ఉదారుడు... ఉద్దండుడు
‘మన క్లేశం విభజనతో అంతం కాదన్న వాస్తవం భయపెడుతున్నది. పైగా అది కొత్త కష్టాలకు ఆరంభమే అవుతుంది. ఇక ఆ కష్టాలు తొలగడానికి పాతికేళ్లయినా చాలవని గుబులుగా కూడా ఉంది.’ తేజ్ బహదూర్ సప్రూ, మహమ్మదలీ జిన్నా – ఈ ఇద్దరు దక్షిణాసియాలోనే గొప్ప న్యాయవాదులని అనేవారు గాంధీజీ. ఆ ఇద్దరు ఆప్తమిత్రులు. వారిలో జిన్నా దేశ విభజన కోరి, సాధించాడు. సప్రూ దేశ విభజనను నిరాకరించాడు. స్వాతంత్య్రం రావడానికి రెండు మాసాల ముందు ఒక ఉత్తరంలో సప్రూ (డిసెంబర్ 8, 1875 – జనవరి 20, 1949) రాసినవే పై వాక్యాలు. భారత్–పాకిస్తాన్ విభజన ఫలితం గురించి ఇంత స్పష్టంగా ఆలోచించిన కొద్దిమందిలో సప్రూ ఒకరు. సప్రూ స్వాతంత్య్ర సమరయోధుడు, ది లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రముఖుడు, పండితుడు. న్యాయశాస్త్రంతో పాటు ఇంగ్లిష్ సాహిత్యం విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పర్షియన్, ఉర్దూ పట్ల ఆయన అభిరుచి ఎనలేనది. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున, తన పార్టీ తరఫున సైమన్ కమిషన్ సహా ఎన్నోసార్లు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిన మేధావి సప్రూ. ఏ పోరాటమైనా రాజ్యాంగ బద్ధంగా జరగాలనే కానిస్టిట్యూషనలిస్టుల వర్గానికి చెందినవారాయన. నిజానికి జిన్నా కూడా తొలి దినాలలో అలాంటి భావాలు కలిగినవారే. కానీ వీరంతా తొలి దశ స్వాతంత్య్ర పోరాటంలో తిరుగులేని జాతీయవాదులు.
సప్రూ అలీగఢ్‌కు తరలివచ్చిన ఒక కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఆగ్రాలో న్యాయశాస్త్రం చదువుకున్న తరువాత అలహాబాద్ హైకోర్టు న్యాయవాది అయ్యారు. అలహాబాద్ అంటేనే స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖులకు ఆలవాలం. తరువాతి కాలాలలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన పురుషోత్తమదాస్ టాండన్ సప్రూ వద్ద సహాయకుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం డీన్‌గా కూడా సప్రూ పనిచేశారు. నాటి జాతీయవాదులందరి మాదిరిగానే సప్రూ కూడా మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. గోపాలకృష్ణ గోఖలే ఆయనకు ఆదర్శం. చిత్రం ఏమిటంటే– సప్రూయే కాదు, ఆయన కంటే ముందు గోఖలేను రాజకీయ గురువుగా ఆరాధించిన వ్యక్తి జిన్నా. తాను ముస్లిం గోఖలేగా ఖ్యాతి గాంచాలని ఆకాంక్షించాడు. తరువాత వచ్చిన గాంధీ కూడా గోఖలేనే తన రాజకీయ గురువుగా భావించారు. కానీ ఈ ముగ్గురు వేర్వేరు దారులలోనే ప్రయాణించారు. జిన్నా ముస్లిం లీగ్ వైపు నడిచాడు. సప్రూ లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాలో (తరువాత ఇదే ది నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయింది) చేరడానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. భారతీయులకు విస్తృత రాజకీయ హక్కులు ఉండాలన్నది సప్రూ వాదన. స్వాతంత్య్రం కూడా ఉండాలి. కానీ అది చర్చల ద్వారా సాధించుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రాంతీయ లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. ఎవరో కొందరు భారతీయులు తప్ప మిగిలినవారు ఆంగ్ల ప్రభుత్వం నామినేట్ చేసినవారే. అందుకే వీటిలోని సభ్యులను వైస్రాయ్ ఆడించే బొమ్మలనీ రబ్బరు స్టాంపులనీ విమర్శ ఉండేది. అయినా వలస ప్రభుత్వం ఇచ్చిన ఆ కొద్ది అవకాశాన్నే ఆసరాగా చేసుకుని హక్కుల సాధనకు పోరాటం చేయాలని సప్రూ అభిమతం. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోను, యుౖ¯ð టెడ్ ప్రావిన్స్ ప్రాంతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోను కూడా ఆయన పనిచేశారు. వైస్రాయ్ కౌన్సిల్లో న్యాయ విభాగ సభ్యుడు. దేశ విభజనను నిస్సంశయంగా నిరాకరిస్తూనే మైనారిటీల హక్కుల కోసం పోరాడిన హిందువులు ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు సప్రూ.
సప్రూ మొదట గాంధీజీ నాయకత్వంలోనే పనిచేశారు. శాసనోల్లంఘన, దండి సత్యాగ్రహం, క్విట్ఇండియా ఉద్యమాలు అహింసాయుతంగా జరగాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అందుకే వీటిని సప్రూ (1918లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా కూడా) బలపరిచారు. 1892లోనే సప్రూ జాతీయ కాంగ్రెస్ సభలకు మొదటిసారి హాజరయ్యారు. అప్పుడే అందులో సభ్యత్వం తీసుకుని, కార్యదర్శి అయ్యారు. సెంట్రల్ ప్రావిన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్‌ను వీడినప్పటికీ సప్రూను గొప్ప న్యాయ నిపుణుడిగా ఆ సంస్థ గౌరవించేది. చరిత్రాత్మక గాంధీ–ఇర్విన్ ఒప్పందంలో కీలక పాత్ర ఆయనదే. దీనితోనే ఉప్పు సత్యాగ్రహం ముగిసింది. అంటరాని కులాల వారికి ప్రత్యేక నియోజక వర్గాల కేటాయింపు అంశంలో కూడా గాంధీ, అంబేడ్కర్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య రాయబారం నడిపిన వ్యక్తి కూడా సప్రూయే. పూనా ఒప్పందంతో ఇది సాధ్యమైంది. తన లిబరల్ పార్టీ తరఫున సప్రూ రౌంట్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. అప్పుడు సప్రూకు పార్టీ సహచరునిగా ఉన్నవారు ఎంఆర్ జయకర్. తరువాత హిందూ మహాసభలో కీలకపాత్ర వహించారు. భారతీయులకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించే అంశాన్ని చర్చిండానికి ఉద్దేశించినవే రౌండ్ టేబుల్ సమావేశాలు.
సైమన్ కమిషన్ తదనంతర పరిణామాలలో సప్రూ నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనది. రాజ్యాంగ సంస్కరణలను రూపొందించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపినదే సైమన్ కమిషన్. సర్ జాన్ అల్సేబ్రూక్ సైమన్ దీని అధ్యక్షుడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రధాని పదవి చేపట్టి, భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించడంలో కీలక పాత్ర పోషించిన క్లెమెంట్ అట్లీ ఈ కమిషన్‌లోనే సభ్యుడు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు. కానీ ఎవరూ భారతీయులు కారు. అందుకే దీనిని భారతీయులు తిరస్కరించారు. అలా అయితే భారతీయులే ఒక రాజ్యాంగం రాసుకోవాలని బ్రిటిష్ కార్యదర్శి సవాలు విసిరాడు. ఫలితమే నెహ్రూ 14 సూత్రాలు. వీటినే నెహ్రూ ప్రణాళిక అని కూడా అంటారు. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘంలో నిజానికి ప్రముఖ పాత్ర వహించినవారు సప్రూయే. కానీ ఈ ప్రణాళికను జిన్నా వ్యతిరేకించారు. లక్నో కాంగ్రెస్ (1916) ముస్లింలకు ఇచ్చిన హామీలు ఇందులో లేవన్నది జిన్నా ఆరోపణ.
భారత స్వాతంత్య్రోద్యమానికి అనేక పార్శా్వలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కావచ్చు. రాజ్యాంగ సంస్కరణల కోసం పోరాటం అందులో భాగమే. దేశానికి అవసరమైన రాజ్యాంగ సంస్కరణల ప్రక్రియ కొనసాగడం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినవారు కొందరు ఉన్నారు. దేశంలో రాజ్యాంగబద్ధత కోసం, భారతీయులు రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం వీరు చేసిన కృషి గొప్పది. కాబట్టి భారత స్వాతంత్య్ర పోరాటమంటే రాజ్యాంగ సంస్కరణల క్రమం కూడా. ఈ సంస్కరణల ప్రక్రియ భారత పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అనుగుణంగా ఉన్నదో లేదో, హక్కులను కాపాడేదో కాదో పరిశీలించే కొందరు మేధావులు కూడా ప్రతి మలుపులోను కనిపిస్తారు. అలాంటి వారిలో సప్రూ ప్రథముడు. 1928–1942 మధ్య రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి కనీసం ఐదు పర్యాయాలు సప్రూ కీలక పాత్ర పోషించారు. భారత న్యాయశాస్త్ర చరిత్రలో అద్వితీయుడు సప్రూ. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ పత్రికల మీద, వాటి సంపాదకుల మీద, స్వాతంత్య్రం సమరయోధుల మీద పెట్టిన అనేక కేసులను సప్రూ వాదించారు. 1944 రంజాన్ మాసంలో (సెప్టెంబర్ 9 నుంచి) జిన్నా–గాంధీ మధ్య 18 రోజుల పాటు చర్చలు జరిగాయి. ద్విజాతి సిద్ధాంతం వాదన నుంచి జిన్నాను వెనక్కి తీసుకురావడం గాంధీజీ ఉద్దేశం. అది జరగలేదు. అయినా మరొక దఫా ఆ ఇద్దరి మధ్య జరగాలని గట్టిగా కోరినవారు సప్రూ.
