tb hospital
-
టీబీ ఆస్పత్రిలో ఆకలి కేకలు
అనంతగిరి/వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్ట టీబీ శానిటోరియంలో చికిత్స పొందుతున్న రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 40 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారికి నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మందులను ఉచితంగా అందజేస్తారు. కానీ సదరు కాంట్రాక్టర్‌కు 14 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. ఇన్నాళ్ల పాటు అప్పులు చేసి భోజనం వడ్డించిన కాంట్రాక్టర్ జనవరి 31 నుంచి ఆపేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని నాలుగు రోజులుగా రోగులకు భోజనం అందిస్తున్నారు. ఇక్కడి పరిస్థితి తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ ఫైముదాబేగమ్‌ఖాజా కూడా ముందుకు వచ్చి రోగులకు ఆహారం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 9 మంది వైద్యులు, ఒక సూపరింటెండెంట్, ఆర్ఎం ఇక్కడ సేవలు అందించాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క వైద్యురాలు (మృదుల) మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఉద్యోగా.. పార్టీ ప్రతినిధా..?
విశాఖసిటీ: నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఓ సర్కారు ఉద్యోగి పార్టీ ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. నగరంలోని టీబీ ఆస్పత్రిలో ఎంఎన్‌వోగా విధులు నిర్వర్తిస్తున్న బి. బాలకృష్ణ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. మహానాడు సందర్భంగా.. పలు చోట్ల ఆయన ఫొటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. పార్టీ పదవులు చేపడుతున్న బాలకృష్ణ సీసీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. బాలకృష్ణ వ్యవహార శైలిపై టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. -
ఆస్పత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రి సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన టీబీ రోగి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయాడు. దీనిపై అతని కుటుంబీకులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వార్డు బాయ్స్ ఇద్దరు రూ.150లంచం అడిగారని, ఇవ్వకపోవటంతో ఆక్సిజన్ పెట్టకుండా రోగి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బందితోపాటు ఇద్దరు వార్డు బాయ్స్‌పై ఆదివారం రాత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన ఆయన సంబంధిత ఇద్దరు వార్డుబాయ్‌లను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత మిగతా వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. -
ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
హైదరాబాద్: ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి మృతిచెందాడు. కాగా, ఆక్సిజన్ పెట్టాలంటే రూ.150, మందులు ఇవ్వాలంటే రూ.300 లంచం.. ఇలా చికిత్స కోసం వచ్చిన రోగుల వద్ద డబ్బుల కోసం వార్డు బాయ్ వేధిస్తున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందువల్లనే సరైన చికిత్స అందక కృష్ణ మృతి చెందాడంటూ అతని బంధువులు మృతదేహంతో ఆస్పత్రిలో ధర్నా చేస్తున్నారు. -
ఐదుగురు హెడ్‌నర్సులు మెడికల్ కాలేజీకి..
నెల్లూరు(విద్యుత్): టీబీ హాస్పిటల్‌తో పాటు డీఎస్సార్ ఆస్పత్రి(పెద్దాసుపత్రి) నుంచి ఐదుగురు హెడ్‌నర్సులను మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుతుండగా కొందరికే అవకాశం కల్పించడమేంటమని మిగిలిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు వెలువడిన ప్రక్రియపై అభ్యంతరం తెలిపారు. నగరంలోని డీఎస్సార్, జూబ్లీ, రేబాల, టీబీ ఆస్పత్రులకు సంబంధించిన వైద్యాధికారులు, హెడ్‌నర్సులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల వీరంతా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి విన్నవించారు. ప్రస్తుతం డీఎస్సార్, రేబాల హాస్పిటళ్లలో 36 మంది, టీబీ హాస్పిటల్లో ఆరుగురు, జూబ్లీ హాస్పిటల్లో 17మంది వైద్యాధికారులు పనిచేస్తున్నారు. అలాగే స్టాఫ్‌నర్సులు 110 మంది, హెడ్ నర్సులు 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్సార్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, టీబీ ఆస్పత్రి నుంచి ఇద్దరు హెడ్‌నర్సులను వైద్య కళాశాల పరిధిలోకి తీసుకోవాలని మంగళవారం నిర్ణయం ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి డీఎస్సార్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ఠాగూర్కు ఈ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న మిగిలిన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటుంటే కొందరే దొడ్డిదారిన నియామక పత్రాలు ఎలా తెచ్చుకుంటారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం డీఎంఈ నేరుగా వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్)కు నియామక ఉత్తర్వులు రావాలని, కానీ నేరుగా డీఎంఈ నుంచి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఎలా పంపుతారని మండిపడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పనిచేస్తా ఐదుగురు హెడ్నర్సులకు సంబంధించి నియామక పత్రాలు వచ్చిన విషయం వాస్తవమే. ఈ విషయంపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించాను. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. రవీంద్రనాథ్ఠాగూర్, మెడికల్ సూపరింటెంట్