నయీం ముఠాలో టెక్ మధు
-
ఎ–16గా కేసు నమోదు
-
మధు స్వస్థలం కేసముద్రం
-
2006లో లొంగిపోయిన మాజీ మావోయిస్టు
వరంగల్: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాలో జిల్లాకు చెందిన టెక్ మధు ఉన్నట్లు వెలుగు చూసింది. నయీం కేసులో పోలీసులు టెక్ మధును ఎ–16గా చేర్చడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన మధు నయీం ముఠాలో చురుకుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చెందిన ఆయుధ ఫ్యాక్టరీకి ఇంచార్జ్‌గా ఉన్న మధు వారికి రాకెట్ లాంఛర్లను తయారు చేసి ఇవ్వడంతో వార్తల్లోకి ఎక్కాడు. తోట కుమారస్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాసరెడ్డి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరాడు.
మజ్జిగ రాజు అనే పీపుల్స్‌వార్ సిటీ అర్గనైజర్‌తో పరిచయం ఏర్పడడంతో మధు 1990నుంచి 1991వరకు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీం ఏర్పాటు చేయడంతో అందులో సభ్యునిగా నియమించబడ్డాడు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు బయటకు వచ్చిన మధు కోయంబత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమో పొందాడు. కోర్సు పూర్తయిన వెంటనే 2002లో నల్లమల ఫారెస్టుకు వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి సందే రాజమూళి అలియాస్ కృష్ణా, అక్కిరాజు హరగోపాల్, శాఖమూరి అప్పారావులాంటి పీపుల్స్‌వార్ సీనియర్ నేతల పర్యవేక్షణలో పనిచేశాడు.
అక్కడే అయన రాకెట్ లాంచర్లకు డిజైన్ చేసినట్లు తెలిసింది. 2003లో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దులోని మల్కన్‌గిరి క్యాంపులో రాకెట్ లాంచర్ల ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడే లాంచర్లను ప్రయోత్మకంగా వినియోగించినట్లు తెలిసింది. అక్కడ రాకెట్ లాంచర్ల కర్మాగారం ఉన్నట్లు పసిగట్టిన పోలీసులు దాడులు నిర్వహించడంతో మధు చాకచక్యంగా తప్పుకున్నాడు. అనంతరం మావోయిస్టులతో వచ్చిన భేదాభిప్రాయాలతో పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య సుధారాణి అలియాస్ వసంతతో కలసి 2006 నవంబర్ 5న జిల్లాలో డీఐజీ రవిగుప్తా, అప్పటి ఎస్పీ సౌమ్యమిశ్రా ఎదుట లొంగిపోయారు. గత సంవత్సరం లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా కేంద్రంలో పోలీసులు మధు చేత ఉపన్యాసం ఇప్పించారు. మావోయిస్టు పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను మధు వివరించాడు. ఆ తర్వాత మధు గ్యాంగ్‌స్టర్ నయీంతో పరిచయం ఏర్పడి ఆయన గ్యాంగ్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది. నయీం గ్యాంగ్‌కు మధు ఆయుధాలు సరఫరా చేశాడన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.