నేడు టెట్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వెల్లడికి చర్యలు
పరీక్షకు 3.40 లక్షల మంది హాజరు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత నెల 22న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,75,552 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,082 మంది (90.55 శాతం) హాజరయ్యారు. ఇందులో పేపరు-1 రాసేందుకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా, 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు.
పేపర్-2 రాసేందుకు 2,74,339 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,924 మంది (91.83 శాతం) హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com, tstet. cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఇక ఈ పరీక్షను నిర్వహించి నెల రోజులు కావస్తున్నా ఫలితాల వెల్లడిలో విద్యాశాఖ కావాలనే జాప్యం చేస్తోందని అభ్యర్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫలితాల ను వెంటనే విడుదల చేయాలనే డిమాం డ్తో ఈనెల 20న టెట్ కార్యాలయం, విద్యా శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. ఈ మేరకు ఫలితాల విడుదలకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.