TDP-TRS
-
ఎక్కడ.. ఎలా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయఢంకా మోగించింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పసునూరు దయాకర్, మాలోతు కవిత విజయం సాధించిన విషయం విదితమే. అయితే, గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఎన్నికలతో పోలిస్తే ‘ఎక్కడ తగ్గాం.. ఎక్కడా పెరిగాం’ అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొంత తగ్గిన మెజార్టీ వరంగల్ లోక్‌సభ పరిధిలో మొత్తం 16,66,085 ఓట్లకు గాను 10,61,672 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 14,24,385 ఓట్లకు గాను 9,83,708 ఓట్లు పోల్ కాగా 1,46,663 ఓట్ల మెజార్టీతో మాలోతు కవిత విజయం సాధించారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సమీక్ష జరిపిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లు, మెజార్టీపై ఆరా తీసినట్లు తెలిసింది. నాలుగు చోట్ల పైకి.. ఎనిమిది చోట్ల కిందకు... వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. ఈసారి పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు పెరిగాయి. ఇక వరంగల్ పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం తగ్గాయి. పరకాలలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డికి 59,384 ఓట్లు వస్తే.. ఈసారి ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 87,567 ఓట్లు నమోదయ్యాయి. భూపాలపల్లిలో గతంలో టీఆర్ఎస్కు 53,567 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 91,628 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అనూహ్యంగా మెజార్టీ పెరిగింది. ములుగులో 2018 ఎన్నికల్లో 66,300 ఓట్లు రాగా, ఈసారి 71,518 పార్లమెంట్ అభ్యర్థికి వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 98,612 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 94,327 ఓట్లు పోలయ్యాయి. పాలకుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 1,17,694 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 92,437, జనగామలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 91,592 ఓట్లు రాగా.. ఇప్పుడు 68,380, డోర్నకల్‌లో అసెంబ్లీ పోలింగ్‌లో 85,467, లోక్‌సభకు 78,986, మహబూబాబాద్‌లో అసెంబ్లీకి 85,397, లోక్‌సభకు 84,031, వరంగల్ పశ్చిమలో అసెంబ్లీకి 81,006, లోక్‌సభలో 62,669, వర్దన్నపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,252 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 97,526 ఓట్లు నమోదయ్యాయి. అయితే, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పోలిస్తే 12 శాతం పోలింగ్ తక్కువ నమోదు కావడమే మెజార్టీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కానీ మరింత సమన్వయంతో పని చేస్తే ఆ ఎనిమిది సెగ్మెంట్లలోనూ వెనుకబడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న అంచనాకు అధినేత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘ఓరుగల్లు’పై గులాబీ జెండా. ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్‌పై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ.. ఆ తర్వాత 2009 పునర్విభజనలో ఏర్పడిన వరంగల్‌గా ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ ఐదు, టీఆర్ఎస్ మూడు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విజయం సాధించగా.. తాజా ఎన్నికల్లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు. ఇక ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటల్లా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దు కాగా.. 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ విజయం సాధించారు. ఇక 2014లో మహబూబాబాద్(ఎస్టీ)లో టీఆర్ఎస్ పక్షాన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోను టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం కోల్పోయినట్లయింది. -
కూటమి... తప్పని ఓటమి
పదమూడో సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ఓట్లు కురిపించాయి. మహాకూటమి అభ్యర్థులు మెదక్, సిద్దిపేటలో మాత్రమే విజయం సాధించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పన్నెండో శాసనసభ (2004–09) ఎన్నికల్లో మెదక్ జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ పదమూడో శాసనసభ (2009–14) ఎన్నికల్లో ‘మహాకూటమి’ రూపంలో తెరమీదకు వచ్చింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమితో పోటీ చేసిన కాంగ్రెస్, 2009 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమిలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ భాగస్వామ్య పక్షాలుగా బరిలోకి దిగాయి. టీడీపీ ఆరు, టీఆర్ఎస్ మూడు, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేసేలా సీట్ల అవగాహన కుదిరింది. మెదక్, గజ్వేల్, పటాన్చెరు, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డిలో టీఆర్ఎస్, నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థి పోటీ చేశారు. టీఆర్ఎస్కు కేటాయించిన సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో టీడీపీ కూడా సొంత పార్టీ అభ్యర్థిని స్నేహపూర్వక పోటీ పేరిట బరిలోకి దించింది. నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థిగా దివంగత సీపీఐ నేత విఠల్‌రెడ్డి కుమారుడు కిషన్‌రెడ్డి పోటీ చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కక పోవడంతో టీఆర్ఎస్ తిరుగుబాటు నేత పద్మా దేవేందర్‌రెడి మెదక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దుబ్బాక నుంచి టీడీపీ టికెట్ దక్కని చెరుకు ముత్యంరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వరుస విజయాలు సాధించిన ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన నందీశ్వర్‌గౌడ్ (పటాన్చెరు), తూంకుంట నర్సారెడ్డి (గజ్వేల్) తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.సినీనటుడు చిరంజీవి సారథ్యంలో ఏర్పాటైన ‘ప్రజారాజ్యం’ పార్టీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో ఏర్పాటైన నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీలో విలీనమైంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిరంజీవి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత 1956, 1962, 1967, 1972లో తరచూ నియోజకవర్గాల సంఖ్య, పేర్లు మారుతూ వచ్చాయి. 1978 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాలను శాస్త్రీయంగా విభజించడంతో మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది. 2009లో జరిగిన పునర్విభజన మూలంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా పదికి పరిమితమయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల భౌగోళిక పరిధిలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా నుంచి రామాయంపేట అంతర్దానం కాగా, కొత్తగా పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ జనరల్ కేటగిరీలో చేరగా, జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. దొమ్మాట నియోజకవర్గంలోని మెజారిటీ మండలాలు, గ్రామాలతో ‘దుబ్బాక’ నియోజకవర్గం ఏర్పాటైంది. మూడు మంత్రివర్గాల్లో ముగ్గురు 2009 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించారు. మైనంపల్లి హనుమంతరావు (మెదక్, టీడీపీ), టి.హరీష్‌రావు (సిద్దిపేట, టీఆర్ఎస్) మహాకూటమి అభ్యర్థులుగా గెలుపొందారు. వైఎస్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. జె.గీతారెడ్డి (సమాచార శాఖ), దామోదర రాజనర్సింహ (మార్కెటింగ్, గిడ్డంగులు), సునీత లక్ష్మారెడ్డి (చిన్న నీటి పారుదల) శాఖ మంత్రులుగా పనిచేశారు. 2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో కే.రోశయ్య సీఎం పదవి చేపట్టగా, వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన దామోదర, గీత, సునీత చేరారు. 2010 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి పదవి చేపట్టగా, ఈ ముగ్గురు నేతలకే మళ్లీ మంత్రి పదవి దక్కింది. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత విద్య, గీతారెడ్డి (భారీ పరిశ్రమలు), సునీత లక్ష్మారెడ్డి (స్త్రీ, శిశు సంక్షేమం) మంత్రులుగా కిరణ్ కేబినెట్లో పనిచేశారు. సిద్దిపేటలో మళ్లీ ఉప ఎన్నిక ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోమారు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్‌రావు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 95,858 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ కాగా, ఈ ఎన్నికలో విజయం ద్వారా హరీశ్‌రావు కేవలం ఆరేళ్లలో వరుసగా నాలుగో పర్యాయం అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. టీడీపీ నుంచి దొమ్మాట ఎమ్మెల్యేగా 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయాలతో హ్యాట్రిక్ సాధించిన ముత్యంరెడ్డి 2009లో కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టి.హరీశ్‌రావు వరుసగా మూడో సారి గెలుపొందారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలోనూ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. జనరల్ స్థానంగా మారిన గజ్వేల్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి గెలుపొందారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా సంగారెడ్డి స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయించినప్పటికీ, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చింతా ప్రభాకర్‌ను బరిలోకి దించింది. 2004లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన జగ్గారెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. అందోలు రిజర్వుడు స్థానం నుంచి మరోమారు విజయం సాధించిన దామోదర రాజనర్సింహ వైఎస్, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. షెట్కార్ కుటుంబంతో ఒడంబడిక చేసిన కాంగ్రెస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన కిష్టారెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. -
కూటమి జోరు
2009లో ఉమ్మడి జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యముంది. టీడీపీ, టీఆర్ఎస్ జట్టు కట్టి ఆరు చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ, పీఆర్పీ జిల్లాలో బోణి కొట్టాయి. అర్బన్‌లో యెండల, బాల్కొండలో ఈరవత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహా కూటమి జోరు కనిపించింది. టీడీపీ, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాలు కైవసం చేసుకున్నాయి. అలాగే జిల్లాలో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ ఉనికి కనిపించింది. బాల్కొండలో పీఆర్పీ బోణి కొట్టింది. అలాగే కాంగ్రెస్ నుంచి సుదర్శన్‌రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. బీజేపీ నుంచి యెండల విజయం సాధిం చారు. ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటిన ప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో కష్టకాలం మొదలైంది. జిల్లాలో 2010లో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2011లో గంప గోవర్ధన్ కూడా కారెక్కారు. సాక్షి, బాన్సువాడ: ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 2004లో కాంగ్రెస్ హవా కారణంగా ఓటమి తప్పలేదు. అయితే 2009లో తిరిగి గెలుపొందారు. 2009లో నియోజకవర్గంలో మొత్తం 1,61,673 మంది ఓటర్లు ఉండగా, 1,23,254 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1,22,807 ఓట్లు చెల్లాయి. కాంగ్రెస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్, టీడీపీ తరపున పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రణాళికా బద్ధంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం చేయడంతో ఆయన ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 69,857 ఓట్లు రాగా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు 43,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పోచారం 26,103 ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. అయితే 2009, 2010లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడం, చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో మనస్తా పం చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011లో ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బాన్సువాడ వేదికగా టీఆర్ఎస్లో చేరారు. ఆయన రాకతో బాన్సువాడ నియోజకవర్గంలోని 90శాతం టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దీం తో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. 2011 అక్టోబర్ 13న బాన్సువాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 83,245 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్‌గౌడ్‌కు 33,356 ఓట్లు పోలయ్యాయి. 49,889 ఓట్ల మెజారిటీతో పోచారం గెలిచారు. గంప భారీ మెజారిటీ.. కామారెడ్డి క్రైం: 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి టీడీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ మొదట్నుం చి కంచుకోటగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు గంపగోవర్ధన్‌ను రెండోసారి భారీ మెజార్టీతో గెలపించారు. టీడీపీ నుంచి గంపగోవర్ధన్‌కు పోటీచేయగా కాంగ్రెస్ నుంచి మహ్మద్ అలీ షబ్బీర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గంపగోవర్ధన్ 86,986 ఓట్లు రాగా, షబ్బీర్అలీకి 39,278 ఓట్లు వచ్చాయి. 47,708 ఓట్లు భారీ మెజార్టీ గంపగోవర్ధన్ సొంతమైంది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా కామారెడ్డి టికెట్ టీడీపీ వచ్చింది. అప్పటికే 2004లో గెలుపొంది మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌అలీపై కూటమి అభ్యర్థి గంపగోవర్ధన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో 2011లో గంపగోవర్ధన్ ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. దీంతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎడ్లరాజిరెడ్డి పోటీ చేయగా ఆయనకు 31,234 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గా బరిలోకి దిగిన గంప గోవర్ధన్‌కు 75,699 ఓట్లు వచ్చాయి. మూడవసారి గంపగోవర్ధన్ భారీ మెజార్టీతో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సింధే తొలిసారి.. నిజాంసాగర్(జుక్కల్): 2009 సార్వత్రిక ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం నుంచి హన్మంత్‌షింథే టీడీపీ నుంచి విజయం సాధించారు. గతంలో ఓటమిని మూటగట్టుకున్న హన్మంత్ షింథే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు దగ్గరయయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ గంగారాం సతీమణి సావిత్రిబాయిపై గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి హన్మంత్షింథేకు 72,971 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయికి 38,847 ఓట్లు వచ్చాయి. దాంతో హన్మంత్‌షింథే 34,124 ఓట్ల మోజార్టీతో విజయం సాదిం చారు. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో నువ్వా, నేనా అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. కాని 2009 ఎన్నికల నాటి నుంచి హన్మంత్‌షింథే అత్యధికంగా మోజారిటీ సాధించడం గమన్హారం. కాంగ్రెస్ పార్టీ తరుపున నాల్గుసార్లు ఎమ్మెల్యే అయిన గంగారాం పదిహేను వేలలోపు మోజార్టీ సాధించగా హన్మంత్‌షింథే అధిక మోజారిటీతో రికార్డు సృష్టించారు. మాజీ స్పీకర్‌ను ఓడించిన అన్నపూర్ణమ్మ ఆర్మూర్: 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏలేటి అన్నపూర్ణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణకు 49,009 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌రెడ్డికి 35,950 ఓట్లు వచ్చాయి. దీంతో అన్నపూర్ణ 13,059 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ఏలేటి అన్నపూర్ణ వివాహం కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన టీడీపీ నాయకుడు ఏలేటి మహిపాల్‌రెడ్డితో అయింది. కాగా 1991 జనవరి 18న కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన మాజీ మంత్రి ఏలేటి మహిపాల్‌రెడ్డి గుండె పోటుతో మరణించారు. దీంతో 1994 ఎన్నికల్లో మహిపాల్‌రెడ్డి సేవలకు గుర్తుగా గృహిణి గా ఉన్న ఆయన సతీమణి ఏలేటి అన్నపూర్ణకు ఎన్టీఆర్ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కే టాయించారు. మహిపాల్‌రెడ్డిపై ఉన్న అభిమా నంతో ఇక్కడి ప్రజలు అన్నపూర్ణకు బ్రహ్మరథం ప ట్టారు. శనిగరం సంతోష్‌రెడ్డిపై ఆమె మొదటి విజయాన్ని, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై రెండోసారి విజయం సాధించారు. 1999, 2004 లో అన్నపూర్ణ ఓటమిపాలైంది. బోధన్.. పొద్దుటూరి హ్యాట్రిక్ బోధన్: నియోజకవర్గంలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ రికార్డు సాధించారు. ప్రత్యర్థి టీఆర్ఎస్, టీడీపీ మహాకూటమిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలబరిలో నిలిచిన తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సుదర్శన్ రెడ్డి చేతిలో అతిస్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుదర్శన్ రెడ్డి 42,494 ఓట్లు రాగా, మహ్మద్ షకీల్ ఆమేర్‌కు 41,219 ఓట్లువచ్చాయి. 1275 ఓట్ల ఆధిక్యతతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మహాకూటమి అభ్యర్థులు సుదర్శన్ రెడ్డి, షకీల్‌లతో పాటు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుతం బీజేపీ నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆఖరి గడియ వరకు గట్టి పోటీ ఇచ్చారు. కెప్టెన్ కరుణాకర్ రెడ్డికి 34,142 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దివంగత సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాని ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజవర్గాలుండగా, ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోగా, బోధన్ నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ఒక్కరే గెలిచారు. ఈ ఎన్నికలు మాజీ మం త్రికి కలిసివచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో సుదర్శన్‌రెడ్డికి రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రిగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆతర్వాత వైఎస్ఆర్, అప్పట్లో సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల హాయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ‘ఏనుగు’కే ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి అసెంబ్లీ నియాజకవర్గానికి 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుండి జనార్ధన్‌గౌడ్, పీఆర్పీ నుండి జమునారాథోడ్, బీజేపి నుండి సత్యనారాయణరావు, బీఎస్పీ నుండి అంకం ప్రభు, లోక్ సత్తా నుండి మర్రి రాంరెడ్డి పోటీచేశారు. వీరిలో రవీందర్‌రెడ్డికి 77,153ఓట్లు, జనార్ధన్‌గౌడ్‌కు 40,294ఓట్లు, జమునారాథోడ్కు 11,204ఓట్లు, అంకం ప్రభుకు 1,378ఓట్లు వచ్చాయి. ఫలితంగా టీఆర్ఎస అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి జనార్థన్గౌడ్పై 36,859ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తన పదవికి రెండోసారి రాజీనామా చేశారు. ఫలితంగా ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానానికి 2010లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ఆలీ, టీడీపీ నుంచి నల్లమడుగు సురేందర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రవీందర్‌రెడ్డికి 72,491ఓట్లు, షబ్బీర్‌ఆలీకి 34,829ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి షబ్బీర్ఆలీపై 37,662ఓట్ల మెజారిటీతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానానికి అత్యధికసంఖ్యలో సుమారు 100కుపైగా మంది అభ్యర్థులు పోటీ చేశారు. పీఆర్పీ నుంచి ‘ఒకేఒక్కడు’ మోర్తాడ్(బాల్కొండ): 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బాల్కొండ బరిలో అప్పట్లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) తరపున పోటీ చేసిన ఈరవత్రి అనిల్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బాల్కొండలో పీఆర్పీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ వాసుబాబు పోటీ చేసి ఓటమి పాలైనారు. అలాగే గతంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వేముల సురేంధర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈరవత్రి అనిల్‌కు 46,313 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌రెడ్డికి 38,154 ఓట్లు వచ్చాయి. ఈరవత్రి అనిల్‌కు 8,159 ఓట్ల మెజార్టీ లభించింది. కాగా ఈ ఎన్నికల్లో పోటీచేసిన ఈరవత్రి అనిల్, శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు రాజకీయాలకు కొత్తవారే కావడం విశేషం. ప్రజారాజ్యం పార్టీ తరపున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేసినా ఈరవత్రి అనిల్ ఒక్కరే పీఆర్పీ తరపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా 2011లో అనూహ్య పరిస్థితిలో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత అనిల్‌కు ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ప్రభుత్వ విప్‌గా ఈరవత్రి అనిల్ దాదాపు మూడేళ్ల పాటు పదవిలో ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అర్గుల్ రాజారాం, అతని సతీమణి సుశీలా బాయి తరువాత బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్ ఎమ్మెల్యేగా మరో సారి ఈ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. ఈరవత్రి అనిల్ రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లీలో అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారిలో కేటీఆర్ తరవా త స్థానం ఈరవత్రి అనిల్‌దే కావడం గమనార్హం. అర్బన్‌లో కమల వికాసం నిజామాబాద్‌అర్బన్: 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాచాటింది. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం, నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. కేవలం నిజామాబాద్ పట్టణం మాత్రమే నియోజక వర్గంగా ఏర్పడింది. ఇది బీజేపీకి బాగా కలిసివచ్చింది. ఎప్పటినుంచో బీజేపీకి పట్టణంలో పట్టు ఉండేది. క్రమేపి డీలిమిటేషన్లో భాగంగా నిజామాబాద్ అర్బన్ ఏర్పడిన తరువాత బీజేపీ పుంజుకుంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా బీజేపీ ప్రకటన చేయడం, మరింత కలిసివచ్చింది. దీంతో బీజేపీ తరపున పోటీచేసిన యెండల లక్ష్మీనారాయణ 40,475 ఓట్లు సాధించి గెలుపొందారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన డి.శ్రీనివాస్‌కు 29,460 ఓట్లు వచ్చాయి. దీంతో 11,015 ఓట్ల మెజారిటీతో డి.శ్రీనివాస్‌పై యెండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు. నిజామాబాద్ నుంచి తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. రూరల్‌లో మండవ హవా డిచ్పల్లి: గతంలో డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలి చి రెండు సార్లు ఓటమి చవిచూసిన మండవ వెంకటేశ్వరరావు 2009 లో జరిగిన ఎన్నిక ల్లో ఐదోసారి విజయం సాధించారు. డిచ్పల్లి నియోజకవర్గాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మార్చిన తర్వాత 2009 లో తొలి ఎన్నికలు జరిగాయి. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేస్తోందనే కారణంగా కాంగ్రెస్ నుంచి విడిపోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావు తన సమీ ప అభ్యర్థి ఆకుల లలితపై విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మండవకు 71,680 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితకు 43086 ఓట్లు వచ్చాయి. 28,594 ఓట్ల మెజారిటీతో మండవ విజయం సాధించారు. అయితే టీడీపీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు కూట మి కట్టి ఎన్నికల బరిలో దిగినా అప్పటి సీ ఎం వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెల్చుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. శాసనసభకు పోటీ చేయాలంటే అర్హతలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఈ సారి మన ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారన్నా.. ఎవరైతే బాగుంటుంది.. ప్రస్తుతం ఎక్కడ పదిమంది కలిసినా ఇదే చర్చ జరుగుతుంది. అయితే ప్రజలకు సేవ చేయడానికో, పదవి మీద వ్యామోమాంతోనో కారణం ఏదైతేనేమి.. శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. కాగా కొంతమంది కేవలం బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం యంత్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల జబితాలో తమ పేరు ఉండాలనే ఆకాంక్షతో కూడా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. అయితే శాసనసభ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు విధించింది. ఈ నేపథ్యంలో శాసనసభకు పోటీచేసేందుకు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలపై ప్రత్యేక కథనం.. శాసనసభ ఎన్నికలకు పోటీచేసే వ్యక్తి కనీసం 25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే సమయానికి దేశపౌరుడై ఉండాలి. భారత రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి లోబడి వ్యవహరిస్తానని ప్రమాణపత్రం జతపర్చాలి. పోటీచేసే రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోటీచేస్తే సంబంధిత నియోజకవర్గంలో ఓటుహక్కు ఉన్నట్లు ధృవీకరించే పత్రాన్నినామినేషన్పత్రానికి జతపర్చాలి. ఇతర నియోజకవర్గంలో పోటీచేసే వ్యక్తిని ప్రతిపాదించేవారు స్థానిక నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. పోటీచేసే అభ్యర్థులు జనరల్ కేటగిరికి చెందినవారయితే రూ. 40 వేలు, ఎస్సీ, ఎస్టీ అయితే రూ. 5 వేలు డిపాజిట్ చేయాలి. జనరల్ స్థానాల్లో పోటీచేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. రిజర్వేషన్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. స్వతంత్య్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి. సేవే ధ్యేయంగా పనిచేసే నాయకుడు కావాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రజాసేవే ధ్యేయం గా భావించే నాయకుడు మాకు కావాలి. ప్రజల అవసరాలను తీర్చే నాయకున్నే ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినవారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పేదరికాన్ని పారదోలాలి. సమాజంలోని అసమానతలను రూపుమాపాలి. ఇలాంటివారికే నేను ఓటు వేస్తాను. శ్రీకాంత్, యువ ఓటరు, గోపాల్పేట -
కాంగ్రెస్‌కు టీఆర్ఎస్, టీడీపీలు కవలలు
సదాశివపేట(సంగారెడ్డి): కాంగ్రెస్‌కు కవల పిల్లలుగా టీఆర్ఎస్, టీడీపీలు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటకలో టీఆర్ఎస్, టీడీపీల పరోక్ష మద్దతుతోనే సీఎం పదవి చేపట్టినట్లు కుమారస్వామి వెల్లడించారని చెప్పారు. టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్లేనని, కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ను సమర్థించినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రలతో టీఆర్ఎస్కే లాభం చేకూరుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాకు కేంద్రం ఇప్పటి వరకు రూ.375.52 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షల వరకు కేంద్రం మంజూరు చేసిందన్నారు. రైతుబంధు పథకం మోతుబరి రైతులు, బినామీలకే ఎక్కువ ఉపయోపడుతుందన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకే ఉపయోగపడుతుందని, ప్రజాధనంతో ఓట్లు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో పల్లెబాట, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం కృషి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరానికి టీఏసీ అనుమతులు లభించడంపై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతుల మంజూరీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే అనుమతులిస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
టీడీపీ-టీఆర్ఎస్వి కుమ్మక్కు రాజకీయాలు
వైఎస్సార్సీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా నడుస్తున్న రాజకీయ పరిణామాలని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి విమర్శించారు. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ వరంగల్ ఉప ఎన్నిక గురించి వైఎస్సార్సీపీని నిందిస్తూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లెవేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కిష్టారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన తీరు, అమరావతిలో ఇద్దరు సీఎంలు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన తీరు వారి కుమ్మక్కు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఓటుకు కోట్లు కేసును మూసి వేయించుకునేందుకే కేసీఆర్‌తో బాబు సన్నిహితంగా ఉంటున్నారని విమర్శించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కేసీఆర్‌ను ఎక్కడ తిట్టాల్సి వస్తుందోనని భయపడి, లోపాయికారిగా టీఆర్ఎస్తో కుమ్మక్కై టీడీపీ టికెట్‌ను బీజేపీకి వదిలేసిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వరంగల్ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అందుకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. ఇద్దరు చంద్రులు కలసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని, అమరావతిలో ఇద్దరు సీఎంల మధ్య జరిగిన సంభాషణను గాలి ముద్దుకృష్ణమనాయుడుకు దమ్ముంటే బహిర్గతం చేయాలని కిష్టారెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు సీఎం కేసీఆర్ అధికారదాహం కోసమే జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్నారు.