Telangana IT department
-
మహిళా స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు స్థాపించిన స్టార్టప్‌లను వర్గీకరిస్తూ మంగళవారం ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన స్టార్టప్‌లలో మహిళల వాటా 33% ఉంటే, ఇకపై వాటిని మహిళా స్టార్టప్‌లుగా.. స్టార్టప్‌లలో వారివాటా 20% ఉంటే మహిళా ఎంటర్ ప్రెన్యూ ర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో సాంకేతికత లోపం, సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసరించటం, ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత వంటివి వారి ఎదుగదలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐటీశాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయి ఆవిష్కరణల్లో ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు గ్రాంటుగా అందజేస్తుంది. కాగా, ప్రభుత్వం 2017లో ప్రకటించిన ఎస్జీఎస్టీ, పేటెంట్ ధర, ఇంట ర్నేషనల్ మార్కెట్, రిక్రూట్మెంట్ అసెస్మెంట్, పనితీరు ఆధారిత గ్రాంటు తదితర విషయాల్లో గతంలో ప్రకటించిన మార్గదర్శకాల్లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది. -
టచ్ చేసి చూస్తే మంచీచెడు చెప్పే బొమ్మ..?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపులకు పెద్దలే కాదు అభం శుభం తెలియని చిన్నారులూ గురవుతున్నారు. ఏమీ తెలియని వయసులో ప్రమాదాన్ని పసిగట్టలేని పిల్లలపై సొంత బంధువులు, సన్నిహితంగా మెలిగే ఇరుగుపొరుగువారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలను పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే నిలువరించగలం. ఈ దిశలో వినూత్నంగా ఆలోచించిన వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి భరద్వాజ్ మరో ఇద్దరి సహకారంతో ఓ ప్రత్యేకమైన బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను తాకినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే శబ్దాలతో అది స్పందిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కల్పించాలంటూ.. ట్విట్టర్ వేదికగా తన ఆలోచనలను బహిర్గతం చేయగా.. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు షీటీమ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తదితర ప్రభుత్వ విభాగాలు స్పందించాయి. తాకగానే స్పందించే ‘సంస్కార్’ భరద్వాజ్, వరంగల్‌కు చెందిన రూరల్ ఇన్నోవేటర్ యాకర గణేశ్ సహకారంతో ఈ బొమ్మ (టాయ్)ను తయారు చేశాడు. దీనికి ‘సంస్కార్’ అనే పేరు పెట్టారు. ఈ బొమ్మ తయారీకి కొన్ని రకాల సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించారు. ఈ బొమ్మను తాకినప్పుడు అది స్పందిస్తుంది. కొన్ని సందర్భాల్లో తాకేందుకు ప్రయత్నించే సమయంలోనే స్పందిస్తుంది. బొమ్మ వేర్వేరు భాగాలను తాకుతున్నప్పుడు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది స్పీకర్ ద్వారా శబ్దం వెలువడుతుంది. ఈ బొమ్మ తయారీతో పాటు పనిచేస్తు న్న తీరుపై వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలోని వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ ఎంకే కౌశిక్ వీడియో రూపొందించి ట్విట్టర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొందరు చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న వీడియోను కూడా జత చేశారు. దీనిపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ స్పందించారు. ఈ ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ.. సంస్కార్‌ను మరింత అభివృద్ధి పరచాల్సిందిగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేవేషన్ సెల్‌కు సూచించారు. దీంతో టీఎస్ఐసీ అధికారులు సంస్కార్ రూపకర్తలతో భేటీ కానున్నారు. ప్రత్యక్షంగా చూస్తే వేగంగా అవగాహన చిన్నారుల్లో లైంగిక వేధింపుల విషయమై థియరీ పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించాలనే ఆలోచన ఫలితమే ఈ ‘సంస్కార్’. ఇన్నోవేటర్ యాకర గణేశ్, నేను చర్చించుకుని ఈ బొమ్మను తయారు చేశాం. ఈ బొమ్మ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూస్తే పిల్లలకు వేగంగా అవగాహన కలుగుతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిద్వారా అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. - భరద్వాజ్ గుండు, యాకర గణేశ్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ స్కూళ్లలో ప్రయోగాత్మక అవగాహన సంస్కార్ బొమ్మను ముందుగా నాలుగైదు స్కూళ్లలోకి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని మరింత అభివృద్ధి చేస్తాం. భరద్వాజ్, గణేశ్ ఆలోచనను దీనికే పరిమితం చేయకుండా ప్రత్యేకంగా ఒక టాయ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. - ఎంకే కౌశిక్, వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ -
‘గో బిజ్’తో టీ హబ్ అనుసంధానం
- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంతో సర్కారు ఒప్పందం - విద్య, ఉపాధి అవకాశాలకు తోడ్పాటు.. రాష్ట్రంలో స్టార్టప్‌లకు మరింత ఊతం - వినూత్న ఆలోచనల మార్పిడికి కొత్త మార్గం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ‘ఐ హబ్’ లతో రాష్ట్రంలోని ‘టీ హబ్’ అనుసంధానం కానుంది. ఇక్కడి సంస్థలు, స్టార్టప్‌లు.. అక్కడి వారితో తమ ఆలోచనలను పంచుకోవడానికి, పరస్పర సహకారానికి మార్గం సుగమం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శని వారం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కె.తారక రామారావు సమక్షంలో... కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయ వాణిజ్య, ఆర్థికాభివృద్ధి(గో-బిజ్) డెరైక్టర్ పనేరియా అవ్డిస్, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సంయుక్త ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ ఇంధనంలో పరస్పర సహకారం, పర్యావరణ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక రంగం, వాణిజ్య ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగం తదితర అంశాలపై ఈ ఒప్పందం కుదిరింది. సిలికాన్ వ్యాలీ, తెలంగాణల మధ్య వినూత్న ఆలోచనల మార్పిడికి దీనితో కొత్త మార్గం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు ప్రాంతాల్లోని స్టార్టప్‌లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. భారత్, కాలిఫోర్నియా మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఇరు ప్రాంతాలు సహజ భాగస్వాములయ్యేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుం దని పనోరియా అవ్డిస్ వ్యాఖ్యానించారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే భారతీయ కంపెనీలు కాలిఫోర్నియాలో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని, భారత మార్కెట్‌తో తమ స్టార్టప్ కంపెనీలు అనుసంధానమయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు. ‘ఐ హబ్’లతో అనుసంధానం రెడింగ్ మొదలుకుని సాన్‌డియాగో వరకు సుమారు 15 ప్రముఖ ‘ఐ హబ్’లు అమెరికాలోనే అతిపెద్ద ‘గో-బిజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్’గా ఏర్పడ్డాయి. ప్రస్తుత ఒప్పం దం ద్వారా ‘గో బిజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్’తో టీ-హబ్ అనుసంధానమవుతుంది. తద్వారా టీ హబ్‌లోని సంస్థలు, కంపెనీలతో కాలిఫోర్నియాలోని ‘ఐ హబ్’లు వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది. దీంతో ఇరు ప్రాంతాల నడుమ ఆర్థిక సహకారం, పారిశ్రామిక రంగంలో సంయుక్త పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయి. ఇరు ప్రాంతా ల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగై.. సాంప్రదాయేతర ఇంధన వనరులు, క్లీన్టెక్, స్మార్ట్ సిటీలు, నీటి నిర్వహణ, బయో టెక్నాలజీ, అగ్రిటెక్ తదితర రంగాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.