న్యాయశాస్త్రంలో అపార నైపుణ్యంతో పాటు సప్రూకు ఉన్న మరొక కోణం సాహిత్యాభిమానం. సాహిత్యం, కవిత్వంతో తడిసిన సాయంత్రాలను ఆస్వాదించడం ఆయన జీవితమంతా కనిపిస్తుంది. అలహాబాద్‌లోని 19 అల్బర్ట్ వీధిలోని ఆయన ఇల్లు సాయంత్రం అయ్యే సరికి కవులు, నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఆచార్యులు, జూనియర్ లాయర్లు వంటి వారితో నిండిపోయేది. కవితా పఠనం, స్వాతంత్య్రోద్యమం మీద చర్చ, సరదా సంగతులు, హాస్యోక్తులతో ఆ ‘దర్బార్’లు రసవత్తరంగా సాగేవి. ఇది నిత్య కృత్యం. పర్షియన్, ఉర్దూ భాషలలో ఆయన పాండిత్యం అసాధారణమైనది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ తాను రాసిన ఒక వ్యాసాల సంకలనానికి సప్రూ చేతనే ముందుమాట రాయించారు. ఉర్దూలో ఆయనకు ఉన్న పాండిత్యం అంతటిది. అలాగే ఆయన కశ్మీర్, యూరోపియన్, అరేబియన్ వంటలు చేయడానికి ముగ్గురు వంటవాళ్లను నియమించుకుని ఎవరికి కావలసిన రీతిలో వారికి భోజనాలు ఏర్పాటు చేయించేవారు. సప్రూ విలాసవంతమైన జీవితం గడిపారు. అయితే అది అర్థవంతమైన జీవితం. తాను ఆనందంగా, ఉల్లాసంగా ఉండేవారు. అవతలి వారిని కూడా సంతోషపెట్టేవారు. జిన్నాకూ, సప్రూకూ ఒక కోర్టు కేసు విషయంలో వాస్తవంగా జరిగిన ఉదంతాన్ని ఇక్కడ ఉదహరించడం అసందర్భం కాదు.
ఒక ఆస్తి తగాదాలో ఒకవైపు సప్రూ, మరొకవైపు జిన్నా న్యాయవాదులుగా పనిచేశారు. వాదోపవాదాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆ ఆస్తికి సంబంధించిన అసలు పత్రం తీసుకురమ్మని ఆంగ్ల న్యాయమూర్తి ఆదేశించాడు. దానిని తీసుకురాగానే న్యాయమూర్తి చేసిన పని, పైకి చదివేపనిని జిన్నాకు అప్పగించడం. ఎందుకంటే జిన్నా ముస్లిం. అది పర్షియన్లో రాసి ఉంది. జిన్నా ఆ పత్రం తీసుకున్నాడే కానీ, అక్షరం కూడా చదవలేకపోయాడు. వెంటనే సప్రూ ఆ పత్రాన్ని తీసుకుని చదివి వినిపించాడు. మరునాడు ఇదే విషయం పత్రికలలో వచ్చింది. దానికి ఒక పత్రిక పెట్టిన శీర్షిక– ‘పండిట్ జిన్నా, మౌల్వీ సప్రూ’. మరొక సంగతి కూడా చెప్పుకోవాలి. సారే జహాసె అచ్చా గీతం (1904) రాసిన డాక్టర్ ఇక్బాల్ లేదా అల్లామా ఇక్బాల్; డాక్టర్ తేజ్‌బహదూర్ సప్రూ వరసకు (కజిన్స్) అన్నదమ్ములే.
- డా. గోపరాజు నారాయణరావు