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదని కొందరు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సి వస్తోందని... ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. -
మృత్యుఘోష
టవేరాలో విహారయాత్రకు బయలుదేరిన ఏడుగురు స్నేహితులు తిరుపతి వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం, మహానందిలో శివుడికి పూజలు చేశారు. చిలుకూరి బాలాజీని దర్శించుకునేందుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో యుముడు వెంబడించినట్లు.. మృత్యువు తరిమినట్లు అతివేగంగా డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఆరుగురు కూర్చున్నచోటే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లో చదువుతున్న కొడుకును చూసి వెళ్తున్నామన్న ఆనందం మరవకముందే మృత్యువు ఓ తల్లిని కబళించేసింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. రక్తసిక్తమైన ఈ ప్రాంతమంతా హృదయవిదాకరంగా మారింది. అడ్డాకుల: మండలంలోని కొమిరెడ్డిపల్లి వద్ద జరిగిన మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగు రు స్నేహితులు, మరో మహిళ ఉన్నారు. మృతులను మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెం దిన వారిగా గుర్తించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాం దేడ్ జిల్లా నాయిగావ్‌కు చెందిన ఏడుగురు మిత్రులు డ్రైవర్‌తో కలిసి టవేరా వాహనంలో ఈనెల 23న విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం, మహానందిని దర్శించుకుని సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనానంతరం అదేరోజు రాత్రి 10 గంటలకు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీని దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న టవెరా వాహనం కొమిరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను దాటి పక్కరోడ్డుపై ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. అందులో ఉన్న ఆరుగురు వాహనంలోనే ప్రాణాలు విడిచారు. టవెరాలో ఉన్న డ్రైవర్ గణేష్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. వెనుక సీట్లో ఉన్న శివదాస్ శంకర్రావు పడోలే, ఇన్నోవాలో ఉన్న ఫైజల్, ఆయన కొడుకు ఆసిమ్ తీవ్రంగా గాయపడ్డారు. ఫైజల్ భార్య సింధు(45) ముందు సీటులోనే మృత్యువాతపడింది. గాయపడిన గణేష్, శివదాస్శంకర్రావ్ పడోలే, ఫైజల్, ఆసిమ్‌ను చికిత్సకోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శివదాస్ మినహా ముగ్గురు స్థానిక ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనస్థలానికి వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ కిషన్, అడ్డాకుల ఎస్ఐ ఎం.వెంకటేశ్వర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత్యువులోనూ వీడని స్నేహం నాందేడ్ జిల్లా నాయిగావ్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. వారిలో కొందరు నగల తయారీ, మరి కొందరు పాన్‌షాపు, జనరల్ స్టోర్ నిర్వహించుకునేవారు. అందరు కలిసి విహారయాత్రకు బయలుదేరారు. మొక్కుకున్న దేవుళ్లను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. కానీ విధి వారిని మరణంలో ఒక్కటి చేసింది. టవేరా బోల్తాపడిన సంఘటనలో స్నేహితులు ఒకరిపై ఒకరు పడిపోయి సీట్లలోనే ప్రాణాలు విడిచారు. టవేరాలో స్నేహితుల మృతదేహాలను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. కొడుకును చూసి వెళ్తూ.. కేరళలోని తిరుచూరుకు చెందిన ఫైజల్ చిన్నకొడుకు హసిక్ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఫైజల్ ఆయన భార్య సింధు, పెద్దకొడుకు ఆసిమ్‌తో కలిసి ఇన్నోవాలో కేరళ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ కొడుకును చూసి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో బెలూన్ తెరుచుకోలేదు. వాహనం నడుపుతున్న ఫైజల్ సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ తెరుచుకుని ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అతివేగమే ప్రాణం తీసిందా.. తిరుపతి నుంచి వేగంగా వస్తున్న టవేరా వాహనం అదుపుతప్పి తక్కువ ఎత్తులో ఉన్న డివైడర్ మీదుగా పక్కరోడ్డు మీదికి దూసుకెళ్లింది. బోల్తాపడుతూనే అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఫల్టీలు కొడుతూ తలకిందులుగా నిలిచిపోయింది. ఇన్నోవా మాత్రం ప్రమాదం జరిగిన చోటే నిలిచిపోయింది. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఫైజల్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాద సమయంలో టవేరా గంటకు 140కి.మీ వేగంతో ప్రయాణిస్తుండవచ్చని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. మృత్యుంజయుడితోనే వివరాలు..! స్నేహితులను కోల్పోయిన శివదాస్శంకర్ స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనే మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించాడు. ఒక్కొక్కరి వివరాలను పోలీసులకు వెల్లడించారు. లేకుంటే మృతదేహాల గుర్తించడం కష్టసాధ్యమయ్యేది. కాగా, మృతుల బంధువులు సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనస్థలాన్ని పరిశీలించిన ఆర్టీఓ కొమిరెడ్డిపల్లి వద్ద ప్రమాదస్థలిని మహబూబ్‌నగర్ ఆర్టీఓ ఎల్.కిష్టయ్య, ఎంవీఐ వెంకటేశ్వర్లు సందర్శించారు. డివైడర్ వద్ద టవేరా పక్కరోడ్డు మీదకు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. అడ్డాకుల ఠాణాకు తీసుకెళ్లిన టవేరాను అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టవేరాను ఢీకొన్న బస్సు, ముగ్గురు మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెజ్జంకి మండలం తోటపల్లి సమీపంలో టవేరా కారును ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఇంటి పెద్దల మృతితో బాధిత కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. వ్యాపార విషయమై హైదరాబాద్ నుంచి సొంతూరికి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం 8 మంది కారులో ఉన్నట్లు తెలిసింది. -
టవేరాను ఢీకొన్న బస్సు, ముగ్గురు మృతి