సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్ల పంపిణీ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పని చేస్తున్న 536 మంది డిప్యూటీ కలెక్టర్లను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల్లో మార్పులు చేసి ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న డీవోపీటీ.. ఏపీకి 322 మంది, తెలంగాణకు 214 మందిని కేటాయించింది.
మళ్లీ మార్పు..
డిప్యూటీ కలెక్టర్ల పంపిణీలో అవాంతరాలు ఎదురవడంతో మూడున్నరేళ్లకు ప్రక్రియ పూర్తయింది. పంపిణీ తుది కసరత్తులో భాగంగా ఈ నెల 13న సచివాలయంలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ తాత్కాలిక కేటాయింపులు జరిపింది. ఇందులో 305 మందిని ఏపీ, 231 మందిని తెలంగాణకు కేటాయించింది. కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో పంపిణీ జరగలేదని, తెలంగాణకు ఐదుగురిని అదనంగా కేటాయించి ఆ మేరకు ఐదు పోస్టుల్లో అన్యాయం చేశారని తెలంగాణ రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు తాత్కాలిక కేటాయింపులపై అప్పీల్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడంతో కొందరు మార్పు కోరుకున్నారు. దీనిపై మళ్లీ సమావేశమైన కమిటీ 58:42 నిష్పత్తిని కొనసాగించడంతో పాటు అప్పీళ్లపైనా చర్చించి 322 మందిని ఏపీకి, 214 మందిని తెలంగాణకు కేటాయిస్తూ డీవోపీటీకి ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు ఆమోదిస్తూ డీవోపీటీ తుది ఉత్తర్వులివ్వడంతో పంపిణీ పూర్తయింది.
రిటైర్‌మెంటూ లెక్కే..
రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి పనిచేస్తూ ఆ తర్వాత పదవీ విరమణ పొందిన వారి కేటాయింపుల్లోనూ కమిటీ జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుత జాబితా ప్రకారం ఏపీకి కేటాయించిన 322 మందిలో 37 మంది.. తెలంగాణకు కేటాయించిన వారిలో 25 మంది పదవీవిరమణ పొందారు. తెలంగాణ కన్నా ఏపీలో 12 మంది ఎక్కువగా రిటైర్ కావడంతో ఆ మేరకు పదోన్నతులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా డిప్యూటీ కలెక్టర్లను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ 12 పోస్టులతో పాటు తాత్కాలిక కేటాయింపుల్లో తగ్గించిన 5 పోస్టులను కలిపి 17 మందిని అదనంగా ఏపీకి కేటాయించారు. దీంతో 58:42 నిష్పత్తి, డిప్యూటీ కలెక్టర్ల అప్పీళ్లు, రిటైర్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని జాబితా పూర్తి చేసినట్లయింది.
సమ న్యాయం చేశారు
‘పోస్టుల విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా ఇరు రాష్ట్రాలకు కమిటీ సమన్యాయం చేసింది. ప్రక్రియను సజావుగా ముగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉన్నత స్థాయి కమిటీకి కృతజ్ఞతలు.’
– లచ్చిరెడ్డి, టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment