సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్‌కాల్‌తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్‌చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు.
బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్‌ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్‌లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
Comments
Please login to add a commentAdd a comment