రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రస్థానం
హైదరాబాద్ : రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రభాగాన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారమిక్కడ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర స్థితిగతులను వివరించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ మొదలు పెట్టామని, పేదరిక నిర్మూనలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో చాలా జిల్లాలు వెనకబడి ఉన్నాయని, ముఖ్యంగా మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు మరింత వెనకబడి ఉన్నాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. హరితహరాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని కేసీఆర్ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హోటల్ కాకతీయలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.