కాల్ డ్రాప్ కు... ఫ్రీ కాల్ ఇస్తే ఓకే!
♦ సుప్రీంకోర్టుకు ట్రాయ్ ప్రతిపాదన
♦ దీనికి అంగీకరిస్తే... కంపెనీలపై
♦ జరిమానాలు విధించబోమని సంకేతం!
న్యూఢిల్లీ: వంద కోట్ల మంది టెలికం వినియోగదారుల ప్రయోజనాలకు తాను రక్షణదారునని సుప్రీంకోర్టు ముందు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ‘ప్రతి కాల్ డ్రాప్’కు సమానంగా ‘ఉచిత కాల్’ సౌలభ్యం కల్పించడానికి టెలికం కంపెనీలు బేషరతుగా అంగీకరిస్తే... దీనిపై (కాల్‌డ్రాప్) జరిమానా విధించాలన్న తమ ఆదేశాన్ని పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ‘కాల్ కటేగా-ముఫ్త్ కాల్ మిలేగా’ స్కీమ్ కింద ప్రతి కాల్ డ్రాప్‌కు ఉచిత కాల్ డ్రాప్‌ను టెలినార్ ఆఫర్ చేసింది. మిగిలిన కంపెనీలు కూడా అలా చేసే వీలుంది.
అయితే ఇక్కడ ఎటువంటి షరతులూ ఉండకూడదు’ అని న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనానికి ట్రాయ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తంగి తెలిపారు. కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం విషయంలో వినియోగదారుకు తగిన పరిహారం చెల్లించే విషయంలో కంపెనీలు తమ ప్రతిపాదన దేనికీ అంగీకరించడం లేదని విన్నవించారు. టెలినార్ కూడా వివిధ షరతులతోనే తాజా ప్రతిపాదన చేసిందని పేర్కొన్న అటార్నీ.. రెండవ ఉచిత కాల్ 24 గంటల లోపే చేయాలని టెలినార్ పేర్కొంటోందని విన్నవించారు. ట్రాయ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ... ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ... యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల సంఘం (సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.