జీఎస్టీ వల్ల మొదట్లో ఆర్థిక సమస్యలు రావచ్చు
♦ కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది
♦ ఆదాయంపై వచ్చే జనవరిలోనే పూర్తి స్పష్టత
♦ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా తొలిదశలో ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, అయితే, క్రమంగా సర్దుకుని సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు తర్వాత ప్రభుత్వ ఆదాయంపై స్పష్టత వచ్చే జనవరిలోనే వస్తుందని అన్నారు. బుధవారం ఇక్కడ జీఎస్టీపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అమలు వల్ల తెలంగాణ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డీలర్లు జూలై నెలకు సంబంధించిన వ్యాపారంపై పన్నును ఆగస్టు 20 కల్లా చెల్లిస్తారని, అప్పటికల్లా ఆదాయ వివరాలకు సంబంధించిన తొలి అంచనాలు వస్తాయని పేర్కొన్నారు., అక్టోబర్ 20 కల్లా ఆదాయం తగ్గుదల, హెచ్చుదలలు కనిపిస్తాయని, జనవరి నెలలో పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటి కల్లా జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.14,037 కోట్లు రావాలని అంచనా వేస్తున్నామని, ఒకవేళ రాకపోయినా తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద ఇస్తుందని చెప్పారు.
ఎమ్మార్పీ రేట్లతోపాటు పన్ను రేట్లు కూడా
జీఎస్టీపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగిస్తున్నామని, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటి వరకు 54 చోట్ల సదస్సులు ఏర్పాటు చేసి 25 వేల మందికి పైగా డీలర్లకున్న సందేహాలను నివృత్తి చేశామని సోమేశ్‌కుమార్ చెప్పారు. జీఎస్టీ అమల్లో భాగంగా ప్రతి వస్తువు ప్యాక్‌పై ఎమ్మార్పీతోపాటు ఆ వస్తువుపై ఎంత పన్ను రేటు ఉంటుందో కూడా ప్రకటిస్తారని, ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందని ఆయన చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్ల వార్షిక ఆదాయం రూ. 75 లక్షల కన్నా తక్కువ ఉంటే అక్కడ సేవలు పొందే వినియోగదారుల నుంచి ఆయా యాజమాన్యాలు జీఎస్టీ వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి సిరిగిరి విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.