సింగరేణిలో హర్షాతిరేకాలు
శ్రీరాంపూర్ : తెలంగాణ ఉద్యమంతో పాటు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఎన్నికల్లోను, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి నెరవేర్చుతున్నాయి. పార్టీ మెనిఫెస్టోలో సింగరేణికి సంబంధించిన అంశాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి అమలుకు కేసీఆర్ ప్రభుత్వం అడుగులేస్తోంది. సీఎం కేసీఆర్‌తో సింగరేణి యాజమాన్యానికి, గుర్తింపు సంఘం టీబీజీఎస్కు మధ్య చర్చలు జరిగాయి.
ఈ సమావేశం జరుగుతుం దని టీవీ చానళ్లలో వార్తలు వ స్తున్నంత సేపు ఏం జరుగుతుందో.. ఎలాంటి నిర్ణయం వస్తుం దోనని కార్మికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. సమావేశం అనంతరం టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఏ కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి మీడియాలకు వివరాలు వెల్లడించడంతో కార్మికులు సంబర పడ్డారు. ముఖ్యంగా తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మెలో కార్మికులు కోల్పోయిన వేతనంపై సానుకూల నిర్ణయం రావడంతో అన్ని గనులపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణిలో లోతైన సమీక్ష...
సింగరేణిపై లోతైన సమీక్ష జరిపిన తరువాత కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సకలజనుల సమ్మెలో సింగరేణి కార్మికులు ఎంతో విరోచితంగా పోరాడారు. ఒక్క బొగ్గు పెళ్లను కూడా సింగరేణి నుంచి కదలనివ్వలేదు. దీంతో దక్షణాధి రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తి దాని ప్రభావం ఢిల్లీ పెద్దలకు సెగ తగిలేలా చేసింది సింగరేణి కార్మికులే. దీన్ని కేసీఆర్ పలుసార్లు తన ప్రసంగాల్లోనూ గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో కూడా కేసీఆర్ కార్మికులకు అనేక వరాలు కురిపించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వస్తే సకల జనుల సమ్మెలో కార్మికులు కోల్పోయిన వేతనం ఇప్పించుకుంటామని చెప్పారు.
అన్నట్లుగానే నేడు సమ్మె కాలం రోజులకు ప్రత్యేక లీవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్మికులు ఎన్ని రోజులు సమ్మెలో ఉన్నారో అన్ని రోజులు లీవ్‌లుగా పరిగణిస్తూ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేస్తారు. దీంతో నిన్న మొన్నటి వరకు రికవరీ అయిన రూ.25 వేల సమ్మె అడ్వాన్స్‌ను తిరిగి ఇప్పిస్తే చాలనుకున్న కార్మికులు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనం చేకూరనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో అండర్ గ్రౌండ్ కార్మికునికి కనీసం రూ.40వేల నుంచి రూ.50వేల వరకు లీవ్‌లతో ఎన్‌క్యాష్ అవుతుంది.
ఇంక్రిమెంట్‌తో వేతనాలు పెరుగుదలు..
తెలంగాణ వస్తే కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తానని కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతీ కార్మికునికి ఇంక్రిమెంట్ రావడంతో వేతనాల్లో ఘననీయమైన పెరుగుదల ఉంటుంది. ఒక్కో కార్మికునికి రూ.500 నుంచి రూ.1000 వరకు వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. దీంతో ప్రతీ కార్మికునికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నందుకు మేలు జరిగిందని కార్మికులు భావిస్తున్నారు.
సింగరేణిపై చెరగని ముద్ర..
కేసీఆర్ సింగరేణిపై చెరగని ముద్ర వేసుకునే నిర్ణయాలే తీసుకున్నారు. 125 ఏళ్ల సింగరేణి సంస్థపై నేడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైంది. బ్రిటీష్ పాలకుల నుంచి నైజాం న వాబుకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి ప్రస్థానం సాగింది. ఏపీలో కలిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం వాటాగా ఉంటూ వచ్చాయి. అధికంగా రెండు శాతం రాష్ర్ట ప్రభుత్వం వాటాతో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సంస్థ నడిచింది.
ఐనప్పటి కీ కేంద్రం చేతుల్లోనే పెత్తనం ఉంటోంది. ఈ పెత్తనం పోయి పూర్తిగా తెలంగాణకే సంస్థ దక్కేలా చారిత్రాత్మకమైన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటాను మనమే కొనుగోలు చేస్తే అటు సంస్థకు ఇటు తెలంగాణకు ఆర్థికంగా ఎంతో మేలు జరగడమే కాకుండా సంస్థపై పూర్తిగా తెలంగాణకే పట్టు ఉంటుందని భావించి కేసీఆర్ ఈ వాటాను కోనుగోలుకు నిశ్చయించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీనికి తోడు కొత్తగా 6 గనులు త్వరితగతిన చేపట్టాలని చెప్పడంతో ఈ ప్రాంత నిరుద్యోగుల్లో ఆశ కలుగుతోంది.
సంక్షేమంపై కూడా దృష్టి..
దీనికి తోడు కార్మికులు కంపెనీకి రూ,కోట్ల లాభాలు గడించి పెడుతున్నా వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. వైద్యం కోసం కంపెనీ దవాఖానాలున్నా వసతులు లేక కార్పొరేట్‌కు తరలిస్తున్నారు. దీంతో కంపెనీకి ఆర్థికంగా నష్టమే కాకుండా కార్మికులకు సరైన వైద్యం అందడం లేదు. దీంతో సింగరేణి ఉన్న నాలుగు జిల్లాల్లో మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు చేయాలని యాజమాన్యానికి సీఎం సూచించడం శుభపరిణామం. దీంతో కార్మికులకు వైద్యంతో పాటు, వారి పిల్లలకు మెడికల్ విద్య అందనుంది.
బ్యాక్ బోన్ నర్సింగ్రావే..
తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణే. బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉంది. విద్యుత్ ఇస్తేనే పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. సింగిల్‌విండో ద్వారా కొత్త పారిశ్రామిక పాలసీ తయారు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందుగా సింగరేణిని అభివృద్ధి చేసుకుంటేనే ఈ పారిశ్రామిక ప్రగతి, రైతులకు కరెంట్ అన్నీ అందించగలుగుతుంది. దీనికి సింగరేణి ఎంతో అవసరం.
సింగరేణిలో సీఅండ్ఎండీగా 5 ఏళ్లు పని చేసి కోలిండియా చైర్మన్‌గా వెళ్లిన ఎస్.నర్సింగ్రావును కేసీఆర్ ఇందుకోసమే తెలంగాణ సర్వీసుకు తిరిగి తీసుకువచ్చి ఆయనను ప్రిన్సిపల్ సెక్రెటరీగా పెట్టుకున్నారు. కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలో నర్సింగ్‌రావు ముద్ర ఉంటోంది. సింగరేణి విషయంలో ఆయనే సీఎంకు బ్యాక్‌బోన్. పరిశ్రమ మనగలిగే నిర్ణయాలు ఎలా ఉండాలో నర్సింగ్‌రావుకు తెలుసు. కేసీఆర్ నర్సింగ్‌రావు నుంచి పూర్తి రిపోర్టు తీసుకుని కసరత్తు చేసిన తరువాతే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సింగరేణిలో మేధావులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...
సింగరేణిలో కార్మికులందరికీ అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్మిక వర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ ఇంక్రిమెంట్, సకలజనుల సమ్మె కాలానికి సెలవు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు ఆయనకు కార్మిక సంక్షేమంపై ఉన్న శ్రద్ధను తెలుపుతోంది.
- మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
కార్మిక సమస్యలపై సీఎం సానుకూలం
సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సానుకూలంగా ఉన్నా రు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కార్మికులు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తించా రు. సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాల వల్ల కార్మికులకు మేలు జరుగుతోంది. - బి.వెంకట్రావు, ఎమ్మెల్సీ
నాలుగు డిమాండ్లకు ఓకే..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆరు డిమాండ్లపై వినతిపత్రం సమర్పించగా నాలుగు డిమాండ్లపై ఒకే అన్నారు. లాభాలపై వాటాతోపాటు ఓపెన్‌కాస్టులు కాకుండా భూగర్భ గనులను ఎక్కువగా ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాల్సి ఉంది.
- వై.గట్టయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
మాట నిలబెట్టుకున్నారు...
సింగరేణి చరిత్రలో కార్మికులకు లాభం జరిగే అనేక ప్రయోజనాలను ప్రకటించిన ఏకైక వ్యక్తిగా సీఎం కేసీఆర్ నిలుస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన నిలబెట్టుకోవడం హర్షనీయం.
- రియాజ్‌అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి