ఐఫోన్లు చాలా చీప్ ఎక్కడో తెలుసా?
స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నా చేతిలో ఐఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అయితే ఐఫోన్ పై మోజు పడ్డా ధర ఎక్కువ ఉంటుందని ఇతర బ్రాండ్ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతి తక్కువ ధరకే ఐఫోన్లు ఎక్కడ దొరుకుతాయే తెలుసా..! దీనికి సమాధానం ఆఫ్రికాలోని అంగోలా దేశం. ఇతర దేశాలతో పోల్చిచూస్తూ అంగోలావాసులు కాస్త లక్కీ అని చెప్పవచ్చు. రాకెట్ ఇంటర్నెట్ ఆన్లైన్ రీటెయిలర్ సంస్థ లినియో ఇటీవల జరిపిన టెక్నాలజీ ప్రైస్ ఇండెక్స్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 72 దేశాల్లో కొన్ని అధిక ధర ఉండే స్మార్ట్ ఫోన్లపై ఈ-కామర్స్ సంస్థ లియోని సర్వే చేసింది.
ఈ 72 దేశాల్లో కనీసం ఐదు ప్రధాన నగరాలలో ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, రిటెయిలర్లు విక్రయాలు చేస్తున్న ధరల పట్టికను పరిశీలించి ఓ నివేదికను రూపొందించింది. ఆ పట్టికను గమనించినట్లయితే అంగోలాలో ఐఫోన్ సగటు ధర రూ.401.4 డాలర్లు (సుమారు రూ.27,300) ఉండగా, భారత్లో మాత్రం 505.25 డాలర్లు(రూ.34,420) ధర ఉంది. ఆంగోలా తర్వాత జపాన్ 413.58 డాలర్లు, చైనా 470.74 డాలర్లు, ఫిన్లాండ్ 475.94 డాలర్లు, యూఏఈ 498.25 డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ 505.25 డాలర్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
ఆర్థిక మాంద్యం సమస్యల్లో చిక్కుకున్న వెనిజులాలో మాత్రం కోటీశ్వరులు బెదిరిపోయే రేంజ్లో ఐఫోన్ ధరలు ఉన్నాయి. ఇక్కడ ఐఫోన్ల సగటు ధరలు 97,813.82 డాలర్లు(రూ.66.6 లక్షలు) ఉన్నట్లు లినియో సంస్థ పేర్కొంది. 2019 వరకు వెనిజులాలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయని సంస్థ అభిప్రాయపడింది. అంగోలాలో పన్నులు తక్కువ కావడమే అక్కడ ఐఫోన్ల సగటు ధర తక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని లినియో బృందం తెలిపింది.