విద్యార్థులకు ప్రేమతో బోధించండి
నల్లజర్ల, న్యూస్‌లైన్ : విద్యార్థులనుభయంతో కాకుండా ప్రేమతో చేరదీసి విద్యాబుద్ధులు నేర్పితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. శనివారం నల్లజర్ల ఏకేఆర్జీ కళాశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డివిజన్లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతిని తరిమి కొడదాం అంటూనే కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యను బోధించాలని ఆదేశించారు.
నిర్ధిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు అంటే రిజల్ట్ కాదని, ఉత్తమంగా బోధించడమని కలెక్టర్ చెప్పారు. డీఈవో నరసింహారావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి డీవైఈవో తిరుమలదాస్, తహసిల్ధార్ సుబ్బారావు పాల్గొన్నారు.
ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించండి
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. స్థానిక జలభవన్లో శనివారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ, ఫొటో ఓటరు గుర్తింపుకార్డుల జారీ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు ఈ నెల 25 జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఫొటో ఓటరు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఇఆర్వోలు వై.రామకృష్ణ, నాగరాజువర్మ తదితరులు పాల్గొన్నారు.