జీఎస్టీని స్వాగతిద్దాం
► వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్
► చారిత్రక మార్పు : కలెక్టర్
కరీంనగర్: జీఎస్టీపై ప్రజలు, వ్యాపారులు అపోహలు పెంచుకోవద్దని.. అందరం స్వాగతిద్దామని వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక పద్మనాయ కల్యాణ మండపంలో ప్రజలు, వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా అందరికీ జీఎస్టీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆగస్టు 15, జనవరి 26న ఎలాగైతే వేడుకలు నిర్వహిస్తామో.. ఇక నుంచి జూలై 1వ తేదీన కూడా ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిన రోజుగా గుర్తించాలని సూచించారు. పలు రాష్ట్రాల్లో విభిన్న పన్ను విధానాలున్నాయని, వాటన్నింటి స్థానంలో దేశం మొత్తం మీద ఒకే పన్ను విధానమే జీఎస్టీ అని అన్నారు. ఇంతకుముందు ఉన్న 15 రకాల పన్ను విధానాలతో పలు శాఖలకు తిరగాల్సి వచ్చేదని.. ప్రస్తుతం ఆ అవసరం ఉండదని పేర్కొన్నారు. మంచి మార్పుకు నాంది పలకాలంటే అందరూ సహకరించాలని కోరారు.
చారిత్రక మార్పు
కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఇది చారిత్రక మార్పు అన్నారు. ఇందులో పలు సమస్యలున్నా.. వాటిని అధిగమించి దేశాన్ని ఆర్థిక అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా చేయాలని కోరారు. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది, చార్టెడ్ అకౌంటెంట్లు, సేల్స్ టాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ వారు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.