telangana revenue
-
ఖజానా.. ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కినట్టే కనిపి స్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలతో పోలిస్తే.. జూలైలో రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు పెరిగాయని కాగ్ లెక్కలు చెపుతు న్నాయి. ఈ నెలలో ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ.11,633 కోట్ల వరకు సమకూరగా.. అందులో పన్నులు, పన్నేతర ఆదాయం కింద సుమారు రూ.8.5 వేల కోట్లు వచ్చాయి. మరో రూ.3.1 వేల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. అదే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సొంత రాబడుల కన్నా అప్పులు ఎక్కువ చేయడం గమనార్హం. కరోనా కొట్టిన దెబ్బకు మూడు నెలల పాటు విలవిల్లాడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడినట్టేనని, జూలై నెలలో రాబడులే దీనికి సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్లో 28 శాతం... రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనల్లో 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.1.73 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులను అంచనా వేసింది. అందులో తొలి నాలుగు నెలల్లో కలిపి 28 శాతం అంటే రూ.44,025 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఇందులో అప్పులు రూ.20 వేల కోట్లు దాటగా, రాష్ట్ర ప్రభుత్వ రాబడులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపి రూ.24 వేల కోట్ల వరకు వచ్చాయి. ఖర్చు కూడా అదే స్థాయిలో రూ.42 వేల కోట్లు దాటింది. ఇక, మిగతా మూడు నెలలతో పోలిస్తే పన్ను ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా జూలై నెలలో పెరిగాయి. పన్ను ఆదాయమే దాదాపు రూ.6,588 కోట్ల వరకు వచ్చింది. ఇక, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,699 కోట్లు కేంద్రం ఇవ్వగా, పన్నేతర ఆదాయం రూ.200 కోట్లు దాటింది. ఇవన్నీ కలిపి రూ.8.5 వేల కోట్ల వరకు రాగా, మరో రూ.3.1 వేల కోట్లు అప్పులు తేవడంతో ఖజానా దాదాపు రూ.11,633 కోట్లకు చేరింది. అయితే, గత మూడు నెలల్లో కలిపి సరాసరి రూ.4 వేల కోట్లు కూడా పన్ను ఆదాయం రాలేదు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి వచ్చిన పన్ను ఆదాయం రూ.11,893 కోట్లు మాత్రమే. కానీ, ఒక్క జూలై నెలలోనే దాదాపు రూ.6,588 కోట్ల వరకు పన్ను ఆదాయం రావడం గమనార్హం. దీంతో కరోనా బారిన పడి అల్లాడిన ఆర్థిక శాఖ జూలై రాబడులతో కొంత ఊపిరి పీల్చుకుంది -
‘లెక్క’ సరి చేశారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్ల పంపిణీ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పని చేస్తున్న 536 మంది డిప్యూటీ కలెక్టర్లను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల్లో మార్పులు చేసి ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న డీవోపీటీ.. ఏపీకి 322 మంది, తెలంగాణకు 214 మందిని కేటాయించింది. మళ్లీ మార్పు.. డిప్యూటీ కలెక్టర్ల పంపిణీలో అవాంతరాలు ఎదురవడంతో మూడున్నరేళ్లకు ప్రక్రియ పూర్తయింది. పంపిణీ తుది కసరత్తులో భాగంగా ఈ నెల 13న సచివాలయంలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ తాత్కాలిక కేటాయింపులు జరిపింది. ఇందులో 305 మందిని ఏపీ, 231 మందిని తెలంగాణకు కేటాయించింది. కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో పంపిణీ జరగలేదని, తెలంగాణకు ఐదుగురిని అదనంగా కేటాయించి ఆ మేరకు ఐదు పోస్టుల్లో అన్యాయం చేశారని తెలంగాణ రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు తాత్కాలిక కేటాయింపులపై అప్పీల్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడంతో కొందరు మార్పు కోరుకున్నారు. దీనిపై మళ్లీ సమావేశమైన కమిటీ 58:42 నిష్పత్తిని కొనసాగించడంతో పాటు అప్పీళ్లపైనా చర్చించి 322 మందిని ఏపీకి, 214 మందిని తెలంగాణకు కేటాయిస్తూ డీవోపీటీకి ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు ఆమోదిస్తూ డీవోపీటీ తుది ఉత్తర్వులివ్వడంతో పంపిణీ పూర్తయింది. రిటైర్మెంటూ లెక్కే.. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి పనిచేస్తూ ఆ తర్వాత పదవీ విరమణ పొందిన వారి కేటాయింపుల్లోనూ కమిటీ జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుత జాబితా ప్రకారం ఏపీకి కేటాయించిన 322 మందిలో 37 మంది.. తెలంగాణకు కేటాయించిన వారిలో 25 మంది పదవీవిరమణ పొందారు. తెలంగాణ కన్నా ఏపీలో 12 మంది ఎక్కువగా రిటైర్ కావడంతో ఆ మేరకు పదోన్నతులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ కలెక్టర్లను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ 12 పోస్టులతో పాటు తాత్కాలిక కేటాయింపుల్లో తగ్గించిన 5 పోస్టులను కలిపి 17 మందిని అదనంగా ఏపీకి కేటాయించారు. దీంతో 58:42 నిష్పత్తి, డిప్యూటీ కలెక్టర్ల అప్పీళ్లు, రిటైర్మెంట్ను పరిగణనలోకి తీసుకుని జాబితా పూర్తి చేసినట్లయింది. సమ న్యాయం చేశారు ‘పోస్టుల విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా ఇరు రాష్ట్రాలకు కమిటీ సమన్యాయం చేసింది. ప్రక్రియను సజావుగా ముగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉన్నత స్థాయి కమిటీకి కృతజ్ఞతలు.’ – లచ్చిరెడ్డి, టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు -
జీఎస్టీ వల్ల మొదట్లో ఆర్థిక సమస్యలు రావచ్చు
♦ కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది ♦ ఆదాయంపై వచ్చే జనవరిలోనే పూర్తి స్పష్టత ♦ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా తొలిదశలో ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, అయితే, క్రమంగా సర్దుకుని సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు తర్వాత ప్రభుత్వ ఆదాయంపై స్పష్టత వచ్చే జనవరిలోనే వస్తుందని అన్నారు. బుధవారం ఇక్కడ జీఎస్టీపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అమలు వల్ల తెలంగాణ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీలర్లు జూలై నెలకు సంబంధించిన వ్యాపారంపై పన్నును ఆగస్టు 20 కల్లా చెల్లిస్తారని, అప్పటికల్లా ఆదాయ వివరాలకు సంబంధించిన తొలి అంచనాలు వస్తాయని పేర్కొన్నారు., అక్టోబర్ 20 కల్లా ఆదాయం తగ్గుదల, హెచ్చుదలలు కనిపిస్తాయని, జనవరి నెలలో పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటి కల్లా జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.14,037 కోట్లు రావాలని అంచనా వేస్తున్నామని, ఒకవేళ రాకపోయినా తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద ఇస్తుందని చెప్పారు. ఎమ్మార్పీ రేట్లతోపాటు పన్ను రేట్లు కూడా జీఎస్టీపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగిస్తున్నామని, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటి వరకు 54 చోట్ల సదస్సులు ఏర్పాటు చేసి 25 వేల మందికి పైగా డీలర్లకున్న సందేహాలను నివృత్తి చేశామని సోమేశ్‌కుమార్ చెప్పారు. జీఎస్టీ అమల్లో భాగంగా ప్రతి వస్తువు ప్యాక్‌పై ఎమ్మార్పీతోపాటు ఆ వస్తువుపై ఎంత పన్ను రేటు ఉంటుందో కూడా ప్రకటిస్తారని, ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందని ఆయన చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్ల వార్షిక ఆదాయం రూ. 75 లక్షల కన్నా తక్కువ ఉంటే అక్కడ సేవలు పొందే వినియోగదారుల నుంచి ఆయా యాజమాన్యాలు జీఎస్టీ వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి సిరిగిరి విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రస్థానం
హైదరాబాద్ : రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రభాగాన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారమిక్కడ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర స్థితిగతులను వివరించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ మొదలు పెట్టామని, పేదరిక నిర్మూనలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనకబడి ఉన్నాయని, ముఖ్యంగా మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు మరింత వెనకబడి ఉన్నాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. హరితహరాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని కేసీఆర్ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హోటల్ కాకతీయలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.