టీడీపీ-టీఆర్‌ఎస్‌వి కుమ్మక్కు రాజకీయాలు
వైఎస్సార్‌సీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా నడుస్తున్న రాజకీయ పరిణామాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి విమర్శించారు. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ వరంగల్ ఉప ఎన్నిక గురించి వైఎస్సార్‌సీపీని నిందిస్తూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లెవేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కిష్టారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన తీరు, అమరావతిలో ఇద్దరు సీఎంలు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన తీరు వారి కుమ్మక్కు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఓటుకు కోట్లు కేసును మూసి వేయించుకునేందుకే కేసీఆర్‌తో బాబు సన్నిహితంగా ఉంటున్నారని విమర్శించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కేసీఆర్‌ను ఎక్కడ తిట్టాల్సి వస్తుందోనని భయపడి, లోపాయికారిగా టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై టీడీపీ టికెట్‌ను బీజేపీకి వదిలేసిందన్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వరంగల్ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వాటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అందుకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు.
ఇద్దరు చంద్రులు కలసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని, అమరావతిలో ఇద్దరు సీఎంల మధ్య జరిగిన సంభాషణను గాలి ముద్దుకృష్ణమనాయుడుకు దమ్ముంటే బహిర్గతం చేయాలని కిష్టారెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు సీఎం కేసీఆర్ అధికారదాహం కోసమే జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్నారు.