నిలిచిన సేవలు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్ :విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కంప్యూటర్ అడంగల్ జారీ తదితర 180 సేవలకు ఆధారమైన మీ సేవా కేంద్రాలు తొమ్మిది రోజులుగా మూతపడ్డాయి. హుదూద్ తుపాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, ఇప్పుడు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా నెట్వర్క్ వ్యవస్థ పనిచేయక పోవడంతో సేవలు అందని పరిస్థితి. తుపాను ప్రభావంతో ఈ నెల 11 నుంచి విద్యుత్‌ను నిలుపుదల చేశారు. అనంతరం ఆరోజు అర్ధరాత్రి నుంచి వీచిన పెనుగాలులకు జిల్లా అతలాకుతలమైంది. జిల్లా అంతటా విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్లు, కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యూరుు. కొంత ఆలస్యం అయినా జిల్లాలో శని, ఆదివారాల్లో విద్యుత్‌ను అరకొరగా పునరుద్ధరించారు. పట్టణాలు, మండల కేంద్రాలకు కొన్నింటికి విద్యుత్ సరఫరా అవుతోంది. అయినా మీ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. జిల్లాలోని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌నే వినియోగిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌లపై ఆధార పడుతున్నారు. ప్రధాన నెట్వర్క్ అయిన బీఎస్ఎన్ఎల్ కేబుళ్లు పాడవ్వడం, సిగ్నల్స్ అందకపోవడం సమస్యగా మారింది. ప్రైవేటు నెట్వర్క్లదీ అదే పరిస్థితి.
తప్పని ఇక్కట్లు
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, పురపాలక, దేవాదాయ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, సర్వే రికార్డులు, ఖజానాశాఖకు సంబంధించిన ధ్రువపత్రాలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు సంబంధించిన సేవలు మీ సేవ ద్వారా ప్రజలకు అందజేస్తోంది. మీ సేవ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఏడాదిన్నరగా పలు కార్యాలయాల నుంచి నేరుగా మాన్యువల్‌గా ధ్రువపత్రాలు అందజేసే విధానాన్ని నిలిపివేశారు. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు పనిచేయకపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రధానంగా కుల,ఆదాయ ధ్రువపత్రాలు, జనన, మరణ ధ్రువపత్రాలు, రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగల్స్, సబ్‌రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందే ఈసీ(అన్కాంబ్రేషన్ సర్టిఫికేట్స్)లు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నకళ్లు, పత్రాలు, భూముల విలువలు వంటి ధ్రువపత్రాలు పొందేందుకు నానా యూతన పడుతున్నారు. మీ సేవా కేంద్రాల చుట్టే ప్రదక్షణలు చేస్తున్నారు.
ఆదాయూనికి గండి
జిల్లాలో 293 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇతర మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, పెద్దపెద్ద గ్రామాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక మీ సేవా కేంద్రం నుంచి 100 నుంచి 500 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో అరుుతే వంద సేవలు అందజేస్తారు. దీనిని బట్టి రోజుకు సుమారు 30 వేల రకాల సేవలు నిలిచిపోతున్నాయి. సగటున ఈ తొమ్మిది రోజులు సుమారు మూడు లక్షల వరకు మీ సేవలు నిలిచిపోయాయి. మీ సేవ ఆపరేటర్లు కూడా నష్టాల బారిన పడుతున్నారు. ఇప్పటికే అరకొర కమిషన్‌తో నడుపుతున్న మీ సేవలు ఇటువంటి సమస్యలతో మరింత సమస్యల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.
సేవలను పునరుద్ధరిస్తాం
తుపాను ప్రభావంతో మీ సేవలకు అంతరాయం కలిగిందని, క్రమంగా సేవలు పునరుద్ధరిస్తామని ఈడీఎం ఇంద్రసేనారావు తెలిపారు. విద్యుత్, నెట్‌వర్క్‌ల అంతరాయాలు రెండు మూడురోజుల్లో పరిష్కారమవుతాయని చెప్పారు. అంతవరకు వినియోగదారులకు ఇబ్బందులు తప్పవన్నారు.