ఖజానా.. ఓకే | Telangana Had a Revenue Of Rs 11633 Crore In July | Sakshi
Sakshi News home page

ఖజానా.. ఓకే

Published Mon, Sep 14 2020 3:37 AM | Last Updated on Mon, Sep 14 2020 3:37 AM

Telangana Had a Revenue Of Rs 11633 Crore In July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కినట్టే కనిపి స్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలతో పోలిస్తే.. జూలైలో రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు పెరిగాయని కాగ్‌ లెక్కలు చెపుతు న్నాయి. ఈ నెలలో ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ.11,633 కోట్ల వరకు సమకూరగా.. అందులో పన్నులు, పన్నేతర ఆదాయం కింద సుమారు రూ.8.5 వేల కోట్లు వచ్చాయి. మరో రూ.3.1 వేల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. అదే ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో సొంత రాబడుల కన్నా అప్పులు ఎక్కువ చేయడం గమనార్హం. కరోనా కొట్టిన దెబ్బకు మూడు నెలల పాటు విలవిల్లాడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడినట్టేనని, జూలై నెలలో రాబడులే దీనికి సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

బడ్జెట్‌లో 28 శాతం...
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.1.73 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులను అంచనా వేసింది. అందులో తొలి నాలుగు నెలల్లో కలిపి 28 శాతం అంటే రూ.44,025 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఇందులో అప్పులు రూ.20 వేల కోట్లు దాటగా, రాష్ట్ర ప్రభుత్వ రాబడులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపి రూ.24 వేల కోట్ల వరకు వచ్చాయి. ఖర్చు కూడా అదే స్థాయిలో రూ.42 వేల కోట్లు దాటింది. ఇక, మిగతా మూడు నెలలతో పోలిస్తే పన్ను ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా జూలై నెలలో పెరిగాయి. పన్ను ఆదాయమే దాదాపు రూ.6,588 కోట్ల వరకు వచ్చింది. ఇక, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,699 కోట్లు కేంద్రం ఇవ్వగా, పన్నేతర ఆదాయం రూ.200 కోట్లు దాటింది. ఇవన్నీ కలిపి రూ.8.5 వేల కోట్ల వరకు రాగా, మరో రూ.3.1 వేల కోట్లు అప్పులు తేవడంతో ఖజానా దాదాపు రూ.11,633 కోట్లకు చేరింది. అయితే, గత మూడు నెలల్లో కలిపి సరాసరి రూ.4 వేల కోట్లు కూడా పన్ను ఆదాయం రాలేదు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో కలిపి వచ్చిన పన్ను ఆదాయం రూ.11,893 కోట్లు మాత్రమే. కానీ, ఒక్క జూలై నెలలోనే దాదాపు రూ.6,588 కోట్ల వరకు పన్ను ఆదాయం రావడం గమనార్హం. దీంతో కరోనా బారిన పడి అల్లాడిన ఆర్థిక శాఖ జూలై రాబడులతో కొంత ఊపిరి పీల్చుకుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement