2009లో ఉమ్మడి జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యముంది. టీడీపీ, టీఆర్‌ఎస్ జట్టు కట్టి ఆరు చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ, పీఆర్పీ జిల్లాలో బోణి కొట్టాయి. అర్బన్‌లో యెండల, బాల్కొండలో ఈరవత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహా కూటమి జోరు కనిపించింది. టీడీపీ, టీఆర్‌ఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాలు కైవసం చేసుకున్నాయి.
అలాగే జిల్లాలో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ ఉనికి కనిపించింది. బాల్కొండలో పీఆర్‌పీ బోణి కొట్టింది. అలాగే కాంగ్రెస్ నుంచి సుదర్శన్‌రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. బీజేపీ నుంచి యెండల విజయం సాధిం చారు. ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటిన ప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో కష్టకాలం మొదలైంది. జిల్లాలో 2010లో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2011లో గంప గోవర్ధన్ కూడా కారెక్కారు.
సాక్షి, బాన్సువాడ: ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 2004లో కాంగ్రెస్ హవా కారణంగా ఓటమి తప్పలేదు. అయితే 2009లో తిరిగి గెలుపొందారు. 2009లో నియోజకవర్గంలో మొత్తం 1,61,673 మంది ఓటర్లు ఉండగా, 1,23,254 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1,22,807 ఓట్లు చెల్లాయి. కాంగ్రెస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్, టీడీపీ తరపున పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రణాళికా బద్ధంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం చేయడంతో ఆయన ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 69,857 ఓట్లు రాగా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు 43,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పోచారం 26,103 ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. అయితే 2009, 2010లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడం, చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో మనస్తా పం చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2011లో ఉప ఎన్నికలు
తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బాన్సువాడ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన రాకతో బాన్సువాడ నియోజకవర్గంలోని 90శాతం టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీం తో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. 2011 అక్టోబర్ 13న బాన్సువాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 83,245 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్‌గౌడ్‌కు 33,356 ఓట్లు పోలయ్యాయి. 49,889 ఓట్ల మెజారిటీతో పోచారం గెలిచారు.
గంప భారీ మెజారిటీ..
కామారెడ్డి క్రైం: 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి టీడీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ మొదట్నుం చి కంచుకోటగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు గంపగోవర్ధన్‌ను రెండోసారి భారీ మెజార్టీతో గెలపించారు. టీడీపీ నుంచి గంపగోవర్ధన్‌కు పోటీచేయగా కాంగ్రెస్ నుంచి మహ్మద్ అలీ షబ్బీర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గంపగోవర్ధన్ 86,986 ఓట్లు రాగా, షబ్బీర్‌అలీకి 39,278 ఓట్లు వచ్చాయి. 47,708 ఓట్లు భారీ మెజార్టీ గంపగోవర్ధన్ సొంతమైంది. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా కామారెడ్డి టికెట్ టీడీపీ వచ్చింది.
అప్పటికే 2004లో గెలుపొంది మంత్రిగా పనిచేసిన షబ్బీర్‌అలీపై కూటమి అభ్యర్థి గంపగోవర్ధన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో 2011లో గంపగోవర్ధన్ ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎడ్లరాజిరెడ్డి పోటీ చేయగా ఆయనకు 31,234 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి గా బరిలోకి దిగిన గంప గోవర్ధన్‌కు 75,699 ఓట్లు వచ్చాయి. మూడవసారి గంపగోవర్ధన్ భారీ మెజార్టీతో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సింధే తొలిసారి..
నిజాంసాగర్(జుక్కల్): 2009 సార్వత్రిక ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం నుంచి హన్మంత్‌షింథే టీడీపీ నుంచి విజయం సాధించారు. గతంలో ఓటమిని మూటగట్టుకున్న హన్మంత్ షింథే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు దగ్గరయయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ గంగారాం సతీమణి సావిత్రిబాయిపై గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి హన్మంత్‌షింథేకు 72,971 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయికి 38,847 ఓట్లు వచ్చాయి. దాంతో హన్మంత్‌షింథే 34,124 ఓట్ల మోజార్టీతో విజయం సాదిం చారు.
2004 ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో నువ్వా, నేనా అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. కాని 2009 ఎన్నికల నాటి నుంచి హన్మంత్‌షింథే అత్యధికంగా మోజారిటీ సాధించడం గమన్హారం. కాంగ్రెస్ పార్టీ తరుపున నాల్గుసార్లు ఎమ్మెల్యే అయిన గంగారాం పదిహేను వేలలోపు మోజార్టీ సాధించగా హన్మంత్‌షింథే అధిక మోజారిటీతో రికార్డు సృష్టించారు.
మాజీ స్పీకర్‌ను ఓడించిన అన్నపూర్ణమ్మ
ఆర్మూర్: 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏలేటి అన్నపూర్ణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణకు 49,009 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌రెడ్డికి 35,950 ఓట్లు వచ్చాయి. దీంతో అన్నపూర్ణ 13,059 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ఏలేటి అన్నపూర్ణ వివాహం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుడు ఏలేటి మహిపాల్‌రెడ్డితో అయింది. కాగా 1991 జనవరి 18న కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన మాజీ మంత్రి ఏలేటి మహిపాల్‌రెడ్డి గుండె పోటుతో మరణించారు.
దీంతో 1994 ఎన్నికల్లో మహిపాల్‌రెడ్డి సేవలకు గుర్తుగా గృహిణి గా ఉన్న ఆయన సతీమణి ఏలేటి అన్నపూర్ణకు ఎన్టీఆర్ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కే టాయించారు. మహిపాల్‌రెడ్డిపై ఉన్న అభిమా నంతో ఇక్కడి ప్రజలు అన్నపూర్ణకు బ్రహ్మరథం ప ట్టారు. శనిగరం సంతోష్‌రెడ్డిపై ఆమె మొదటి విజయాన్ని, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై రెండోసారి విజయం సాధించారు. 1999, 2004 లో అన్నపూర్ణ ఓటమిపాలైంది.
బోధన్.. పొద్దుటూరి హ్యాట్రిక్
బోధన్: నియోజకవర్గంలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ రికార్డు సాధించారు. ప్రత్యర్థి టీఆర్‌ఎస్, టీడీపీ మహాకూటమిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికలబరిలో నిలిచిన తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సుదర్శన్ రెడ్డి చేతిలో అతిస్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుదర్శన్ రెడ్డి 42,494 ఓట్లు రాగా, మహ్మద్ షకీల్ ఆమేర్‌కు 41,219 ఓట్లువచ్చాయి. 1275 ఓట్ల ఆధిక్యతతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ మహాకూటమి అభ్యర్థులు సుదర్శన్ రెడ్డి, షకీల్‌లతో పాటు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుతం బీజేపీ నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆఖరి గడియ వరకు గట్టి పోటీ ఇచ్చారు. కెప్టెన్ కరుణాకర్ రెడ్డికి 34,142 ఓట్లు వచ్చాయి.
2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దివంగత సీఎం వైఎస్‌ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాని ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజవర్గాలుండగా, ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోగా, బోధన్ నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ఒక్కరే గెలిచారు. ఈ ఎన్నికలు మాజీ మం త్రికి కలిసివచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో సుదర్శన్‌రెడ్డికి రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రిగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆతర్వాత వైఎస్‌ఆర్, అప్పట్లో సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల హాయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు.
‘ఏనుగు’కే ఎల్లారెడ్డి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి అసెంబ్లీ నియాజకవర్గానికి 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుండి జనార్ధన్‌గౌడ్, పీఆర్పీ నుండి జమునారాథోడ్, బీజేపి నుండి సత్యనారాయణరావు, బీఎస్పీ నుండి అంకం ప్రభు, లోక్ సత్తా నుండి మర్రి రాంరెడ్డి పోటీచేశారు. వీరిలో రవీందర్‌రెడ్డికి 77,153ఓట్లు, జనార్ధన్‌గౌడ్‌కు 40,294ఓట్లు, జమునారాథోడ్‌కు 11,204ఓట్లు, అంకం ప్రభుకు 1,378ఓట్లు వచ్చాయి. ఫలితంగా టీఆర్‌ఎస అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి జనార్థన్‌గౌడ్‌పై 36,859ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తన పదవికి రెండోసారి రాజీనామా చేశారు. ఫలితంగా ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానానికి 2010లో ఉపఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ఆలీ, టీడీపీ నుంచి నల్లమడుగు సురేందర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రవీందర్‌రెడ్డికి 72,491ఓట్లు, షబ్బీర్‌ఆలీకి 34,829ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి షబ్బీర్‌ఆలీపై 37,662ఓట్ల మెజారిటీతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానానికి అత్యధికసంఖ్యలో సుమారు 100కుపైగా మంది అభ్యర్థులు పోటీ చేశారు.
పీఆర్పీ నుంచి ‘ఒకేఒక్కడు’
మోర్తాడ్(బాల్కొండ): 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బాల్కొండ బరిలో అప్పట్లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్‌పీ) తరపున పోటీ చేసిన ఈరవత్రి అనిల్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బాల్కొండలో పీఆర్‌పీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ వాసుబాబు పోటీ చేసి ఓటమి పాలైనారు. అలాగే గతంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వేముల సురేంధర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈరవత్రి అనిల్‌కు 46,313 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌రెడ్డికి 38,154 ఓట్లు వచ్చాయి. ఈరవత్రి అనిల్‌కు 8,159 ఓట్ల మెజార్టీ లభించింది. కాగా ఈ ఎన్నికల్లో పోటీచేసిన ఈరవత్రి అనిల్, శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు రాజకీయాలకు కొత్తవారే కావడం విశేషం.
ప్రజారాజ్యం పార్టీ తరపున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేసినా ఈరవత్రి అనిల్ ఒక్కరే పీఆర్‌పీ తరపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా 2011లో అనూహ్య పరిస్థితిలో పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత అనిల్‌కు ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ప్రభుత్వ విప్‌గా ఈరవత్రి అనిల్ దాదాపు మూడేళ్ల పాటు పదవిలో ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అర్గుల్ రాజారాం, అతని సతీమణి సుశీలా బాయి తరువాత బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్ ఎమ్మెల్యేగా మరో సారి ఈ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. ఈరవత్రి అనిల్ రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లీలో అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారిలో కేటీఆర్ తరవా త స్థానం ఈరవత్రి అనిల్‌దే కావడం గమనార్హం.
అర్బన్‌లో కమల వికాసం
నిజామాబాద్‌అర్బన్: 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాచాటింది. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం, నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. కేవలం నిజామాబాద్ పట్టణం మాత్రమే నియోజక వర్గంగా ఏర్పడింది. ఇది బీజేపీకి బాగా కలిసివచ్చింది. ఎప్పటినుంచో బీజేపీకి పట్టణంలో పట్టు ఉండేది. క్రమేపి డీలిమిటేషన్‌లో భాగంగా నిజామాబాద్ అర్బన్ ఏర్పడిన తరువాత బీజేపీ పుంజుకుంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా బీజేపీ ప్రకటన చేయడం, మరింత కలిసివచ్చింది. దీంతో బీజేపీ తరపున పోటీచేసిన యెండల లక్ష్మీనారాయణ 40,475 ఓట్లు సాధించి గెలుపొందారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన డి.శ్రీనివాస్‌కు 29,460 ఓట్లు వచ్చాయి. దీంతో 11,015 ఓట్ల మెజారిటీతో డి.శ్రీనివాస్‌పై యెండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు. నిజామాబాద్ నుంచి తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు.
రూరల్‌లో మండవ హవా
డిచ్‌పల్లి: గతంలో డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలి చి రెండు సార్లు ఓటమి చవిచూసిన మండవ వెంకటేశ్వరరావు 2009 లో జరిగిన ఎన్నిక ల్లో ఐదోసారి విజయం సాధించారు. డిచ్‌పల్లి నియోజకవర్గాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మార్చిన తర్వాత 2009 లో తొలి ఎన్నికలు జరిగాయి. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేస్తోందనే కారణంగా కాంగ్రెస్ నుంచి విడిపోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.
ఈ ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావు తన సమీ ప అభ్యర్థి ఆకుల లలితపై విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మండవకు 71,680 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితకు 43086 ఓట్లు వచ్చాయి. 28,594 ఓట్ల మెజారిటీతో మండవ విజయం సాధించారు. అయితే టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు కూట మి కట్టి ఎన్నికల బరిలో దిగినా అప్పటి సీ ఎం వైఎస్‌ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెల్చుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది.
శాసనసభకు పోటీ చేయాలంటే అర్హతలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఈ సారి మన ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారన్నా.. ఎవరైతే బాగుంటుంది.. ప్రస్తుతం ఎక్కడ పదిమంది కలిసినా ఇదే చర్చ జరుగుతుంది. అయితే ప్రజలకు సేవ చేయడానికో, పదవి మీద వ్యామోమాంతోనో కారణం ఏదైతేనేమి.. శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. కాగా కొంతమంది కేవలం బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం యంత్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల జబితాలో తమ పేరు ఉండాలనే ఆకాంక్షతో కూడా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. అయితే శాసనసభ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు విధించింది. ఈ నేపథ్యంలో శాసనసభకు పోటీచేసేందుకు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలపై ప్రత్యేక కథనం..
- శాసనసభ ఎన్నికలకు పోటీచేసే వ్యక్తి కనీసం 25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
- నామినేషన్ దాఖలు చేసే సమయానికి దేశపౌరుడై ఉండాలి.
- భారత రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి లోబడి వ్యవహరిస్తానని ప్రమాణపత్రం జతపర్చాలి.
- పోటీచేసే రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి.
- సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోటీచేస్తే సంబంధిత నియోజకవర్గంలో ఓటుహక్కు ఉన్నట్లు ధృవీకరించే పత్రాన్నినామినేషన్‌పత్రానికి జతపర్చాలి.
- ఇతర నియోజకవర్గంలో పోటీచేసే వ్యక్తిని ప్రతిపాదించేవారు స్థానిక నియోజకవర్గంలో ఓటరై ఉండాలి.
- పోటీచేసే అభ్యర్థులు జనరల్ కేటగిరికి చెందినవారయితే రూ. 40 వేలు, ఎస్సీ, ఎస్టీ అయితే రూ. 5 వేలు డిపాజిట్ చేయాలి.
- జనరల్ స్థానాల్లో పోటీచేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
- రిజర్వేషన్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
- స్వతంత్య్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి.
సేవే ధ్యేయంగా పనిచేసే నాయకుడు కావాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రజాసేవే ధ్యేయం గా భావించే నాయకుడు మాకు కావాలి. ప్రజల అవసరాలను తీర్చే నాయకున్నే ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినవారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పేదరికాన్ని పారదోలాలి. సమాజంలోని అసమానతలను రూపుమాపాలి. ఇలాంటివారికే నేను ఓటు వేస్తాను. శ్రీకాంత్, యువ ఓటరు, గోపాల్‌పేట
Comments
Please login to add a commentAdd a comment