ప్రతీకాత్మక చిత్రం
పదమూడో సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ఓట్లు కురిపించాయి. మహాకూటమి అభ్యర్థులు మెదక్, సిద్దిపేటలో మాత్రమే విజయం సాధించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పన్నెండో శాసనసభ (2004–09) ఎన్నికల్లో మెదక్ జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ పదమూడో శాసనసభ (2009–14) ఎన్నికల్లో ‘మహాకూటమి’ రూపంలో తెరమీదకు వచ్చింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమితో పోటీ చేసిన కాంగ్రెస్, 2009 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమిలో టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ భాగస్వామ్య పక్షాలుగా బరిలోకి దిగాయి. టీడీపీ ఆరు, టీఆర్‌ఎస్ మూడు, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేసేలా సీట్ల అవగాహన కుదిరింది.
మెదక్, గజ్వేల్, పటాన్‌చెరు, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డిలో టీఆర్‌ఎస్, నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థి పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో టీడీపీ కూడా సొంత పార్టీ అభ్యర్థిని స్నేహపూర్వక పోటీ పేరిట బరిలోకి దించింది. నర్సాపూర్‌లో సీపీఐ అభ్యర్థిగా దివంగత సీపీఐ నేత విఠల్‌రెడ్డి కుమారుడు కిషన్‌రెడ్డి పోటీ చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కక పోవడంతో టీఆర్‌ఎస్ తిరుగుబాటు నేత పద్మా దేవేందర్‌రెడి మెదక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దుబ్బాక నుంచి టీడీపీ టికెట్ దక్కని చెరుకు ముత్యంరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వరుస విజయాలు సాధించిన ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరు), తూంకుంట నర్సారెడ్డి (గజ్వేల్) తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.సినీనటుడు చిరంజీవి సారథ్యంలో ఏర్పాటైన ‘ప్రజారాజ్యం’ పార్టీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో ఏర్పాటైన నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్‌టీపీపీ) ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీలో విలీనమైంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిరంజీవి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు.
నియోజకవర్గాల పునర్విభజన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత 1956, 1962, 1967, 1972లో తరచూ నియోజకవర్గాల సంఖ్య, పేర్లు మారుతూ వచ్చాయి. 1978 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాలను శాస్త్రీయంగా విభజించడంతో మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది. 2009లో జరిగిన పునర్విభజన మూలంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా పదికి పరిమితమయ్యాయి.
అసెంబ్లీ సెగ్మెంట్ల భౌగోళిక పరిధిలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా నుంచి రామాయంపేట అంతర్దానం కాగా, కొత్తగా పటాన్‌చెరు నియోజకవర్గం ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ జనరల్ కేటగిరీలో చేరగా, జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. దొమ్మాట నియోజకవర్గంలోని మెజారిటీ మండలాలు, గ్రామాలతో ‘దుబ్బాక’ నియోజకవర్గం ఏర్పాటైంది.
మూడు మంత్రివర్గాల్లో ముగ్గురు
2009 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించారు. మైనంపల్లి హనుమంతరావు (మెదక్, టీడీపీ), టి.హరీష్‌రావు (సిద్దిపేట, టీఆర్‌ఎస్) మహాకూటమి అభ్యర్థులుగా గెలుపొందారు. వైఎస్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. జె.గీతారెడ్డి (సమాచార శాఖ), దామోదర రాజనర్సింహ (మార్కెటింగ్, గిడ్డంగులు), సునీత లక్ష్మారెడ్డి (చిన్న నీటి పారుదల) శాఖ మంత్రులుగా పనిచేశారు.
2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో కే.రోశయ్య సీఎం పదవి చేపట్టగా, వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన దామోదర, గీత, సునీత చేరారు. 2010 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి పదవి చేపట్టగా, ఈ ముగ్గురు నేతలకే మళ్లీ మంత్రి పదవి దక్కింది. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత విద్య, గీతారెడ్డి (భారీ పరిశ్రమలు), సునీత లక్ష్మారెడ్డి (స్త్రీ, శిశు సంక్షేమం) మంత్రులుగా కిరణ్ కేబినెట్‌లో పనిచేశారు.
సిద్దిపేటలో మళ్లీ ఉప ఎన్నిక
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోమారు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్‌రావు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 95,858 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ కాగా, ఈ ఎన్నికలో విజయం ద్వారా హరీశ్‌రావు కేవలం ఆరేళ్లలో వరుసగా నాలుగో పర్యాయం అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
- టీడీపీ నుంచి దొమ్మాట ఎమ్మెల్యేగా 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయాలతో హ్యాట్రిక్ సాధించిన ముత్యంరెడ్డి 2009లో కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు.
- సిద్దిపేట నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టి.హరీశ్‌రావు వరుసగా మూడో సారి గెలుపొందారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికలోనూ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.
- జనరల్ స్థానంగా మారిన గజ్వేల్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి గెలుపొందారు.
- నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
- సీట్ల సర్దుబాటులో భాగంగా సంగారెడ్డి స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయించినప్పటికీ, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చింతా ప్రభాకర్‌ను బరిలోకి దించింది. 2004లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన జగ్గారెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
- అందోలు రిజర్వుడు స్థానం నుంచి మరోమారు విజయం సాధించిన దామోదర రాజనర్సింహ వైఎస్, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
- షెట్కార్ కుటుంబంతో ఒడంబడిక చేసిన కాంగ్రెస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన కిష్టారెడ్డి విజయం సాధించారు.
- నియోజకవర్గాల పునర్విభజనలో జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారడంతో గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment