సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధించాలి
ఇంజనీర్స్‌డే లో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్
ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
ఖమ్మం జెడ్పీసెంటర్: మారుతున్న కాలంతో సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్ అన్నారు.గురువారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా ఇంజనీర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు.స్థానిక ఎన్నెస్పీ క్యాంప్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళుల్పంచారు.ఈ సందర్భంగాడిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎన్.చంద్రారెడ్డి అధ్యక్షతన ఎన్నెస్పీ క్యాంప్,జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జరిగిన సభలో పలువురు వక్తలు విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. తొలుత ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, వంతెనలు, మంచినీటి వసతి కల్పించేందుకు ఆయన చేసిన కృషి అపూర్వమైనందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. పీఆర్ ఎస్ఈ సుధాకర్‌రావు మాట్లాడుతూ యువ ఇంజినీర్లు నూతన ఉత్తేజంతో పని చేసి అభివృద్ధి్దకి బాటలు వేయాలని సూచించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ జయపాల్‌రావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య పట్టుదల కార్యదీక్ష అంకితభావాన్ని ఆదర్శంగా తీసుకుని సాగునీటి రంగంలో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌అండ్ ఎస్ ఎస్ఈ సత్యనారాయణ మాట్లాడుతూ మిషన్ భగిరథ పథకంఅమలులో ఇంజినీర్లు అందరూ కృషి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. సమావేశంలో ఈఈలు ఐ.రమేష్, నారాయణరావు, జేఏసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పీఆర్ఇంజినీరింగ్ సంఘం అధ్యక్షుడు కేవీకే.శ్రీనివాస్, ఏఈల సంఘం అధ్యక్షుడు నవీన్, హౌసింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.