జీవీ ప్రకాశ్తో తేజు అశ్విని రొమాన్స్
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడిగా జోడి గుర్రాలను స్వారీ చేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ ఆ మధ్య కథానాయకుడిగా నటించిన బ్యాచిలర్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. దీనికి ఎం.మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అరుళ్ నిధి హీరోగా ఇరవుక్కు అయిదు కన్గళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా కన్నై నంబాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో దర్శకుడు ఎం.మదన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడు. దీనికి బ్లాక్ మెయిల్ అనే టైటిల్ను నిర్ణయించారు. జయక్కొడి పిక్చర్స్ పతాకంపై అమల్రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో జీవీ ప్రకాష్కుమార్కు జంటగా నటి ప్రజ్ఞ నటించనుందనే ప్రచారం జరిగింది.
అయితే తాజాగా నటి తేజు అశ్విని ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఆదిలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించిన ఈ చెన్నై చిన్నది 2020లో ఎన్నై సొల్లపోగిరాయ్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సంతానం సరసన ప్యారీస్ జయరాజ్ చిత్రంలో నటించింది. తాజాగా జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. బ్లాక్ మెయిల్ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు.