Telephone conversation
-
ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
కీవ్: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న క్రమంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు సోమవారం ప్రకటించారు. తన శాంతి ఫార్ములాను అమలు చేయడంలో భారత్ పాలుపంచుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. జీ20 దేశాల సదస్సుకు భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించాలని మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడాను. జీ20 ప్రెసిడెన్సీని విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించాను. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా నేను శాంతి ఫార్ములాను ప్రకటించాను. దానిని అమలు చేసేందుకు భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో మానవతా సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను.’ - వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ విషయంపై భారత్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు జెలెన్స్కీతో పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రస్తుతం యుద్ధాలు చేసే సమయం కాదని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ. I had a phone call with @PMOIndia Narendra Modi and wished a successful #G20 presidency. It was on this platform that I announced the peace formula and now I count on India's participation in its implementation. I also thanked for humanitarian aid and support in the UN. — Володимир Зеленський (@ZelenskyyUa) December 26, 2022 ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
త్వరలో మంచిరోజులొస్తాయి: ఆసారాం
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి ‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం) -
చంద్రబాబు రాజీనామా చేయాలి
* వైఎస్సార్సీపీ డిమాండ్ * నేడు నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ మాట్లాడిన టెలిఫోన్ సంభాషణ బట్టబయలైన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై మంగళవారం (9 వ తేదీన) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వీ.మైసూరారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కె.పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అత్తారు చాంద్బాషలతో కలసి విలేకరులతో మాట్లాడారు. అనైతిక చర్యలకు పాల్పడిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ధర్నాలకు పిలుపునిచ్చినట్టు మైసూరారెడ్డి చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ధర్నాలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అవినీతిని ప్రోత్సహించడం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని, ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేనే లేదని మైసూరా చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో తన పాత్ర ఏమిటో విచారణ కోరి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఆ అంశాన్ని మొత్తం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా మార్చి పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇదెంత మాత్రం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య కాదని, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సమస్య అని ఆయన స్పష్టం చేశారు. విచారణ కోరండి: పార్థసారథి తాను నిప్పులాంటి మనిషినని పదే పదే చెప్పుకొనే చంద్రబాబు.. ఓటుకు నోటు వ్యవహారంలో ధైర్యంగా విచారణ జరిపించుకోవాలే తప్ప సాకులు వెద కడం సరికాదని పార్థసారథి అన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడనేలేదని కొందరు, అసలు ముఖ్యమంత్రి ఫోన్‌ను ఎలా ట్యాప్ చేస్తారని ఇంకొందరు, అక్కడక్కడా మాట్లాడింది చేర్చి టేపులు తయారు చేశారని మరి కొందరు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలను సారథి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోతే ఇతరులపై నిందలు వేయడం చూస్తుంటే, దొంగే...దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలి: నల్లా ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టి తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరాలని సూర్యప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తెలంగాణ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభపెట్టే ఆడియో టేపులు బట్టబయలైనందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా డిమండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట సర్కిల్లోని జాతీయ రహదారిపై అవినీతి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. విశాఖ జిల్లాలో ఆందోళన నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.