Telangana accent
-
తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మీద ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్ శంకర్, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం దసరా అలాంటి కోవకే చెందుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కమర్షియల్గానూ మంచి విజయం సాధిస్తున్నాయి ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపించడంపై మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి మెసెజ్ చేశారు. ‘డియర్ కేటీఆర్ గారు. మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహరణకు బలగం, దసరా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుంది. మరో విషయం ఏంటంటే నాకు 68 ఏళ్లు.. ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లు, జోకర్స్ గా చూపిచండంతో.. గత 20 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశాను’ అని డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కేటీఆర్‌కు వాట్సాప్ మెసెజ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అనుమతితో మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. దీనికి శ్రీరాములు కూడా స్పందింస్తూ.. తప్పకుండా సర్. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను. మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం. థాంక్యూ వెరి మచ్ సర్ అంటూ పేర్కొన్నారు. దీనిని కేటీఆర్ ట్విటర్లో షేర్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంది’ అని కేటీఆర్ తెలిపారు. Messages like this 👇😊 Thanks to KCR Garu for the renaissance on the cultural front A dialect that was ridiculed is now taking centerstage 👍 pic.twitter.com/XuWZBxiYRF — KTR (@KTRBRS) April 1, 2023 -
తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’
నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో మంచి మార్కులే కొట్టేసింది. సినిమా డైరెక్టర్, హీరోతో పోలిస్తే కృతి కాస్తా ఎక్కువ ప్రశంసలే అందుకుంది. ఉప్పెనతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నఈ చిన్నది వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కృతీ శెట్టి ఫీమెయిల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కృతీ తెలంగాణ యాసలో మాట్లాడనుంది. ఉప్పెనలో క్యూట్ లుక్‌తో అలరించిన కృతిశెట్టి.. మరి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్తూ తనలోకి మరో యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందన్నమాట. మరి ఎంత వరకు తెలంగాణ యాసలో మెప్పించి.. ఆడియెన్స్‌కు దగ్గరవుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మూవీతోపాటు నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట. -
నానమ్మ.. బతుకమ్మ
బిలోల శరణ్య ఉరఫ్ ‘తీన్మార్’ లచ్చవ్వ.. తెలంగాణ యాసను పోతపోసుకున్న అచ్చ తెలంగాణ పిల్ల! గా పిల్లకు బతుకమ్మ అంటే నానమ్మ.. నానమ్మ అంటే బతుకమ్మ! గా యాది గీమె మాటల్లనే ఇందాం.. మా సొంతూరు నిజామాబాద్. వన్ ఇయర్ నుంచి ఇక్కడుంటున్నాను. నాకు బతుకమ్మ పండుగ అనగానే మా నానమ్మే గుర్తొస్తది. ఆమె నాకు మంచి ఫ్రెండే కాదు గైడ్ కూడా! బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు నానమ్మ వెనకాలే తిరిగేదాన్ని. బతుకమ్మ పండుగకి అందరం కలుస్తాం. పొద్దున్నే నాన్న, బాబాయ్‌లతో కలిసి నేనూ పూలు తేవడానికి వెళ్లేదాన్ని. ఒక్కో పువ్వుకి ఒక్కో కథ ఉంటది.. అవి మా నానమ్మ చెప్తేనే వినాలి. ఇక ప్రసాదాలైతే.. చెప్తుంటేనే నీళ్లూరుతున్నాయి. అటుకులు, పుట్నాలు, చక్కెరతో మొదలు సత్తుపిండి, పులిహోర దాకా అన్ని ప్రసాదాలు.. యుమ్మీ! షాపింగ్ ఏవి ఎట్లున్నా ఇదైతే మస్ట్. కొత్త బట్టలు.. వాటికి మ్యాచింగ్ గాజులు.. వగైరా ఉంటేనే బతుకమ్మ పండుగ కలర్ఫుల్గా జరిగినట్టు. నేను రెడీ అవడం ఒకెత్తయితే మా చెల్లెలిని రెడీ చేయడం ఇంకొకెత్తు. నానమ్మ, పెద్దమ్మ, అమ్మ, పిన్ని, అత్త వాళ్లంతా బతుకమ్మను పేర్చడంలో బిజీగా ఉంటే మేమేమో మమ్మల్ని మేం సవరించుకోవడంలో బిజీగా ఉంటాం. బతుకమ్మ పాట.. ఇందులో కూడా నానమ్మే బెస్ట్ అండ్ ఫస్ట్. ఎన్ని పాటలు పాడుతుందో!.. మంచి గొంతు. తను ఒక్కో లైను చెప్తుంటే మేమంతా ఉయ్యాల అని కోరస్ ఇస్తూ తను చెప్పిన లైన్‌నే మళ్లీ రిపీట్ చేస్తాం. సద్దుల బతుకమ్మ రోజు మా ఇంట్లోనే నిమజ్జనం చేస్తాం. మా వాకిట్లో బావి ఉంటుంది. సాయంత్రం వాకిలి ఊడ్చి, చాన్పిచల్లి పెద్ద ముగ్గేస్తాం. అంతకుముందే పేర్చిన బతుకమ్మను, పసుపు గౌరమ్మనూ దేవుడి ముందు పెట్టి పూజచేసి తర్వాత ఆ బతుకమ్మలో గౌరమ్మనుంచి వాకిట్లోకి తెస్తాం. ముగ్గుమీద పీటపెట్టి ఆ పీటమీద బతుకమ్మను పెడతాం. ఆ బావికీ పూజచేసి బతుకమ్మ ఆడతాం. ఆ తర్వాత బావి చుట్టు కూడా అయిదు చుట్లు తిరిగి బతుకమ్మను అందులో నిమజ్జనం చేస్తాం. హైదరాబాద్‌లో.. ఇక్కడ బతుకమ్మను చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్. వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తెలంగాణ రాష్ట్రం.. బతుకమ్మను గవర్నమెంట్ సెలబ్రేట్ చేయడం భలే అనిపిస్తోంది. సెంటర్స్‌లో బతుకమ్మలను పెట్టి డెకరేట్ చేయడం.. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్‌ను డెకరేట్ చేయడం.. మామూలు టైమ్‌లో హైదరాబాద్‌కి.. ఇప్పటి హైదరాబాద్ లుక్‌కి ఎంతో డిఫరెన్స్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కలిసి ఏ ట్యాంక్‌బండ్ మీదో.. నెక్లెస్‌రోడ్ దగ్గరో బతుకమ్మ ఆడ్డం.. ఎంత అద్భుతమైన అనుభూతి. కాంక్రీట్ జంగిల్‌లాంటి ఈ హైదరాబాద్‌లో చీకటి పడిందంటే చాలు ఏ మూల చూసినా.. కలర్‌ఫుల్ బతుకమ్మలు.. పూల రథాలు కదులుతున్నట్లు! ఈ బంగారు బతుకమ్మ ఇట్లనే ప్రతియేడూ రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్న! - సరస్వతి రమ -
కోల్బెల్ట్తో తెలంగాణ శకుంతలకు అనుబంధం
గోదావరిఖని: నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు వచ్చి తెలంగాణను ఇంటిపేరుగా మార్చుకున్న శకుంతల శనివారం హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై మరణించారు. ఆమె విలన్‌గా... తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించారు. చాలా సందర్భాల్లో గోదావరిఖనికి వచ్చిన శకుంతల మరణాన్ని ఈ ప్రాంతంలో ఆమెతో అనుబంధం ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చెల్లెలు సాధన గోదావరిఖనిలో నివసిస్తున్నారు. ఆమె భర్త హరియాదవ్ సింగరేణి ఆర్జీ-1లోని 3వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చనిపోయారు. వీరి పిల్లలు గోదావరిఖనిలోనే నివాసముంటూ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా పోరు తెలంగాణ, నిర్భయ భారతం సినిమాల షూటింగ్ సందర్భంలో శంకుతల గోదావరిఖనిలోని వివిధ లోకేషన్లలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో చిన్నారుల తన పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో ఆమెతో కలిసి సన్నిహితంగా మాట్లాడిన అభిమానులు శంకుతల మరణాన్న జీర్ణించుకోలేకపోతున్నారు.