మూడు నెలల పాటు ఇబ్బందే!
♦ జీఎస్టీ అమలుపై వాణిజ్య పన్నుల శాఖ అంచనాలు
♦ కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు జాప్యమయితే..
♦ ఆదిలో ఉండే సమస్యల కారణంగా ఆదాయం రాకపోతే..
♦ ఏం చేయాలన్న దానిపై ఉన్నతాధికారుల మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం ఎలా ఉంటుంది, ఆదాయంలో వచ్చే ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఐజీఎస్టీ కింద కేంద్రం తీసుకునే పన్నును రాష్ట్రానికి పంపడంలో జాప్యం జరిగినా.. ఆదిలో ఉండే సమస్యల కారణంగా పన్ను చెల్లింపుల్లో డీలర్ల దగ్గర జాప్యం జరిగినా రాష్ట్ర ఖజానాపై పడే ప్రభావంపై దృష్టి సారించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తొలిమూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని, రాబడిని దృష్టిలో ఉంచుకుని వ్యయాలను నియంత్రించుకోవాలని ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నివేదించినట్టు తెలుస్తోంది.
ఆగస్టు రెండో వారంలో స్పష్టత
రాష్ట్రంపై జీఎస్టీ ప్రభావం ఏ మేరకు ఉందన్న విషయం ఆగస్టు రెండో వారంలోగానీ అనుభవంలోకి వచ్చే పరిస్థితి లేదు. జూలై నెల పన్నుల రాబడిని అంచనా వేసేందుకు అప్పటివరకు సమయం పట్టనుండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖను బలోపేతం చేసుకుని, చర్యలు చేపట్టకపోతే ఖజానాకు నష్టం చేకూరే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రూ. 5,594 కోట్ల పరిస్థితేంటి?
ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సిన బకా యిలు దాదాపు రూ.6 వేల కోట్ల వరకు ఉన్నాయి. అందులో న్యాయపరమైన వివాదాల్లో హైకోర్టు పరి ధిలో రూ.1,960 కోట్లు, సుప్రీంకోర్టు పరిధిలో రూ. 574 కోట్ల బకాయిల కేసులు విచారణలో ఉన్నాయి. సేల్స్‌ట్యాక్స్ ట్రిబ్యునల్ పరిధిలో రూ.1,153 కోట్లు, పన్నుల్లో వ్యత్యాసం కారణంగా వసూలు కాని బకాయిలు రూ.1,907 కోట్ల మేర ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి రానున్నం దున ఈ బకాయిలపై ఏం చేయాలనే వివరణ కోరుతూ కేంద్రానికి ఉన్నతాధికారులు లేఖ రాశారు.
2 నెలలు ఓపిక పట్టండి!
డీలర్లు జీఎస్టీ పరిధిలోకి రావడం, పన్నులు చెల్లించి ఇన్వాయిస్‌లు అప్‌లోడ్ చేయడం వంటి అంశాల విషయంలో రెండు నెలల వరకు కొంత ఓపికగా వ్యవహరించాలని కేంద్రం సూచించినట్టు తెలుస్తోంది. అప్పటివరకు డీలర్లకు ఎలాంటి జరిమానాలూ విధించవద్దని సూచించింది. ఉద్యోగుల జాబ్‌వర్క్ కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ప్రస్తుత విధానంలోనే ఉంటుందని.. ఆన్‌లైన్‌లో ఈ–వే బిల్లుల ద్వారా లావాదేవీలు జరపాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతదారులను నియంత్రించేందుకు రాష్ట్రంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఆ కమిటీకి వచ్చిన ఫిర్యాదులపై డీజీ స్థాయి అధికారితో విచారణ జరిపించి నిర్ణయం తీసుకునే అధికారాలను కూడా కల్పించింది.