Teachers service Rules
-
టీచర్ల సీనియారిటీపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉన్నతాధికారులు మళ్లీ సమీక్ష ప్రారంభించారు. ముందుగా సీనియారిటీ జాబితా రూపకల్పనపై దృష్టి పెట్టారు. ముసాయిదా జాబితాను తయారు చేసి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా రూ పొందించే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ఎంత మేర తీసుకోవాలి, సీనియారిటీకి ప్రామాణికాలు ఏమిటనే దానిపై సూచనలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై శుక్రవా రం చర్చించారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. సీనియారిటీ జాబితా విడుదలకు ముందు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 317 జీవో వల్ల కొంతమంది టీచర్లు ఆయా జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా సర్వీసును ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రమోషన్ల ప్రక్రియకు గతం నుంచి పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని, బదిలీల విషయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలనే ప్రతిపాదనపై అధికారు లు చర్చించారు. ఇప్పటికే స్పౌజ్ కేసులు, అనారోగ్యం కారణంగా బదిలీలు కోరుకునే వారు, పరస్పర బదిలీలు పెట్టుకున్నవారూ ఉన్నారు. వీటిని పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఇది అన్యాయం ‘దీర్ఘకాల వాధులతో బాధపడుతున్న టీచర్లు, విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న స్పౌజ్ కేసులు, వికలాంగులు, ఒంటరి మహి ళలు ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. రాజకీయ ప్రముఖుల పైరవీతో కొంతమందిని ఇష్టమొచ్చిన చోటుకు దొడ్డిదారిన బదిలీ చేయడం అన్యాయం. సీనియారిటీ జాబితా లేకుండా బదిలీలు, పదోన్నతుల వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు.’ –చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దొడ్డిదారి బదిలీలు షురూ! బదిలీలు, పదోన్నతులపై కసరత్తు జరుగుతుండగానే.. కొంతమందిని కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు ఒకరిని మెడికల్ గ్రౌండ్లో బదిలీ చేశారు. మరో ఉపాధ్యాయుడిని ఎస్‌ఈసీఆర్‌టీకి డిప్యుటేషన్‌పై పం పారు. తాజాగా శుక్రవారం ఓ రాజకీయ ప్రముఖుడి కనుసన్నల్లో ఉన్న వ్యక్తిని నల్లగొండ నుంచి రంగారెడ్డికి బదిలీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 317 జీవోలో 28వ నిబంధనలో ప్రభుత్వం అవసరమనుకుంటే ఎవరినైనా, ఏ కారణం చూపకుండా ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేయొచ్చు. దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది పైరవీకారులు నేరుగా సీఎం కార్యాలయం నుంచి దొడ్డిదారి బదిలీల కోసం ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
సర్వీస్ రూల్స్‌పై విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కొత్త సర్వీసు రూల్స్ రూపకల్పనపై విద్యా శాఖ కసరత్తు ప్రారం భించింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన కొత్త జోనల్ విధానం ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రూల్స్ రూపొందించే పనిలో పడింది. ప్రభుత్వ టీచర్లతో పాటు పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టుకు కొట్టేయడంతో ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి 2018 ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దానికంటే ముందే పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో కొట్టేసింది. దీంతో ఆ తర్వాత వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా మళ్లీ సర్వీసు రూల్స్ రూపకల్పనకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. అందులో కొత్త జోన్లతో పాటు జిల్లా కేడర్, జోనల్ కేడర్, మల్టీ జోన్ కేడర్లే ఉండేలా, 95 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేలా సవరణలు చేస్తూ రాష్ట్రపతి కొత్త జోన్లకు ఆమోదం తెలిపారు. అందులో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గవర్నమెంట్ టీచర్లు/ తత్సమాన కేటగిరీల వారు నాన్ గెజిటెడ్ కేటగిరీలోని జిల్లా కేడర్ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం ఉన్నందున అదే ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని మేనేజ్మెంట్ల టీచర్లు ఒకే కేటగిరీలో లోకల్ కేడర్‌గా పేర్కొన్న నేపథ్యంలో సర్వీసు రూల్స్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వాటిపైనా గతంలో కొందరు ప్రభుత్వ టీచర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ టీచర్లంతా లోకల్ కేడర్‌గా పేర్కొనడాన్ని సవాల్ చేసినా కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేయలేదు. తదుపరి విచారణ చేపట్టే దాకా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వీరాచారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి రూల్స్‌ను రూపొందించి సిద్ధంగా ఉంటే కోర్టులో కేసు మళ్లీ విచారణకు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపట్టొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. -
టీచర్ల సర్వీసు రూల్స్‌కు కేంద్రం ఓకే
♦ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు మార్గం ♦ ఎంఈఓ, డిప్యుటీ డీఈఓ ఖాళీల భర్తీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. గత దశాబ్దన్నర కాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనలపై నెలకొన్న వివాదం కేంద్ర న్యాయశాఖ ఆమోదంతో ఒక కొలిక్కి వచ్చిన ట్లే. ఏకీకృత సర్వీసు నిబంధనలపై ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టులో కేసుల వరకు వెళ్లడంతో రాష్ట్రంలోని వందలాది మండల విద్యాధికారుల పోస్టులు, జిల్లా ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులు దశాబ్దకాలంగా భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఎంఈఓ పోస్టులను భర్తీ చేసినా ఏపీలో ఇప్పటికీ 550కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యుటీ డీఈఓ పోస్టులు కూడా 140కి పైగా ఖాళీగా ఉన్నాయి. గత ఏడాదిలో సుప్రీంకోర్టు టీచర్ల సర్వీసు నిబంధనలపై తుది తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా సర్వీసు నిబంధనలు రూపొందించుకోవచ్చని, ఆయా టీచర్లకు పదోన్నతుల తదితర అంశాలపై ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పు అనంతరం కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదికను పంపించినా ప్రభుత్వ టీచర్ల సంఘం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వ్యవహారాన్ని న్యాయశాఖ పరిశీలనకు కేంద్రం అప్పగించింది. ఎట్టకేలకు ఇటీవల కేంద్ర న్యాయశాఖ ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయడానికి వీలుగా కేంద్ర హోం శాఖకు నివేదికను అందించింది. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో ఇక కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఉత్తర్వులకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంది. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం కూడా సానుకూల నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అప్పటికి ఈ వ్యవహారం పూర్తవుతుంది.