25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 25 వేల మందికి పైగా ఉపాధ్యాయుల నియామకాల్ని రద్దు చేస్తూ ఇచ్చిన కోలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సీబీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని, అయితే అభ్యర్థులపై లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది.25 వేలకుపైగా ఉపాధ్యాయుల2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ కోల్‌కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు వారు అందుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.ప్రజల విశ్వాసం కోల్పోతేకోల్కతా హైకోర్టు తీర్పుపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. ప్రజల విశ్వాసం కోల్పోతే ఇంకేమీ మిగలదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర అధికారులను నిలదీసిన కోర్టుమొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు కొత్త పోస్టులను ఎలా విడుదల చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎలా నియమిస్తారంటూ రాష్ట్ర అధికారులను కోర్టు నిలదీసింది. సరైన రికార్డులు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు లేకపోవడంపై సుప్రీం కోర్టు సంబంధిత అధికారులను మందలించింది.