టచ్‌ చేసి చూస్తే మంచీచెడు చెప్పే బొమ్మ..? | Sankalp Toy Innovative Telangana Students For Women Protection | Sakshi
Sakshi News home page

టచ్‌ చేసి చూస్తే మంచీచెడు చెప్పే బొమ్మ..?

Published Tue, Mar 2 2021 2:32 AM | Last Updated on Tue, Mar 2 2021 4:57 AM

Sankalp Toy Innovative Telangana Students For Women Protection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లైంగిక వేధింపులకు పెద్దలే కాదు అభం శుభం తెలియని చిన్నారులూ గురవుతున్నారు. ఏమీ తెలియని వయసులో ప్రమాదాన్ని పసిగట్టలేని పిల్లలపై సొంత బంధువులు, సన్నిహితంగా మెలిగే ఇరుగుపొరుగువారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలను పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే నిలువరించగలం. ఈ దిశలో వినూత్నంగా ఆలోచించిన వరంగల్‌ వాగ్దేవి ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి భరద్వాజ్‌ మరో ఇద్దరి సహకారంతో ఓ ప్రత్యేకమైన బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను తాకినప్పుడు గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ అనే శబ్దాలతో అది స్పందిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కల్పించాలంటూ.. ట్విట్టర్‌ వేదికగా తన ఆలోచనలను బహిర్గతం చేయగా.. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు షీటీమ్, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ తదితర ప్రభుత్వ విభాగాలు స్పందించాయి.

తాకగానే స్పందించే ‘సంస్కార్‌’ 
భరద్వాజ్, వరంగల్‌కు చెందిన రూరల్‌ ఇన్నోవేటర్‌ యాకర గణేశ్‌ సహకారంతో ఈ బొమ్మ (టాయ్‌)ను తయారు చేశాడు. దీనికి ‘సంస్కార్‌’ అనే పేరు పెట్టారు. ఈ బొమ్మ తయారీకి కొన్ని రకాల సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించారు. ఈ బొమ్మను తాకినప్పుడు అది స్పందిస్తుంది. కొన్ని సందర్భాల్లో తాకేందుకు ప్రయత్నించే సమయంలోనే స్పందిస్తుంది. బొమ్మ వేర్వేరు భాగాలను తాకుతున్నప్పుడు ఏది గుడ్‌ టచ్, ఏది బ్యాడ్‌ టచ్‌ అనేది స్పీకర్‌ ద్వారా శబ్దం వెలువడుతుంది. ఈ బొమ్మ తయారీతో పాటు పనిచేస్తు న్న తీరుపై వాగ్దేవి ఇంజనీరింగ్‌ కాలేజీలోని వాగ్దేవి ఇంక్యుబేషన్‌ అండ్‌ బిజినెస్‌ యాక్సిలిరేటర్‌ (విబా) సీఈఓ ఎంకే కౌశిక్‌ వీడియో రూపొందించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అదేవిధంగా కొందరు చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న వీడియోను కూడా జత చేశారు. దీనిపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ స్పందించారు. ఈ ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ.. సంస్కార్‌ను మరింత అభివృద్ధి పరచాల్సిందిగా తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేవేషన్‌ సెల్‌కు సూచించారు. దీంతో టీఎస్‌ఐసీ అధికారులు సంస్కార్‌ రూపకర్తలతో భేటీ కానున్నారు.

ప్రత్యక్షంగా చూస్తే వేగంగా అవగాహన
చిన్నారుల్లో లైంగిక వేధింపుల విషయమై థియరీ పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించాలనే ఆలోచన ఫలితమే ఈ ‘సంస్కార్‌’. ఇన్నోవేటర్‌ యాకర గణేశ్, నేను చర్చించుకుని ఈ బొమ్మను తయారు చేశాం. ఈ బొమ్మ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూస్తే పిల్లలకు వేగంగా అవగాహన కలుగుతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిద్వారా అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.

- భరద్వాజ్‌ గుండు, యాకర గణేశ్, వాగ్దేవి ఇంజనీరింగ్‌ కాలేజీ, వరంగల్‌

స్కూళ్లలో ప్రయోగాత్మక అవగాహన
సంస్కార్‌ బొమ్మను ముందుగా నాలుగైదు స్కూళ్లలోకి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని మరింత అభివృద్ధి చేస్తాం. భరద్వాజ్, గణేశ్‌ ఆలోచనను దీనికే పరిమితం చేయకుండా ప్రత్యేకంగా ఒక టాయ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. 

- ఎంకే కౌశిక్, వాగ్దేవి ఇంక్యుబేషన్‌ అండ్‌ బిజినెస్‌ యాక్సిలిరేటర్‌ (విబా) సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement