టీచర్ల సర్వీసు రూల్స్‌కు కేంద్రం ఓకే
♦ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు మార్గం
♦ ఎంఈఓ, డిప్యుటీ డీఈఓ ఖాళీల భర్తీకి అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. గత దశాబ్దన్నర కాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనలపై నెలకొన్న వివాదం కేంద్ర న్యాయశాఖ ఆమోదంతో ఒక కొలిక్కి వచ్చిన ట్లే. ఏకీకృత సర్వీసు నిబంధనలపై ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టులో కేసుల వరకు వెళ్లడంతో రాష్ట్రంలోని వందలాది మండల విద్యాధికారుల పోస్టులు, జిల్లా ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులు దశాబ్దకాలంగా భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది.
మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఎంఈఓ పోస్టులను భర్తీ చేసినా ఏపీలో ఇప్పటికీ 550కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యుటీ డీఈఓ పోస్టులు కూడా 140కి పైగా ఖాళీగా ఉన్నాయి. గత ఏడాదిలో సుప్రీంకోర్టు టీచర్ల సర్వీసు నిబంధనలపై తుది తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా సర్వీసు నిబంధనలు రూపొందించుకోవచ్చని, ఆయా టీచర్లకు పదోన్నతుల తదితర అంశాలపై ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పు అనంతరం కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదికను పంపించినా ప్రభుత్వ టీచర్ల సంఘం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వ్యవహారాన్ని న్యాయశాఖ పరిశీలనకు కేంద్రం అప్పగించింది.
ఎట్టకేలకు ఇటీవల కేంద్ర న్యాయశాఖ ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయడానికి వీలుగా కేంద్ర హోం శాఖకు నివేదికను అందించింది. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో ఇక కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఉత్తర్వులకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంది. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం కూడా సానుకూల నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అప్పటికి ఈ వ్యవహారం పూర్తవుతుంది.