23 యూనివర్సిటీలు, 279 కాలేజీలు నకిలీవి
నకిలీ యూనివర్సిటీలు, నకిలీ కాలేజీలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో 23 యూనివర్సిటీలు, 279 టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు ఎలాంటి రెగ్యులేటరీ అనుమతి లేదని తేలింది. నకిలీ కాలేజీల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని వెల్లడైంది. ఇండియాలోనే ఈ రాష్ట్రంలో నకిలీ కాలేజీలు ఎక్కువగా ఉద్భవిస్తున్నాయని తెలిసింది. ఈ కాలేజీలకు డిగ్రీలు జారీచేయడానికి ఎలాంటి అథారిటీ లేదని, ఈ కాలేజీలు జారీచేసే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కేవలం ఓ కాగితమేనని యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. 23 నకిలీ యూనివర్సిటీల్లో ఢిల్లీలోనే ఏడు యూనివర్సిటీలు ఉన్నాయని ఈ కమిషన్ వెల్లడించింది.
యూజీసీ, ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గత నెల చేపట్టిన వార్షిక సమీక్షలో ఈ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలను వెలుగులోకి వచ్చాయి. ఈ నకిలీ ఇన్స్టిట్యూట్ల జాబితాను యూజీసీ, ఏఐసీటీఈ తమ వెబ్ సైట్లో పొందుపరిచాయి. వచ్చే నెల నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది. అనుమతి లేకుండా.. కార్యకలాపాలు సాగిస్తున్న ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ జాబితాను సంబంధిత రాష్ట్ర అధికారులకు తాము పంపుతామని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తామని యూజీసీ అధికారులు చెప్పారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో కూడా నకిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. విద్యార్థులను జాగ్రత్త పరిచేందుకు ఈ నకిలీ కాలేజీల జాబితాలను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు.