జంగిల్ బచావో, జంగిల్ బడావో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పచ్చదనం పెంచాలని, అడవులను సంరక్షించాలని, స్మగ్లర్లను శిక్షించాలని పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా కొత్తచట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న అటవీచట్టాలను సమీక్షించాలని, ఆక్రమణదారులను, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు సిద్ధం చేయాలని అన్నారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఇక్కడి ప్రగతిభవన్‌లో పోలీస్, అటవీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సాయుధ పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బృందాలు అడవిలో నిరంతరం తనిఖీలు నిర్వహించడంతోపాటు బయటకు వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డి.ఎఫ్.వో.లు కలసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి బహుముఖ వ్యూహం అమలు చేయాలి. ముఖ్యంగా 4 రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతమున్న అడవిని పూర్తిస్థాయిలో రక్షించాలి. అటవీభూమిలో కోల్పోయిన పచ్చదనం(చెట్ల)ను పునరుద్ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలి. హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగరాలతోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనం పెంచాలి’అని సీఎం దిశానిర్దేశం చేశారు.
స్మగ్లింగ్ జీరోసైజ్‌కు రావాలి
‘జంగిల్ బచావో, జంగిల్ బడావో(అడవిని కాపాడాలి, అడవిని విస్తరించాలి) అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. స్మగ్లింగ్ జీరోసైజుకు రావాలి. స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై పి.డి.యాక్ట్ నమోదు చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. అడవిలో ఒక్కచెట్టు కూడా పోకుండా జాగ్రత్త పడాలి. అడవులను రక్షించే విషయంలో చిత్తశుద్ధి, దృఢచిత్తం, అంకితభావం కలిగిన అధికారులను ఆయా ప్రాంతాల్లో నియమించాలి. వారికి సాయుధ పోలీసుల భద్రత కూడా అందించాలి. చెక్‌పోస్టుల వద్ద కూడా సాయుధ పోలీసుల పహారా పెట్టాలి’అని సీఎం ఆదేశించారు.
ప్రజలే ముఖ్యం– వారి భవిష్యత్తే లక్ష్యం
‘మాకు ప్రజలే ముఖ్యం. వారి భవిష్యత్తే లక్ష్యం. అంతకు మించిన ప్రాధాన్యం మరొకటి లేదు. భావి తరాలు బాగుండాలనే అడవుల రక్షణ, పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్మగ్లింగ్‌కు పాల్పడితే అందరికన్నా ముందు వారినే అరెస్టు చేయండి’అని సీఎం చెప్పారు. తెలంగాణలో 24 శాతం అటవీభూమి ఉందని అధికారిక లెక్కల్లో ఉంది. కానీ, వాస్తవంగా 12 శాతం పచ్చదనం కూడా లేదు. అటవీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది. అటవీభూములపై సాగు హక్కులు కలిగినవారితో కూడా ఉభయ తారకంగా ఉండే చెట్ల పెంపకం చేయించాలి’’అని సీఎం సూచించారు. ‘‘నగరాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం వల్ల రోగాలొస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉండడం మన అదృష్టమని భావిస్తున్నాం. జాగ్రత్తగా ఉండకపోతే అది దురదృష్టంగా మారుతుంది. అన్ని నగరాలు, పట్టణాల్లో చెట్లు పెంచాలి’’అని ముఖ్యమంత్రి అన్నారు.
అవసరమైతే గ్రీన్ సెస్
పచ్చదనం పెంపునకు కాంపా నిధులను వినియోగించడంతోపాటు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, నిధుల కొరత రాకుండా అవసరమైతే గ్రీన్‌సెస్ వసూలు చేస్తామని, గ్రీన్‌ఫండ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నవీన్‌చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పీసీసీఎఫ్(విజిలెన్స్) రఘువీర్, అడిషన్ పీసీసీఎఫ్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.