tech madhu
-
నయీమ్ అనుచరులను చర్లపల్లికి తరలింపు
పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం వీరిని హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచిన వనస్థలిపురం పోలీసులు తదనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. నయీం కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధుని పిటి వారెంట్ మీద నల్లగొండ జైలు నుంచి తరలించారు. సోమవారం మధును సైతం హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. -
నయీమ్ కేసులో సిటీ మాజీ మంత్రి!
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఇప్పటికే పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు వినబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కి చెందిన మాజీ మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సదరు మాజీ మంత్రికి నయీంతో సంబధాలున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అయితే ఆ మంత్రి ఎవరుంటారన్న చర్చ ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. టెక్ మధు పేరు చర్చకు... నయీం కేసులో టెక్ మధు అలియాస్ శ్రీనివాసరెడ్డి పేరు చర్చల్లోకి వచ్చింది. వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన నయీం కేసులో టెక్ మధును 16వ నిందితుడిగా చేర్చారు. నక్సలైట్ల కోసం రాకెట్లు, రాకెట్ లాంఛర్లను సిద్ధం చేసేందుకు 2003లో చెన్నైలోని అంబత్తూర్లో ఓ పరిశ్రమను స్థాపించాడు. రాకెట్ లాంఛర్స్ వన్, రాకెట్ లాంఛర్స్ టూ అనే రెండు ప్రాజెక్టులను మొదలుపెట్టాడు. 600 రాకెట్ లాంఛర్లను సిద్ధం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తరలించాడు. మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు 1,550 రాకెట్లు, 40 రాకెట్ లాంఛర్లు సిద్ధం చేశాడు. దర్శికి 400, కందుకూరుకు 200, మహబూబ్‌నగర్‌కు 600, కడపకు 300 రాకెట్ లాంఛర్లను సరఫరా చేశాడు. అయితే 2006 నవంబర్ 4న అప్పటి వరంగల్ రేంజ్ డీఐజీ రవిగుప్తా, ఎస్పీ సౌమ్యమిశ్రా ముందు భార్య సుధారాణి అలియాస్ వసంతతో వచ్చి లొంగిపోయాడు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో ఉన్న టెక్ మధు పేరు తాజాగా నయీం కేసులో తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. -
నయీం ముఠాలో టెక్ మధు
ఎ–16గా కేసు నమోదు మధు స్వస్థలం కేసముద్రం 2006లో లొంగిపోయిన మాజీ మావోయిస్టు వరంగల్: ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాలో జిల్లాకు చెందిన టెక్ మధు ఉన్నట్లు వెలుగు చూసింది. నయీం కేసులో పోలీసులు టెక్ మధును ఎ–16గా చేర్చడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన మధు నయీం ముఠాలో చురుకుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చెందిన ఆయుధ ఫ్యాక్టరీకి ఇంచార్జ్‌గా ఉన్న మధు వారికి రాకెట్ లాంఛర్లను తయారు చేసి ఇవ్వడంతో వార్తల్లోకి ఎక్కాడు. తోట కుమారస్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాసరెడ్డి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరాడు. మజ్జిగ రాజు అనే పీపుల్స్‌వార్ సిటీ అర్గనైజర్తో పరిచయం ఏర్పడడంతో మధు 1990నుంచి 1991వరకు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీం ఏర్పాటు చేయడంతో అందులో సభ్యునిగా నియమించబడ్డాడు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు బయటకు వచ్చిన మధు కోయంబత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమో పొందాడు. కోర్సు పూర్తయిన వెంటనే 2002లో నల్లమల ఫారెస్టుకు వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి సందే రాజమూళి అలియాస్ కృష్ణా, అక్కిరాజు హరగోపాల్, శాఖమూరి అప్పారావులాంటి పీపుల్స్‌వార్ సీనియర్ నేతల పర్యవేక్షణలో పనిచేశాడు. అక్కడే అయన రాకెట్ లాంచర్లకు డిజైన్ చేసినట్లు తెలిసింది. 2003లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దులోని మల్కన్‌గిరి క్యాంపులో రాకెట్ లాంచర్ల ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడే లాంచర్లను ప్రయోత్మకంగా వినియోగించినట్లు తెలిసింది. అక్కడ రాకెట్ లాంచర్ల కర్మాగారం ఉన్నట్లు పసిగట్టిన పోలీసులు దాడులు నిర్వహించడంతో మధు చాకచక్యంగా తప్పుకున్నాడు. అనంతరం మావోయిస్టులతో వచ్చిన భేదాభిప్రాయాలతో పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య సుధారాణి అలియాస్ వసంతతో కలసి 2006 నవంబర్ 5న జిల్లాలో డీఐజీ రవిగుప్తా, అప్పటి ఎస్పీ సౌమ్యమిశ్రా ఎదుట లొంగిపోయారు. గత సంవత్సరం లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా కేంద్రంలో పోలీసులు మధు చేత ఉపన్యాసం ఇప్పించారు. మావోయిస్టు పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను మధు వివరించాడు. ఆ తర్వాత మధు గ్యాంగ్‌స్టర్ నయీంతో పరిచయం ఏర్పడి ఆయన గ్యాంగ్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది. నయీం గ్యాంగ్‌కు మధు ఆయుధాలు సరఫరా చేశాడన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.