‘గో బిజ్’తో టీ హబ్ అనుసంధానం
- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంతో సర్కారు ఒప్పందం
- విద్య, ఉపాధి అవకాశాలకు తోడ్పాటు.. రాష్ట్రంలో స్టార్టప్‌లకు మరింత ఊతం
- వినూత్న ఆలోచనల మార్పిడికి కొత్త మార్గం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ‘ఐ హబ్’ లతో రాష్ట్రంలోని ‘టీ హబ్’ అనుసంధానం కానుంది. ఇక్కడి సంస్థలు, స్టార్టప్‌లు.. అక్కడి వారితో తమ ఆలోచనలను పంచుకోవడానికి, పరస్పర సహకారానికి మార్గం సుగమం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శని వారం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కె.తారక రామారావు సమక్షంలో... కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయ వాణిజ్య, ఆర్థికాభివృద్ధి(గో-బిజ్) డెరైక్టర్ పనేరియా అవ్డిస్, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సంయుక్త ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ ఇంధనంలో పరస్పర సహకారం, పర్యావరణ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక రంగం, వాణిజ్య ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగం తదితర అంశాలపై ఈ ఒప్పందం కుదిరింది. సిలికాన్ వ్యాలీ, తెలంగాణల మధ్య వినూత్న ఆలోచనల మార్పిడికి దీనితో కొత్త మార్గం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు ప్రాంతాల్లోని స్టార్టప్‌లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. భారత్, కాలిఫోర్నియా మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఇరు ప్రాంతాలు సహజ భాగస్వాములయ్యేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుం దని పనోరియా అవ్డిస్ వ్యాఖ్యానించారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే భారతీయ కంపెనీలు కాలిఫోర్నియాలో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని, భారత మార్కెట్‌తో తమ స్టార్టప్ కంపెనీలు అనుసంధానమయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.
‘ఐ హబ్’లతో అనుసంధానం
రెడింగ్ మొదలుకుని సాన్‌డియాగో వరకు సుమారు 15 ప్రముఖ ‘ఐ హబ్’లు అమెరికాలోనే అతిపెద్ద ‘గో-బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్’గా ఏర్పడ్డాయి. ప్రస్తుత ఒప్పం దం ద్వారా ‘గో బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్’తో టీ-హబ్ అనుసంధానమవుతుంది. తద్వారా టీ హబ్‌లోని సంస్థలు, కంపెనీలతో కాలిఫోర్నియాలోని ‘ఐ హబ్’లు వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది. దీంతో ఇరు ప్రాంతాల నడుమ ఆర్థిక సహకారం, పారిశ్రామిక రంగంలో సంయుక్త పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయి. ఇరు ప్రాంతా ల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగై.. సాంప్రదాయేతర ఇంధన వనరులు, క్లీన్‌టెక్, స్మార్ట్ సిటీలు, నీటి నిర్వహణ, బయో టెక్నాలజీ, అగ్రిటెక్ తదితర రంగాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.